2029లోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు.. మధ్యలో రాష్ట్రపతి పాలన?
తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ఒక ఆసక్తికరమైన చర్చ మొదలైంది. 2028 డిసెంబర్‌తో ప్రస్తుత అసెంబ్లీ గడువు ముగియనుంది. అయితే, 2029 మే లేదా జూన్ నెలల్లో సార్వత్రిక ఎన్నికలతో పాటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీ రాజ్యసభ సభ్యుడు కె. లక్ష్మణ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఈ చర్చకు మరింత బలాన్ని చేకూర్చాయి. ఇదే జరిగితే, అసెంబ్లీ గడువు ముగిసినప్పటి నుండి ఎన్నికలు జరిగే వరకు అంటే దాదాపు ఆరు నెలల పాటు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
దేశవ్యాప్తంగా ఒకేసారి అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు, లోక్‌సభకు ఎన్నికలు నిర్వహించడం ఆచరణలో సాధ్యం కాదని కేంద్రం భావిస్తోంది. అందుకే దశలవారీగా ‘ఒకే దేశం – ఒకే ఎన్నిక’ విధానాన్ని అమలు చేయాలని యోచిస్తోంది. ఇందులో భాగంగా లోక్‌సభ ఎన్నికల గడువుకు ఒక ఏడాది అటూ ఇటూగా గడువు తీరే రాష్ట్రాలను గుర్తించి, తొలి దశలో వాటికి జమిలి ఎన్నికలు నిర్వహించాలని ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ జాబితాలో తెలంగాణతో కలిపి సుమారు 17 రాష్ట్రాలు ఉండే అవకాశం ఉంది. ప్రతి ఏటా ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరగడం వల్ల ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారి అభివృద్ధి పనులు కుంటుపడుతున్నాయని, అలాగే ఎన్నికల విధుల్లో ఉపాధ్యాయులు పాల్గొనడం వల్ల విద్యాబోధన దెబ్బతింటోందని కేంద్రం వాదిస్తోంది.
ఇవి కూడా చదవండి
ఈ జమిలి ఎన్నికల ప్రక్రియకు ముందు పార్లమెంటులో కీలక బిల్లులు ఆమోదం పొందాల్సి ఉంది. సోమవారం పార్లమెంటు సమావేశాల్లో డీలిమిటేషన్ బిల్లు, మహిళా రిజర్వేషన్ల బిల్లు ఆమోదం పొందుతాయని, ఆ తర్వాత 2027లో ‘ఒకే దేశం – ఒకే ఎన్నిక’ బిల్లును ప్రవేశపెట్టే ఆలోచన ఉందని తెలుస్తోంది. డీలిమిటేషన్ విషయంలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందన్న ఆందోళనలకు కేంద్రం తెరదించింది. జనాభా ప్రాతిపదికన కాకుండా, ప్రస్తుతం ఉన్న సీట్ల సంఖ్యకు అనుగుణంగా అన్ని రాష్ట్రాల్లోనూ అసెంబ్లీ స్థానాలను 50 శాతం పెంచాలని నిర్ణయించింది. అయితే, ఈ ఏడాది డిసెంబర్ లోగా డీలిమిటేషన్ బిల్లు పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదం పొందకపోతే, ఆ తర్వాత తప్పనిసరిగా జనాభా ప్రాతిపదికనే సీట్లు పెంచాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
2028లో అసెంబ్లీ ఎన్నికలు జరగవని, లోక్ సభ ఎన్నికలతో పాటు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగుతాయని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే పలుమార్లు వెల్లడించారు. ఇప్పుడు లక్ష్మణ్ కూడా ఇదే విషయాన్ని చెప్పారు. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులకు వారం రోజుల్లోనే ఆమోదముద్ర పడుతుందని కేంద్రం గట్టి నమ్మకంతో ఉంది. అదే జరిగితే, వన్ నేషన్- వన్ ఎలక్షన్ దిశగా కేంద్రం వడివడిగా అడుగులు వేసే అవకాశం ఉంది.
మొత్తానికి, 2027లో రాబోయే జమిలి ఎన్నికల బిల్లు, అంతకుముందే తేలాల్సిన డీలిమిటేషన్ బిల్లు భవిష్యత్తుపైనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయం ఆధారపడి ఉంది. ఒకవేళ జమిలి దిశగా అడుగులు పడితే, 2028 చివర్లో రాష్ట్రపతి పాలన, 2029లో సార్వత్రిక ఎన్నికలతో పాటు అసెంబ్లీ పోరుకు తెలంగాణ సిద్ధం కావాల్సి ఉంటుంది.







