ఒకప్పుడు రాజభోగాలు.. ఇప్పుడు దివాళాతో కోర్టు మెట్లు! మిట్టల్ కుటుంబానికి ఏమైంది?
ఒకప్పుడు ఆ కుటుంబంలో పెళ్లి జరుగుతుందంటే చాలు.. ప్రపంచమంతా అటువైపే చూసేది! పెళ్లి కోసం వందల కోట్లు ఖర్చు చేయడం, విదేశాల్లోని రాజభవనాలను తలపించే వేదికల్లో వేడుకలు నిర్వహించడం, అతిథుల కోసం ప్రత్యేకంగా వందల మంది చెఫ్‌లను విమానాల్లో తీసుకురావడం.. ఇవన్నీ ఆ కుటుంబానికి మామూలు విషయాలే! కానీ ఇప్పుడు అదే కుటుంబం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు పెళ్లిళ్లకే రూ.400 కోట్లకు పైగా ఖర్చు చేసిన ఇంట్లో.. ఇప్పుడు రూ.357 కోట్ల విలువైన ఇంటిని కాపాడుకోవడమే పెద్ద సవాలుగా మారింది. బ్యాంకు ఆ ఇంటిని అమ్మేయాలని చూస్తుంటే, ఇంటిని వదులుకోవడానికి ఇష్టపడని భార్య కోర్టులో పోరాడుతున్నారు. అసలు ఇంతకీ ఆ కుటుంబానికి ఏమైంది? కోట్ల ఆస్తులున్నా సొంత ఇంటిని కాపాడుకోవాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది?
షారుఖ్ ఖాన్ ఇంటి పక్కనే రూ.357 కోట్ల భవనం!
ఈ కథలో ప్రధానంగా వినిపిస్తున్న పేరు ప్రమోద్ మిట్టల్. ప్రముఖ స్టీల్ వ్యాపారవేత్త, ప్రపంచ కుబేరుల్లో ఒకరైన లక్ష్మీ మిట్టల్‌కు ఈయన తమ్ముడు. ఒకప్పుడు అంతర్జాతీయ వ్యాపార వర్గాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రమోద్.. ఇప్పుడు దివాళా, అప్పులు, న్యాయపరమైన వివాదాలతో వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఆయన కుటుంబం లండన్‌లోని తమ విలాసవంతమైన ఇంటిని కాపాడుకునేందుకు చేస్తున్న ప్రయత్నం చర్చనీయాంశంగా మారింది.
లండన్‌లోని అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో ఒకటైన మేఫెయిర్‌లో ఉంది ‘రెనైసాన్స్ కోర్ట్’. దీని విలువ సుమారు 29.5 మిలియన్ పౌండ్లు. మన కరెన్సీలో చెప్పాలంటే దాదాపు రూ.357 కోట్లు! ఈ భవనం మరో ప్రత్యేకత ఏమిటంటే.. బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుఖ్ ఖాన్ లండన్ నివాసానికి నడిచి వెళ్లేంత దగ్గరలోనే ఉంటుంది. ఇంతటి ఖరీదైన ప్రాంతంలో ఉన్న ఈ ఇంట్లో ప్రమోద్ భార్య సంగీత మిట్టల్ దాదాపు మూడు దశాబ్దాలుగా నివసిస్తున్నారు.
1998లో ఈ ఆస్తిని సుమారు 8.8 మిలియన్ పౌండ్లకు (అప్పటి విలువ ప్రకారం రూ.106 కోట్లు) కొనుగోలు చేశారు. ప్రమోద్ తండ్రి, దివంగత స్టీల్ వ్యాపారవేత్త మోహన్ లాల్ మిట్టల్ సహకారంతో ఈ ఇల్లు కొనుగోలు చేసినట్లు సంగీత చెబుతున్నారు. అప్పట్లో కోల్‌కతా నుంచి లండన్‌కు వచ్చిన ఆమె.. కుటుంబంతో కలిసి ఇక్కడే స్థిరపడ్డారు. అప్పటి నుంచి ఈ భవనమే ఆమెకు నివాసంగా మారిపోయింది.
ఇంటిని అమ్మేయాలని చూస్తున్న బ్యాంకు.. అడ్డుపడుతున్న భార్య!
ఇంతకీ ఇన్నేళ్లుగా నివాసంగా ఉన్న ఆ ఇంటిని ఇప్పుడు అమ్మేయాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? అసలు సమస్య ఇంటి యాజమాన్యం, బ్యాంకు రుణాల దగ్గర మొదలైంది. ఈ ఆస్తి యాజమాన్యం తర్వాత బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్‌లో రిజిస్టర్ అయిన ‘మీడ్స్వెల్ ఎస్టేట్స్ లిమిటెడ్’ అనే కంపెనీ చేతుల్లోకి వెళ్లింది. ఆ కంపెనీ బార్క్లేస్ బ్యాంక్ నుంచి రుణాలు తీసుకుని ఈ భవనాన్ని తనఖా పెట్టింది.
