ట్రంప్‌కు డిసెంబర్ 31 ఎందుకంత కీలకం? సడన్ మీటింగ్ వెనుక అసలు కథ ఇదే!
డిసెంబర్ 31 అంటే అందరికీ కొత్త ఏడాదికి స్వాగతం పలికే రోజు. కానీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మాత్రం ఈ తేదీకి మరో ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉన్నట్టుంది! కొత్త ఏడాది మొదలయ్యేలోపే కొన్ని కీలకమైన పనులు పూర్తి చేయాలనే తొందరలో ఉన్నారా? అందుకే హడావుడిగా ఒక ప్రత్యేక సమావేశానికి తెరతీశారా? ఇంతకీ ఆ సమావేశంలో తీసుకోబోయే నిర్ణయాలేంటి? ట్రంప్‌కు ఇప్పుడే ఈ పనులు పూర్తి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? దీని వెనుక అమెరికా రాజకీయాల్లో మారబోతున్న లెక్కలే అసలు కారణమని తెలుస్తోంది.
కొత్త కాంగ్రెస్ రాకముందే పనులు పూర్తి చేయాలా?
ట్రంప్ ప్రభుత్వం వాషింగ్టన్లో పలు భారీ నిర్మాణ, పునరాభివృద్ధి ప్రాజెక్టులకు ప్రణాళికలు సిద్ధం చేసింది. అయితే వీటికి అవసరమైన అనుమతుల విషయంలో రాబోయే రోజుల్లో పరిస్థితులు మారే అవకాశం ఉంది. ఎందుకంటే జనవరిలో కొత్త కాంగ్రెస్ బాధ్యతలు చేపట్టనుంది. దీంతో ప్రస్తుతం ట్రంప్‌కు అనుకూలంగా ఉన్న నేషనల్ క్యాపిటల్ ప్లానింగ్ కమిషన్లోనూ రాజకీయ సమీకరణాలు మారిపోనున్నాయి.
ఈ నేపథ్యంలోనే కమిషన్ చైర్మన్, వైట్‌హౌస్ అధికారి మార్క్ పావోలెట్టా డిసెంబర్ 31న ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. వచ్చే నెలలో మరో ప్రత్యేక ఎగ్జిక్యూటివ్ సమావేశం కూడా నిర్వహించనున్నారు. ఈ మేరకు శుక్రవారం కమిషన్ సభ్యులకు ఈమెయిల్ పంపించారు. సమావేశానికి సంబంధించిన తాత్కాలిక ఎజెండాను త్వరలో వెల్లడించనున్నట్లు అందులో పేర్కొన్నారు.
ఇంతకీ ట్రంప్ ఏం నిర్మించాలనుకుంటున్నారు?
ఈ ప్రత్యేక సమావేశం ఎందుకు ఇంత ప్రాధాన్యత సంతరించుకుందంటే.. ట్రంప్ ప్రతిపాదించిన కొన్ని కీలక ప్రాజెక్టులకు తుది ఆమోదం పొందే అవకాశం ఉంది. అందులో ముఖ్యంగా ఈస్ట్ పొటోమాక్ పార్క్‌లోని గోల్ఫ్ కోర్సును పూర్తిగా ఆధునికీకరించే ప్రణాళిక ఒకటి. ఇప్పటికే ఈ గోల్ఫ్ కోర్సు పునరాభివృద్ధిపై ట్రంప్ ప్రభుత్వం దృష్టి పెట్టింది.
అంతేకాదు, ఐసెన్‌హోవర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస్ బిల్డింగ్‌కు కొత్తగా రంగులు వేయాలన్న ప్రతిపాదన కూడా ఉంది. వాషింగ్టన్‌లోని వెస్ట్ పొటోమాక్ పార్క్‌లో ఉన్న టైడల్ బేసిన్ ప్రాంతాన్ని మరో కొత్త రూపులో తీర్చిదిద్దాలని భావిస్తున్నారు. అమెరికా చరిత్రలో ప్రముఖులుగా నిలిచిన వ్యక్తుల విగ్రహాలతో ‘నేషనల్ గార్డెన్ ఆఫ్ అమెరికన్ హీరోస్’ పేరుతో భారీ ఉద్యానవనాన్ని ఏర్పాటు చేయాలన్నది కూడా ట్రంప్ ప్రణాళికల్లో భాగమే.
ఇలా ఒక్క గోల్ఫ్ కోర్సుతో ఆగకుండా పార్కులు, ప్రభుత్వ భవనాలు, స్మారక నిర్మాణాల వరకు ట్రంప్ తనదైన ముద్ర వేయాలని చూస్తున్నారు.
జనవరి నుంచి ట్రంప్‌కు అసలు సమస్య మొదలవుతుందా?
