‘‘సేవా దీపావళి’’ పేరుతో 2 వేల పౌండ్ల ఆహారాన్ని సేకరించిన భారతీయ హిందూ సొసైటీ
దీపావళి పండుగను పురస్కరించుకుని సౌత్ బ్రన్స్విక్ టౌన్‌షిప్‌లోని ప్రవాస భారతీయ హిందూ సొసైటీ మరియు స్థానిక హిందూ సంస్థలు తమ దాతృత్వాన్ని చాటుకున్నాయి. స్థానిక సౌత్ బ్రన్స్విక్ ఫుడ్ పాంట్రీని నింపేందుకు ‘సేవా దీపావళి’ (Sewa Diwali) పేరిట చేపట్టిన ఆహార సేకరణ కార్యక్రమంలో భాగంగా 2,000 పౌండ్లకు పైగా ఆహార పదార్థాలను సేకరించి మున్సిపల్ కాంప్లెక్స్‌లో అందజేశారు.
నవంబర్ 20న తొలి విడత ఆహార పదార్థాలను అధికారులకు అప్పగించగా, ‘థాంక్స్ గివింగ్’ (Thanksgiving) పండుగ తర్వాత మరిన్ని విరాళాలను అందించనున్నట్లు టౌన్షిప్ తెలిపింది.
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వాలంటీర్లు మరియు హిందూ సమాజ సభ్యులకు సౌత్ బ్రన్స్విక్ టౌన్షిప్ మేయర్ చార్లీ కార్లే, కౌన్సిల్ ఉమెన్ పాటీ జర్మైన్, డిప్యూటీ టౌన్షిప్ మేనేజర్ జూలీ ట్రామెల్, పబ్లిక్ అఫైర్స్ కోఆర్డినేటర్ జెన్నిఫర్ పాపీ, ఆఫీస్ ఆన్ ఏజింగ్ డైరెక్టర్ డాన్ నెగ్లియా మరియు సోషల్ సర్వీసెస్ డైరెక్టర్ జీన్ వెర్ట్ స్వయంగా హాజరై కృతజ్ఞతలు తెలిపారు.
ఈ బృహత్తర కార్యక్రమంలో స్థానిక నివాసితులతో పాటు హిందూ స్వయంసేవక్ సంఘ్ (HSS), కోహ్నా (COHNA), శివల్లి కుటుంబ ఆఫ్ నార్త్ అమెరికా, హవ్యక అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా, హిందీ యూఎస్ఏ (HindiUSA), వడ్తాల్ ధామ్ మన్‌మౌత్ జంక్షన్, టింబర్ పాండ్స్, ప్రిన్స్టన్ మానర్, బీక్‌మన్ మానర్, దుర్గా మందిర్ మరియు శ్రీ షిర్డీ సాయిబాబా మందిర్ తదితర సంస్థలు భాగస్వామ్యమయ్యాయి.
ఈ సందర్భంగా కౌన్సిల్ ఉమెన్ పాటీ జర్మైన్ మాట్లాడుతూ.. “స్థానిక కుటుంబాలకు అండగా నిలవడంలో సేవా దీపావళి నిర్వాహకులు మరియు హిందూ సమాజం చూపిస్తున్న నిరంతర దాతృత్వానికి, అంకితభావానికి మేము ఎంతో రుణపడి ఉంటాము. వారి కృషి దీపావళి పండుగ అసలైన అర్థాన్ని చాటిచెప్పడమే కాకుండా, సౌత్ బ్రన్స్విక్ ఐక్యతను, దయాగుణాన్ని ప్రతిబింబిస్తోంది” అని కొనియాడారు.