అయితే తీసుకున్న అప్పులకు వాయిదాలు చెల్లించడంలో కంపెనీ విఫలమైంది. దీంతో బార్క్లేస్ బ్యాంక్ చర్యలకు దిగింది. 2023 ఏప్రిల్ 19న ఈ ఆస్తి వ్యవహారాలను చూసుకునేందుకు రిసీవర్లను నియమించింది. రుణ బకాయిలను వసూలు చేసుకోవాలంటే తనఖా పెట్టిన ఆస్తిని స్వాధీనం చేసుకుని విక్రయించే హక్కు తమకు ఉందన్నది బ్యాంకు వాదన. అందుకే ఇంటిని ఖాళీ చేయించి అమ్మేందుకు ప్రయత్నిస్తోంది.
కానీ సంగీత మిట్టల్ మాత్రం దీనికి అంగీకరించడం లేదు. ఈ ఇంటిపై తనకు కూడా హక్కులు ఉన్నాయని, జీవితాంతం ఇక్కడే నివసించే హామీ తనకు ఇచ్చారని ఆమె వాదిస్తున్నారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఆ హామీని నమ్మే కోల్‌కతా నుంచి లండన్‌కు వచ్చానని, దాదాపు 30 ఏళ్లుగా ఈ ఇంటినే తన నివాసంగా చేసుకున్నానని చెబుతున్నారు. తనకు ఉన్న హక్కులను గుర్తించాలని హైకోర్టును ఆశ్రయించారు.
ఈ వివాదంలో కుటుంబ ట్రస్టులు, విదేశీ కంపెనీలు, ఆస్తి యాజమాన్యం, బ్యాంకు రుణాలు ఇలా చాలా అంశాలు ముడిపడి ఉన్నాయి. గతంలో రిసీవర్ల నియామకాన్ని సవాలు చేసేందుకు సంగీత చేసిన ప్రయత్నానికి హైకోర్టు అనుమతి నిరాకరించింది. మరోవైపు బకాయిల వసూలు కోసం ఓ న్యాయ సంస్థ సంగీతతో పాటు ఆమె ఇద్దరు కుమార్తెలు వర్తిక, శ్రిష్టి, కుమారుడు దివ్యేష్పైనా చర్యలు ప్రారంభించింది. దీంతో కుటుంబం చుట్టూ న్యాయపరమైన చిక్కులు మరింత పెరిగాయి.
కూతురి పెళ్లికి రూ.400 కోట్లు.. అప్పట్లో ప్రపంచమంతా ఇదే చర్చ!
ఇప్పుడు ఈ కుటుంబం ఎదుర్కొంటున్న పరిస్థితులు చూస్తుంటే ఒకప్పుడు జరిగిన వేడుకలు గుర్తుకురాక మానవు. ముఖ్యంగా ప్రమోద్ మిట్టల్ కుమార్తె శ్రిష్టి వివాహం అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 2013లో స్పెయిన్‌లోని బార్సిలోనాలో జరిగిన ఈ మూడు రోజుల పెళ్లి వేడుక కోసం ప్రమోద్ సుమారు 50 మిలియన్ పౌండ్లు ఖర్చు చేసినట్లు వార్తలు వచ్చాయి. అప్పటి మారకపు విలువ ప్రకారం ఇది రూ.400 కోట్లకు పైమాటే!
పెళ్లి వేడుకల కోసం బార్సిలోనాలోని ఓ ప్రముఖ పబ్లిక్ మ్యూజియంను ప్రత్యేకంగా ఉపయోగించారు. మ్యూజికల్ ఫౌంటెయిన్లు, భారీ అలంకరణలు, విలాసవంతమైన విందులతో వేడుకను ఓ రాజభవనంలో జరుగుతున్న ఉత్సవంలా నిర్వహించారు. అతిథులకు వంటకాలు సిద్ధం చేసేందుకు భారత్, థాయ్‌లాండ్ నుంచి సుమారు 200 మంది బట్లర్లు, వంటవాళ్లు, చెఫ్‌లను ప్రత్యేకంగా విమానాల్లో తీసుకొచ్చారు. రెండు మిషెలిన్ స్టార్లు పొందిన చెఫ్ కూడా వంటకాల బాధ్యతలు చూసుకున్నారు.
ఒక పెళ్లి కోసం ఇన్ని ఏర్పాట్లు చేయడం అప్పట్లో అందరినీ ఆశ్చర్యపరిచింది. మిట్టల్ కుటుంబం విలాసాలకు ఎంత ప్రాధాన్యం ఇస్తుందో చెప్పడానికి ఈ ఒక్క వేడుకే ఉదాహరణగా నిలిచింది.
