జెన్సన్ హువాంగ్ విషయమై ట్రంప్ రిప్లై, షాకైన జర్నలిస్ట్ లు
జెన్సన్ హువాంగ్ వ్యవహారం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టిస్తోందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన వ్యక్తిగత సంబంధాల గురించి బయటపడిన ఆరోపణలు, చైనా గూఢచర్యంతో ముడిపడిన అనుమానాలు ఇప్పటికే పెద్ద చర్చకు దారితీశాయి. అయితే ఈ వివాదంలో జెన్సన్ హువాంగ్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతుగా నిలవడం మాత్రం అంతకంటే ఎక్కువ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.
ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి ట్రంప్ ఎందుకింత అండగా నిలుస్తున్నారు? అసలు ఆయనకు జాతీయ భద్రతతో సంబంధం ఉన్న అంశాలపై ఏం తెలుసు? అన్న ప్రశ్నలతో మీడియా ఇప్పుడు ట్రంప్‌ను టార్గెట్ చేస్తోంది. తాజాగా జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు ఆయన ఇచ్చిన సమాధానాలు చూస్తే ఈ వివాదం మరింత ఆసక్తికరంగా మారినట్లే కనిపిస్తోంది. ముఖ్యంగా తన దగ్గర చాలా సమాచారం ఉందంటూ ట్రంప్ ఇచ్చిన రిప్లై ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
రాజీనామా చేసిన హువాంగ్.. మళ్లీ సీఈఓగా ఎలా వచ్చారు?
ఈ కథలో అసలు మలుపు నవంబర్ 12న మొదలైంది. ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ రాజీనామా చేశారన్న వార్తలు బయటకు రావడంతో టెక్ ప్రపంచంలో ఒక్కసారిగా చర్చ మొదలైంది. ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని వివాదాలు, ముఖ్యంగా చైనా గూఢచారిగా అనుమానిస్తున్న ఆలిస్ హువాంగ్‌తో ఉన్న సంబంధం గురించి కథనాలు వెలువడటంతో పరిస్థితి మరింత వేడెక్కింది. ఆలిస్ హువాంగ్‌కు జెన్సన్‌తో ఎలాంటి కుటుంబ సంబంధం లేదు. ఆమె సింగపూర్‌కు చెందిన మెగాస్పీడ్ సంస్థలో ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నారు.
అయితే ఇంతటి వివాదం నడుస్తుండగానే జెన్సన్ హువాంగ్ మళ్లీ ఎన్విడియా సీఈఓ కుర్చీలోకి వచ్చేశారు. ఆయన తిరిగి బాధ్యతలు చేపట్టడంలో ట్రంప్ జోక్యం కీలకంగా ఉందని కథనం పేర్కొంది. దీంతో ఈ వ్యవహారం మరింత ఆసక్తికరంగా మారింది. ఒకవైపు ఆరోపణలు, మరోవైపు అమెరికా అధ్యక్షుడి మద్దతు.. ఈ రెండింటి మధ్య అసలు ఏం జరుగుతోందన్న చర్చ మొదలైంది.
ఇవి కూడా చదవండి
హువాంగ్‌పై ట్రంప్‌కు అంత నమ్మకమా?
థ్యాంక్స్‌గివింగ్ సందర్భంగా ఫ్లోరిడాలోని మార్-ఎ-లాగో రిసార్ట్‌లో మీడియాతో మాట్లాడిన ట్రంప్.. జెన్సన్ హువాంగ్ విషయంలో తన వైఖరిని స్పష్టంగా బయటపెట్టారు. ఎన్విడియాకు హువాంగ్ చాలా కీలకమైన వ్యక్తి అని, ఆయన లేకుండా కంపెనీ పరిస్థితి ఎలా ఉంటుందో కూడా చెప్పలేనని వ్యాఖ్యానించారు. ఆయన తిరిగి బాధ్యతలు చేపట్టడం కంపెనీకి మంచి పరిణామమని, తాను తీసుకున్న నిర్ణయం దేశానికి, ప్రపంచానికి కూడా మేలు చేస్తుందని ట్రంప్ అభిప్రాయపడ్డారు.
కంపెనీ షేర్ల కదలికలను కూడా తాను గమనించానని ట్రంప్ చెప్పారు. ఒక దశలో షేర్లు బాగా పడిపోయినా, రోజు ముగిసేసరికి మళ్లీ పుంజుకోవడంతో తాను మంచి నిర్ణయం తీసుకున్నాననే నమ్మకం కలిగిందన్నారు. హువాంగ్ తిరిగి రావడాన్ని తన రెండో పదవీకాలంగా అభివర్ణిస్తున్నారని కూడా చెప్పారు. అంతేకాదు, ఆయన భార్య లోరీ హువాంగ్ను కూడా ప్రత్యేకంగా ప్రశంసించారు. ఆమె చాలా కష్టాలను ఎదుర్కొన్నారని, అయినప్పటికీ అద్భుతమైన మహిళగా నిలిచారని చెబుతూ హువాంగ్ను కూడా గొప్ప వ్యక్తిగా అభివర్ణించారు.
వ్యక్తిగత సంబంధాల వివాదం ఇంకా కొనసాగుతూనే!
