డీలిమిటేషన్తో మారనున్న తెలంగాణ రాజకీయ ముఖచిత్రం!
దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన, చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ బిల్లుల అమలు దిశగా కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. దీంతో.. తెలంగాణ రాజకీయ ముఖచిత్రం సమూలంగా మారనుంది. 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన ప్రతి రాష్ట్రంలోనూ 50 శాతం సీట్లను పెంచాలనే ప్రతిపాదన కార్యరూపం దాల్చితే, వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో ప్రజాప్రాతినిధ్యం భారీగా విస్తరించనుంది. దీనివల్ల దశాబ్దాలుగా టికెట్ల కోసం ఎదురుచూస్తున్న ద్వితీయ శ్రేణి నాయకులకు, ముఖ్యంగా మహిళా నేతలకు రాజకీయంగా మహర్దశ పట్టనుంది.
ప్రస్తుతం తెలంగాణలో 17 లోక్సభ, 119 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 50 శాతం పెంపు ప్రతిపాదన అమల్లోకి వస్తే రాష్ట్రంలో లోక్సభ సీట్ల సంఖ్య 26కు చేరుకుంటుంది. ఇక అసెంబ్లీ నియోజకవర్గాల విషయానికి వస్తే రెండు రకాల ప్రతిపాదనలు తెరపైకి వస్తున్నాయి. ప్రస్తుతం ఉన్నట్లుగా ఒక లోక్సభ స్థానం పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల నిష్పత్తిని కొనసాగిస్తే.. 26 ఎంపీ స్థానాలకు గాను ఏకంగా 182 అసెంబ్లీ నియోజకవర్గాలు ఏర్పడతాయి. ఒకవేళ నేరుగా ప్రస్తుత 119 అసెంబ్లీ సీట్లకు 50 శాతం పెంపును వర్తింపజేస్తే, ఆ సంఖ్య 179కి చేరుకుంటుంది. ఏ లెక్కన చూసినా రాష్ట్రంలో దాదాపు 60కి పైగా కొత్త అసెంబ్లీ స్థానాలు అందుబాటులోకి రానున్నాయి.
ఇవి కూడా చదవండి
పునర్విభజన ప్రక్రియలో తొలుత ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను ఖరారు చేసి, ఆ తర్వాత మహిళా రిజర్వేషన్లను అమలు చేయనున్నారు. పెరగనున్న 26 లోక్సభ స్థానాల్లో ఎస్సీలకు 15 శాతం రిజర్వేషన్ కింద 4 సీట్లు, ఎస్టీలకు 2 సీట్లు దక్కనున్నాయి. అసెంబ్లీలో 179 స్థానాలను ప్రామాణికంగా తీసుకుంటే 27 స్థానాలు ఎస్సీలకు, 13 స్థానాలు ఎస్టీలకు రిజర్వ్ అవుతాయి. అదే 182 సీట్లు ఏర్పడితే ఎస్టీ రిజర్వుడు స్థానాలు 28కి పెరుగుతాయి. జనరల్ స్థానాలతో పాటు ఎస్సీ, ఎస్టీ స్థానాల్లోనూ 33 శాతం మహిళా రిజర్వేషన్ వర్తింపజేయడం వల్ల, 26 ఎంపీ సీట్లలో 6 స్థానాలు, 179 అసెంబ్లీ సీట్లలో ఏకంగా 60 స్థానాలు మహిళలకు దక్కుతాయి. అంటే, కొత్తగా పెరిగే 60 అసెంబ్లీ స్థానాలన్నీ మహిళా నేతలకే కేటాయించినట్లవుతుంది.
2008 డీలిమిటేషన్ 2001 జనాభా లెక్కల ప్రకారం జరిగింది. ఆ తర్వాత 2011 నాటికి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా జనాభా 35.75 లక్షల నుంచి 48.1 శాతం వృద్ధితో 52.96 లక్షలకు చేరుకుంది. ఫలితంగా, 2011 జనాభా ప్రాతిపదికన జరిగే పునర్విభజనలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య దాదాపు రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా రాష్ట్ర జనాభాలో మూడింట ఒక వంతు ఉన్న జీహెచ్ఎంసీ, దాని చుట్టుపక్కల కొత్తగా ఏర్పాటైన కార్పొరేషన్లతో పాటు హైదరాబాద్ శివార్లలోని మెదక్, మహబూబ్నగర్ జిల్లాల పరిధిలోనే 50కి పైగా అసెంబ్లీ నియోజకవర్గాలు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి.
జనాభా నియంత్రణ పాటించిన దక్షిణాది రాష్ట్రాలకు డీలిమిటేషన్ వల్ల అన్యాయం జరుగుతుందన్న ఆందోళనల నేపథ్యంలో, అన్ని రాష్ట్రాల్లోనూ సమానంగా 50 శాతం సీట్లు పెంచే విధానం వల్ల దక్షిణాది ప్రాతినిధ్య నిష్పత్తికి ఎలాంటి భంగం వాటిల్లదని ఎన్డీయే నేతలు స్పష్టం చేశారు. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లుకు అన్ని పార్టీలు ఏకగ్రీవంగా మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. మొత్తంగా, ఈ పరిణామాలు తెలంగాణలో అటు పట్టణ ప్రాంతాల ప్రాబల్యాన్ని పెంచడమే కాకుండా, ఇటు కొత్త తరం నాయకత్వానికి, మహిళా సాధికారతకు బలమైన వేదికగా మారనున్నాయి.