ఇవి కూడా చదవండి
అన్న లక్ష్మీ మిట్టల్ కుమార్తె పెళ్లి కూడా ఓ సంచలనమే!
ప్రమోద్ మిట్టల్ అన్నయ్య లక్ష్మీ మిట్టల్ కుటుంబంలోనూ ఇలాంటి ఆడంబరాలకు కొదవలేదు. 2004లో తన కుమార్తె వనిషా మిట్టల్ వివాహాన్ని పారిస్‌లో అద్భుతంగా నిర్వహించారు. వారం రోజుల పాటు జరిగిన ఈ వేడుకల్లో వెర్సైల్లెస్ ప్యాలెస్‌లో వివాహ కార్యక్రమం ఏర్పాటు చేయడంతో పాటు, ప్రముఖ పాప్ సింగర్ కైలీ మినోగ్ ప్రత్యేకంగా సంగీత ప్రదర్శన ఇచ్చారు. ఈఫిల్ టవర్‌పై బాణసంచా కాల్చి వేడుకలకు మరింత ప్రత్యేకత తీసుకొచ్చారు.
ఇక ప్రమోద్ కుటుంబంలో పెద్ద కుమార్తె వర్తిక వివాహం 2011లో ఇస్తాంబుల్‌లోని ప్రసిద్ధ సిరాగన్ ప్యాలెస్‌లో మూడు రోజుల పాటు జరిగింది. 2023లో కుమారుడు దివ్యేష్ తన చిరకాల భాగస్వామి జేక్ ప్రైర్ను ఇంగ్లండ్‌లోని కౌవర్త్ పార్క్ అనే ఐదు నక్షత్రాల హోటల్లో వివాహం చేసుకున్నారు. ఈ వేడుకను అప్పట్లో ‘తొలి భారీ భారతీయ గే వెడ్డింగ్’గా అభివర్ణించారు.
ఇలా మిట్టల్ కుటుంబంలో ప్రతి పెళ్లి ఓ అంతర్జాతీయ వేడుకలా సాగేది. ఖర్చు ఎంత? ఏర్పాట్లు ఎలా? ఎవరెవరు వచ్చారు? అనే విషయాలే అప్పట్లో వార్తల్లో నిలిచేవి. కానీ ఇప్పుడు అదే కుటుంబం ఎదుర్కొంటున్న పరిస్థితులు చూస్తుంటే కాలం ఎంత వేగంగా మారుతుందో అనిపించక మానదు.
12 నెలల్లో ముగియాల్సిన దివాళా.. ఆరేళ్లయినా అదే పరిస్థితి!
ప్రమోద్ మిట్టల్ ఆర్థిక పరిస్థితి ఒక్కసారిగా కుప్పకూలలేదు. ఆయనను 2020 జూన్ 19న బ్రిటన్‌లో అధికారికంగా దివాళా తీసిన వ్యక్తిగా ప్రకటించారు. సాధారణంగా దివాళా ప్రక్రియలో 12 నెలల తర్వాత ఆటోమేటిక్‌గా డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఆ వ్యక్తి దివాళా స్థితి నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. కానీ ప్రమోద్ విషయంలో మాత్రం అలా జరగలేదు.
దివాళా ప్రక్రియలో అధికారులకు సహకరించడం, తన బాధ్యతలను సక్రమంగా నెరవేర్చడం వంటి అంశాలపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. దీంతో 2023 ఏప్రిల్‌లో హైకోర్టు ఆయన డిశ్చార్జ్‌ను నిలిపివేసింది. ఫలితంగా ఇప్పటికీ ఆయన బ్రిటన్ దివాళా రిజిస్టర్లో కొనసాగుతున్నారు.
ఇక వ్యాపార వ్యవహారాలకు సంబంధించి బోస్నియాలోనూ ప్రమోద్‌కు న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యాయి. 2023 జనవరిలో అక్కడి కోక్ ప్లాంట్‌కు సంబంధించిన వ్యవహారంలో వ్యవస్థీకృత నేరాలు, అధికార దుర్వినియోగానికి సంబంధించిన ఆరోపణలు ఆయనపై వచ్చాయి. స్థానిక ప్రభుత్వంతో కలిసి నిర్వహించిన ప్లాంట్ నుంచి 12 మిలియన్ డాలర్లను అక్రమంగా మళ్లించారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.
2026లో ఆయన తండ్రి మోహన్ లాల్ మిట్టల్ మరణించడంతో కుటుంబానికి మరో పెద్ద లోటు ఏర్పడింది. ఇలా ఒకవైపు వ్యాపార, ఆర్థిక సమస్యలు.. మరోవైపు న్యాయపరమైన వివాదాలు కుటుంబాన్ని చుట్టుముట్టాయి.
—సూర్య ప్రకాష్ జోశ్యుల