హువాంగ్ తిరిగి కంపెనీ బాధ్యతలు చేపట్టినంత మాత్రాన ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివాదాలు ముగిసిపోలేదు. వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం ప్రకారం, తిరిగి బాధ్యతల్లోకి వచ్చిన తర్వాత తనకు ఉన్న మరికొన్ని సంబంధాల గురించి కూడా ఆయన ఎన్విడియా బోర్డుకు వివరించారట. అంతేకాదు, తాను థెరపీ తీసుకుంటున్నట్లు కూడా అంగీకరించినట్లు సమాచారం.
ఆయనకు ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంబంధాల్లో ఎన్విడియా హెల్త్‌కేర్ విభాగం వైస్ ప్రెసిడెంట్ కింబర్లీ పావెల్ పేరు కూడా వినిపిస్తోంది. ఆమె వివాహితురాలని కథనం పేర్కొంది. దీంతో ఈ వ్యవహారం వ్యక్తిగత జీవితానికి మాత్రమే పరిమితం కాకుండా, కంపెనీ ప్రతిష్ఠ, నాయకత్వం వంటి అంశాలపైనా ప్రభావం చూపుతోంది.
అసలు ట్రంప్ దగ్గరున్న సమాచారం ఏమిటి?
ఇక ఈ వివాదంలో అందరికంటే ఎక్కువ ఆలోచనలో పడేస్తున్న అంశం జాతీయ భద్రతకు సంబంధించినదే. ఎన్విడియా తయారు చేసే ఏఐ చిప్‌లు అమెరికాకు మాత్రమే కాకుండా ప్రపంచ టెక్నాలజీ రంగానికి కూడా అత్యంత కీలకం. అలాంటి సంస్థకు నాయకత్వం వహిస్తున్న వ్యక్తికి చైనా గూఢచారిగా అనుమానిస్తున్న మహిళతో సంబంధం ఉందన్న ఆరోపణలు రావడంతో భద్రతాపరమైన ప్రశ్నలు మొదలయ్యాయి.
ఇదే విషయాన్ని జర్నలిస్టులు ట్రంప్ ముందు పెట్టారు. సరైన దర్యాప్తు జరగలేదన్న ఆరోపణలు ఉన్నప్పుడు జెన్సన్ హువాంగ్ అమెరికా జాతీయ భద్రతకు ముప్పు కాదని ఎలా నిర్ధారించగలరని ప్రశ్నించారు. దానికి ట్రంప్ తన దగ్గరున్న సమాచారం, నమ్మకం ప్రకారం హువాంగ్ పూర్తిగా సురక్షితమైన వ్యక్తి అని బదులిచ్చారు.
అయితే జర్నలిస్టులు అంతటితో వదల్లేదు. అసలు మీ దగ్గర ఉన్న సమాచారం ఏమిటో చెప్పాలని మరోసారి ప్రశ్నించారు. దీంతో ట్రంప్ కొంత అసహనానికి గురైనట్లు కనిపించారు. తన దగ్గర చాలా సమాచారం ఉందని, ఆ వివరాల ఆధారంగానే మాట్లాడుతున్నానని సమాధానమిచ్చారు. కానీ ఆ సమాచారం ఏమిటన్నది మాత్రం బయటపెట్టలేదు. చివరకు మీడియా సమావేశాన్నే ముగించేశారు. దీంతో ట్రంప్ ఇచ్చిన ఈ సమాధానం అక్కడున్న జర్నలిస్టులను ఆశ్చర్యానికి గురిచేసింది.
ట్రంప్ మాటలకు జేడీ వాన్స్ వ్యాఖ్యలు భిన్నంగా!
ఈ వ్యవహారంలో మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ట్రంప్ చెబుతున్న మాటలకు ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చేసిన వ్యాఖ్యలకు పొంతన కనిపించడం లేదు. జెన్సన్ హువాంగ్‌పై దర్యాప్తు జరిగిందని, ఆయనకు క్లీన్ చిట్ లభించిందని ట్రంప్ చెబుతుంటే.. అసలు అలాంటి దర్యాప్తే జరగలేదని వాన్స్ వ్యాఖ్యానించారు.
హువాంగ్‌పై ఎలాంటి ముఖ్యమైన దర్యాప్తు జరుగుతున్నట్లు తమకు సమాచారం లేదని సంబంధిత వర్గాలు హామీ ఇచ్చాయని వాన్స్ తెలిపారు. ఆయనపై వచ్చిన ఆరోపణలు వాస్తవ ఆధారాల కంటే పేర్లు వెల్లడించని వ్యక్తుల కథనాలపైనే ఆధారపడి ఉన్నాయని చెప్పారు. దీంతో ట్రంప్ చెబుతున్న దర్యాప్తు వివరాలపై మరిన్ని సందేహాలు మొదలయ్యాయి.
మొత్తానికి..
జెన్సన్ హువాంగ్ వ్యవహారం ఇప్పుడు ఒక వ్యక్తి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివాదంగా మాత్రమే మిగల్లేదు. అమెరికా రాజకీయాలు, ఎన్విడియా భవిష్యత్తు, చైనా సంబంధాలు, జాతీయ భద్రత వంటి కీలక అంశాలతో ముడిపడిపోయింది. ఇలాంటి సమయంలో ట్రంప్ మాత్రం హువాంగ్‌కు గట్టిగా మద్దతు ఇస్తున్నారు. మీడియా మాత్రం ఆయన నిర్ణయాన్ని ప్రశ్నిస్తోంది.
—సూర్య ప్రకాష్ జోశ్యుల