ఇక్కడే అసలు రాజకీయ లెక్కలు మొదలవుతున్నాయి. నేషనల్ క్యాపిటల్ ప్లానింగ్ కమిషన్‌లో మొత్తం 12 మంది సభ్యులు ఉంటారు. వీరిలో ఆరుగురు ట్రంప్ ప్రభుత్వ నియంత్రణలో ఉండగా, మరో ఇద్దరు కాంగ్రెస్‌లోని రిపబ్లికన్ పార్టీ కమిటీల అధ్యక్షులు. మిగిలిన నలుగురు వాషింగ్టన్కు ప్రాతినిధ్యం వహించే అధికారులు.
అయితే జనవరిలో కొత్త కాంగ్రెస్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రస్తుతం రిపబ్లికన్ల చేతిలో ఉన్న రెండు స్థానాలు డెమోక్రాట్లకు వెళ్లనున్నాయి. దీంతో కమిషన్‌లో ఇరు వర్గాల బలం చెరో ఆరుకు చేరుతుంది. అంటే ఏదైనా ప్రాజెక్టుపై ఓటింగ్ జరిగితే 6-6తో సమానంగా నిలిచిపోయే పరిస్థితి రావచ్చు.
కమిషన్ నిబంధనల ప్రకారం ఓటింగ్‌లో సమాన ఓట్లు వస్తే ఆ ప్రాజెక్టుకు ఆమోదం లభించదు. దీంతో ట్రంప్ ప్రతిపాదించిన నిర్మాణ ప్రాజెక్టులు ముందుకు వెళ్లడం కష్టమవుతుంది. కొత్త కాంగ్రెస్ రాకతో ఈ పరిస్థితి ఏర్పడే అవకాశం ఉండటంతోనే డిసెంబర్ 31 సమావేశం ప్రాధాన్యత పెరిగింది.
ఇప్పటికే ఒక భారీ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్.. అదేంటో తెలుసా?
ట్రంప్ ప్రతిపాదించిన ప్రాజెక్టుల్లో ఇప్పటికే ఒకదానికి కమిషన్ ఆమోదం తెలిపింది. అది ఆయన నిర్మించాలనుకుంటున్న భారీ విజయ తోరణం (Triumphal Arch). ఈ నెల ప్రారంభంలో జరిగిన ఓటింగ్‌లో 12 మంది సభ్యుల్లో ఎనిమిది మంది అనుకూలంగా, నలుగురు వ్యతిరేకంగా ఓటు వేయడంతో ప్రాజెక్టుకు ఆమోదం లభించింది.
అయితే ఈ ప్రతిపాదనను వ్యతిరేకించిన నలుగురిలో వాషింగ్టన్కు ప్రాతినిధ్యం వహించే సభ్యులంతా ఉన్నారు. డీసీ కౌన్సిల్ చైర్మన్ ఫిల్ మెండెల్సన్ కూడా ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఓటు వేశారు. అంటే ట్రంప్ ప్రాజెక్టుల విషయంలో కమిషన్‌లో ఇప్పటికే భిన్నాభిప్రాయాలు ఉన్నాయన్నమాట.
డిసెంబర్ 3, డిసెంబర్ 31.. ఈ రెండు తేదీల్లో ఏం జరగబోతోంది?
కమిషన్ ఇప్పటికే డిసెంబర్ 3న సాధారణ సమావేశం నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ సమావేశంలో ఈస్ట్ పొటోమాక్ పార్క్ గోల్ఫ్ కోర్సు ఆధునికీకరణ, వెస్ట్ పొటోమాక్ పార్క్‌లోని టైడల్ బేసిన్ పునరాభివృద్ధి ప్రతిపాదనలను పరిశీలించి ప్రాథమిక ఆమోదం తెలిపే అవకాశం ఉంది.
ఆ తర్వాత డిసెంబర్ 31న జరగనున్న ప్రత్యేక సమావేశంలో ఈ రెండు ప్రాజెక్టులతో పాటు ఐసెన్‌హోవర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస్ బిల్డింగ్‌కు రంగులు వేయాలన్న ప్రతిపాదనకు కూడా తుది ఆమోదం తీసుకోవాలని అధికారులు భావిస్తున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు వెల్లడించారు. అయితే ఈ వివరాలను అధికారికంగా వెల్లడించని కారణంగా పూర్తి ఎజెండా ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది.
ట్రంప్ ప్రాజెక్టులకు ఇదే కీలకమైన మలుపా?
ఒకవైపు ట్రంప్ ప్రభుత్వం తన నిర్మాణ ప్రణాళికలను ముందుకు తీసుకెళ్లాలని చూస్తుంటే, మరోవైపు కొత్త కాంగ్రెస్‌లో మెజారిటీ సాధించనున్న డెమోక్రాట్లు వాటిని అడ్డుకునేందుకు సిద్ధమవుతున్నారు. ట్రంప్ ప్రతిపాదించిన నిర్మాణ ప్రాజెక్టులను నిలిపివేస్తామని వారు ఇప్పటికే ప్రకటించారు.
—సూర్య ప్రకాష్ జోశ్యుల







