చంద్రబాబు పాల్వంచ పర్యటనలో ఆసక్తికర పరిణామం!
తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం పర్యటించారు. ఆయన పర్యటన ఇరు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆసక్తి రేపింది. సాయంత్రం 4.58 గంటలకు పాల్వంచ కలెక్టరేట్ హెలిప్యాడ్‌కు చేరుకున్న చంద్రబాబు దంపతులు, సరిగ్గా 5.35 గంటలకు తిరుగుముఖం పట్టారు. నవ లిమిటెడ్ ఛైర్మన్ దేవినేని అశోక్, రమ దంపతుల ఆహ్వానం మేరకు నవభారత్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగే సుదర్శన హోమంలో పాల్గొనేందుకు చంద్రబాబు దంపతులు విచ్చేశారు. బిజీ షెడ్యూల్ కారణంగా చంద్రబాబు తిరిగి విజయవాడ వెళ్లిపోగా, చిన్న జీయర్ స్వామి ఆధ్వర్యంలో జరిగే యాగంలో పాల్గొనేందుకు నారా భువనేశ్వరి అక్కడే ఉండిపోయారు. అయితే చంద్రబాబు స్వల్ప వ్యవధిలోనే ఒక కీలక రాజకీయ పరిణామం చోటు చేసుకుంది.
హెలిప్యాడ్ వద్ద చంద్రబాబుకు స్వాగతం పలికిన కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఆ కొద్ది సమయంలోనే ఏపీ సీఎంకు ఒక కీలక వినతిపత్రాన్ని అందించారు. 2014 రాష్ట్ర విభజన సమయంలో పోలవరం ప్రాజెక్టు ముంపు పేరిట ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేశారు. నాటి నుంచి భద్రాచలం పట్టణానికి ఆనుకుని ఉన్న ఎనిమిది గ్రామ పంచాయతీలను తిరిగి తెలంగాణలో కలపాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. భద్రాచలం ఆలయ అభివృద్ధికి, ఆ ప్రాంత భౌగోళిక విస్తరణకు ఈ పంచాయతీలు అత్యంత కీలకమని, పరిపాలనాపరంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలంగాణ నేతలు మొదటి నుంచీ వాదిస్తున్నారు. గతంలోనే తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లగా, తాజాగా కూనంనేని నేరుగా వినతిపత్రం ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇవి కూడా చదవండి
మరోవైపు ఈ పర్యటనలో ఆసక్తికరమైన రాజకీయ దృశ్యాలు ఆవిష్కృతమయ్యాయి. ఎన్టీఆర్ పార్టీ పెట్టిన నాటి నుంచి 32 ఏళ్ల పాటు టీడీపీలో కీలక నేతగా, మంత్రిగా పనిచేసిన తుమ్మల నాగేశ్వరరావు, తన పాత బాస్ చంద్రబాబుకు ఆత్మీయ స్వాగతం పలికారు. వీరితో పాటు ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావ్, మాలోతు రాందాస్ నాయక్ కూడా హాజరయ్యారు. 8 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత చంద్రబాబు భద్రాద్రి జిల్లా గడ్డపై అడుగుపెట్టడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా టీడీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపించింది. 2009 ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ కూటమి 5 సీట్లు గెలుచుకున్న చరిత్ర ఉండటంతో, పెద్ద ఎత్తున తరలివచ్చిన కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు.
మొత్తానికి ఒక వైపు ఆధ్యాత్మిక కార్యక్రమం, పాత మిత్రుల కలయికతో ఆహ్లాదకరంగా సాగిన ఈ పర్యటన, మరోవైపు భద్రాచలం విలీన గ్రామాల అంశాన్ని మరోసారి చర్చనీయాంశంగా మార్చింది. రెండు రాష్ట్రాల్లోనూ రాజకీయ సమీకరణాలు మారిన ప్రస్తుత తరుణంలో, విలీన పంచాయతీల విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందిస్తారా లేదా అన్నది వేచి చూడాలి.







