గాంధీ భవన్ వేదికగా ‘సందీప్’ మార్క్ రాజకీయం
తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త శకానికి ఏఐసీసీ నూతన ఇన్ఛార్జ్ బీఎం సందీప్ కుమార్ శ్రీకారం చుట్టారు. ఇప్పటివరకు అధికారిక నివాసాలు, క్యాంప్ ఆఫీసుల చుట్టూ తిరిగిన రాష్ట్ర రాజకీయాలను ఆయన ఒక్కసారిగా పార్టీ ప్రధాన కార్యాలయం ‘గాంధీ భవన్’ వైపు మళ్లించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, సామాన్య కార్యకర్తలందరికీ గాంధీ భవనే ఏకైక వేదిక అని స్పష్టం చేశారు. దీంతో వ్యక్తుల కంటే పార్టీయే మిన్న అనే బలమైన సంకేతాన్ని ఆయన పంపారు. అయితే, క్షేత్రస్థాయిలో పేరుకుపోయిన అసంతృప్తులు, ప్రొటోకాల్ వివాదాలు, పదవుల పందేరం వంటి సవాళ్లను ఆయన ఏ మేరకు అధిగమిస్తారనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
సందీప్ తీసుకున్న మొదటి నిర్ణయమే పార్టీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. గతంలో పనిచేసిన ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తన నిరాడంబరతకు పేరుగాంచితే, సందీప్ కుమార్ సమానత్వం, క్రమశిక్షణకు ప్రతీకగా నిలుస్తున్నారు. తన రెండు తెలంగాణ పర్యటనల్లోనూ సీఎం అధికారిక నివాసానికి గానీ, MCRHRDలోని క్యాంప్ ఆఫీసుకు గానీ వెళ్లలేదు. కేవలం అత్యంత సున్నితమైన అంశాలైన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వంటి వారి విషయంలో ప్రజాభవన్ గెస్ట్ హౌస్‌లో భేటీ అయ్యారు. మిగతా నేతలందరినీ గాంధీ భవన్‌లోనే కలవడం ద్వారా పార్టీ సంస్థాగత బలోపేతానికి ఆయన పెద్దపీట వేశారు.
అయితే సందీప్ ముందున్న అసలు సవాల్ అంతర్గత కుమ్ములాటలు. ముఖ్యంగా పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఎంపీ గడ్డం వంశీకృష్ణ వర్గాల మధ్య నెలకొన్న విభేదాలు తారస్థాయికి చేరాయి. ప్రభుత్వ కార్యక్రమాల్లో తనకు ప్రొటోకాల్ దక్కడం లేదని, శిలాఫలకాలపై తన పేరు విస్మరిస్తున్నారని వంశీకృష్ణ ఏకంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజుకు ఫిర్యాదు చేసే వరకు వెళ్లడం పార్టీలో సమన్వయ లోపాన్ని ఎత్తిచూపింది. దీనిపై దృష్టి సారించిన సందీప్ కుమార్, శుక్రవారం ధర్మపురి ఎమ్మెల్యే, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌తో ప్రత్యేకంగా సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. ప్రొటోకాల్ బాధ్యత అధికారులదేనని, ఇందులో మంత్రులు గానీ, ఎమ్మెల్యేలు గానీ తప్పుపట్టాల్సిన పనిలేదని లక్ష్మణ్ కుమార్ సర్దిచెప్పే ప్రయత్నం చేసినప్పటికీ, క్షేత్రస్థాయిలో నేతల మధ్య అగాధం స్పష్టంగా కనిపిస్తోంది.
ఇవి కూడా చదవండి
మరోవైపు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌తో జరిగిన సుదీర్ఘ భేటీలో కీలక అంశాలు చర్చకు వచ్చాయి. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో ఉన్న మూడు ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని కొందరు ఎమ్మెల్యేలు పట్టుబడుతుండగా, నామినేటెడ్ పోస్టుల భర్తీ ఆలస్యమవుతుండటంపై ఆశావహుల్లో అసహనం పెరుగుతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండేళ్ల సమయం మాత్రమే ఉన్నందున, వివాదాలను ఎక్కడికక్కడ పరిష్కరించాలని, పదవులు దక్కని వారికి ప్రత్యామ్నాయ అవకాశాలు కల్పించి బుజ్జగించాలని సందీప్ కుమార్ సూచించారు.
త్వరలో జరగనున్న రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా నేతలందరినీ ఏకతాటిపైకి తీసుకురావడం ఇప్పుడు సందీప్ కుమార్ ముందున్న తక్షణ కర్తవ్యం. గాంధీ భవన్‌ను అధికార కేంద్రంగా మార్చిన ఆయన వ్యూహం, క్షేత్రస్థాయిలో నేతల అహాలను కట్టడి చేసి, ప్రభుత్వానికి, పార్టీకి మధ్య వారధిగా ఎంతవరకు పనిచేస్తుందో వేచి చూడాలి.







