పెట్టుబడుల వేటకు తెలంగాణ సిద్ధం
ప్రపంచ పారిశ్రామిక దిగ్గజాల దృష్టిని ఆకర్షిస్తూ, పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన గమ్యస్థానంగా రాష్ట్రాన్ని నిలిపేందుకు తెలంగాణ ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మక ముందడుగు వేస్తోంది. గత ఏడాది నిర్వహించిన ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’ ఇచ్చిన స్ఫూర్తితో, ఈసారి మరింత భారీ స్థాయిలో ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్–2026’ నిర్వహణకు రంగం సిద్ధమైంది. డిసెంబర్ 7 నుంచి 9 వరకు భారత్ ఫ్యూచర్ సిటీలోని యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ప్రాంగణంలో ఈ మహా సదస్సు జరగనుంది. ‘తెలంగాణ రైజింగ్ విజన్–2047’ లక్ష్యాలను సాకారం చేసే దిశగా, రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చే కీలక వేదికగా ఈ సదస్సు నిలవనుంది.
గతేడాదితో పోలిస్తే ఈ సదస్సు విస్తీర్ణం, స్థాయి ఏకంగా మూడు రెట్లు పెరగడం విశేషం. గతంలో 27,500 చదరపు మీటర్ల పరిధిలో జరిగిన సదస్సు, ఈసారి 80,000 చదరపు మీటర్లకు పైగా విస్తీర్ణంలో అత్యంత వైభవంగా జరగనుంది. కేవలం ఒకే ఎక్స్పో హాల్ స్థానంలో ఇప్పుడు ఆరు భారీ ఎక్స్పో హాళ్లను నిర్మిస్తుండగా, ప్రదర్శనశాలల విస్తీర్ణం 3,200 నుంచి ఏకంగా 60,600 చదరపు మీటర్లకు చేరింది. ప్రధాన సదస్సు వేదికనే 10,000 చదరపు మీటర్లలో తీర్చిదిద్దుతున్నారు. ఈ మెగా ఈవెంట్కు ఇప్పటివరకు 220 మందికి పైగా అంతర్జాతీయ ప్రతినిధులు సహా మొత్తం 1,300 మందికి పైగా ప్రత్యేక ఆహ్వానితులు హాజరయ్యేందుకు అంగీకరించారు. వివిధ రంగాలకు చెందిన 1,059 కంపెనీలు తమ ఉత్పత్తులు, సాంకేతికతను ప్రదర్శించేందుకు ముందుకు రావడం తెలంగాణ పారిశ్రామిక అనుకూల విధానాలకు నిదర్శనం.
ఇవి కూడా చదవండి
ఈ సదస్సు కేవలం పెట్టుబడుల ఒప్పందాలకే పరిమితం కాకుండా, బహుళ రంగాల సమ్మేళనంగా రూపొందింది. రక్షణ రంగానికి చెందిన రక్షా ఎక్స్పో, యానిమేషన్, గేమింగ్ రంగాల కోసం ఇండియా జాయ్, యువ ఆవిష్కర్తల కోసం స్టార్టప్ ఎరీనా ఇందులో ప్రధాన ఆకర్షణలు. వీటికి తోడు క్లైమేట్ కాన్క్లేవ్, ఎడ్యుకేషన్ కాన్క్లేవ్, ట్రైబల్ సమ్మిట్లతో పాటు తెలంగాణ చరిత్ర, సంస్కృతి, పారిశ్రామిక ప్రగతిని చాటిచెప్పే ప్రత్యేక ‘తెలంగాణ పెవిలియన్’ ఏర్పాటు చేస్తున్నారు. ఐటీ, ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక విద్యుత్, ఆహార శుద్ధి పరిశ్రమలతో పాటు ఎంఎస్ఎంఈలు, మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక ప్రాధాన్యత కల్పిస్తూ మూడు రోజుల పాటు 77 కీలక సమావేశాలు నిర్వహించనున్నారు. ఇప్పటికే ఆసక్తి చూపిన కంపెనీల ప్రాజెక్టులను తక్షణమే పట్టాలెక్కించడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు.
సదస్సు విజయవంతానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, గడ్డం వివేక్ సభ్యులుగా ఉన్న మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షిస్తోంది. పది ప్రత్యేక కమిటీలతో పాటు 144 మంది గ్రూప్ 1, 141 మంది గ్రూప్ 2 ప్రొబేషనరీ అధికారులను నిర్వహణ బాధ్యతల్లో భాగస్వాములను చేశారు. మరో విశేషమేమిటంటే, డిసెంబర్ 9న ప్రధాన సదస్సు ముగిసిన తర్వాత, డిసెంబర్ 13 వరకు రక్షా ఎక్స్పో, ఇండియా జాయ్ ప్రదర్శనలను సాధారణ ప్రజలు కూడా సందర్శించే అవకాశం కల్పించారు.
మొత్తంగా కొత్త పరిశ్రమల స్థాపన, యువతకు భారీ ఎత్తున ఉద్యోగ కల్పన, అత్యాధునిక సాంకేతికతను రాష్ట్రానికి తీసుకురావడమే లక్ష్యంగా జరుగుతున్న ఈ సదస్సు, ప్రపంచ పటంలో తెలంగాణను అగ్రగామి ఆర్థిక శక్తిగా నిలబెట్టడంలో కీలక మలుపు కానుంది.







