కథ 7: దిదృక్ష – రావి కొండలరావు
Ravi Kondala Rao Hasya Kathalu – Part7
కిక్కిరిసిపోయిన ఒకానొక రైలుపెట్టెలో కిందా మీదా జనం కూచుని వున్నారు.. కూచోగా ఒకడిని ఆనుకుని ఒకడు నించుని వున్నారు. నించోగా సీట్లకింద కాళ్లూ బారజాపుకుని ఇద్దరు ముగ్గురు నిద్రపోతూ కలలు కూడా కంటున్నారు! ఆ స్టేషన్లో బండి ఆగి అరగంట దాటింది. ఇప్పట్లో అది కదిలే సూచనలేవీ కనిపించటం లేదు. ఇంతమందితో తొక్కిడిగా వున్న ఆపెట్టెలో తనకు కూడా వేరేచోటు ఎక్కడని, వాయుదేవుడు ఆ ప్రాంతాలకే రావటం మానేశాడు!
“అమ్మమ్మమ్మో వున్నట్టుండి ఏ మూలనుంచో.
నా చెయ్యి నా చెయ్యి” అన్నాడొక ప్రయాణీకుడు
“నా కాలు నా కాలు” అన్నాడు మరొకడు మరో మూలనుంచి.
“రైలు ప్రయాణం అంటే నరకం ఐపోయిందిరా బాబూ” అని ఒక గొంతు. “కాస్త సర్దుకోండి” అని మరోకంఠం.
“నీ దుంపతెగ
“ఎక్కడ, ఎక్కడ సర్దుకోమని తమ సెలవు?” అన్నాడు ఆ స్టేషన్లో బండెక్కిన శేషగిరి. అంటూనే కాస్త వెనక్కు తగ్గేసరికి ‘అమ్మో’ అన్నాడో కుర్రాడు కాళ్లకింద. కాళ్లకింద కూచున్నావేం?” అన్నాడు శేషగిరి తప్పంతా వాడిదేనని పెట్టెలో వాళ్లంతా భావించేట్టు. అంతటితో వూరుకోకుండా రెండుచేతులూ పైకి విసిరాడు. ఆ విసరటంలో అతని కుడిచెయ్యి – పైన కూచుని కింద వింతలు చూస్తున్న వాడి గడ్డానికి కొట్టుకుంది. ‘కుంయో’ మన్నాడు వాడు. ఒకడు ‘బోయ్’ మని ఆవులించాడు, ఒకడు “ఛెఘే” మని దగ్గాడు. నలుగురు దమ్ములు కొడుతు న్నారు. ఇద్దరు గురకలు పెడుతున్నారు… ఈ వాతావరణం శేషగిరికి దుర్భర మనిపించింది. మదరాసు చేరుకునే వరకూ తను ఇట్లా ఈ నరకంలో గడపాల్సిందేనా! ఈ రామ రామ! నరకం ఇంతకంటే బాగా నయం. అక్కడ కూచోటానికి చోటయినా వుంటుంది.
ఎవడినో ఉద్దరించినట్టు బండి కదిలింది. ‘అమ్మ’ అన్నారు ప్రయాణీకులంతా ‘కోరస్’లో. శేషగిరి బండి కుదుపుతో వెనక్కుపడ్డాడు. ఆ పడటం కొంతవరకు లాభించింది. తంతే బూరగంపలో పడ్డవాడల్లే శేషగిరి కిటికీకి దగ్గరగా పడ్డాడు. వున్నంతలో విశాలంగా వున్నట్టు కనిపించింది….
“ఏవూరండీ?” అన్నాడొక ప్రయాణీకుడు శేషగిరిని వుద్దేశించి ఆ సందులోనే.
“మద్రాసు. మీరు చూసే ఈ సినిమాలన్నీ మావూళ్లోనే తీస్తారు” అన్నాడు. శేషగిరి గొప్పగా. ఈ వాక్యం ముగిసే లోగానే, శేషగిరికి ఎనమండుగురు ప్రయాణీకుల అవతలగా ఒంటికాలుమీద నించునివున్న ఒక యువ ప్రయాణీకుడు, ఇంతమందినీ తోసుకుంటూ, ఈదుకుంటూ శేషగిరి దగ్గరపడి అతనిచుట్టూ మూగాడు! “మీది నిజంగానే మద్రాసుటండీ?” అన్నాడా యువకుడు.
“అవును”
శేషగిరికి ఇంకోకడు పక్కగా మూగాడు….
పదిహేను నిముషాల్లో శేషగిరికి బెంచీ మీద కూచునేందుకు చోటు దొరికింది.
అతని వూపిరి పీల్చుకోనివ్వకుండా చుట్టుముట్టి, ప్రయాణీకులు.ప్రశ్నలడిగేస్తున్నారు.
”షూటింగులు చూశారా?’ ‘వాహినీలో ఫ్లోర్లెన్ని?” “రేలంగి ఇవతలకూడా అలాగే వుంటాట్ట!” – ఇటువంటివే లక్షలు.
అన్నిటికీ శేషగిరి వీలైనంతమట్టుకు జవాబులు చెబుతున్నాడు.
శేషగిరిది. మదరాసు కాకపోయినా, ఒకసారి చూసి వచ్చాడు గనక సమాధానా లివ్వగలిగాడు.
వీళ్ళ సందేహాలకు ఆ పెట్టెలో శేషగిరి, నాలుగైదు రాజ్యాల్ని పరిపాలించే మహారాజైపోయాడు. అతని మాటలో అంత ధీమా, కూచోటంలో అంత పోజూ, తలతిప్పుతూ చేతులు ఎగరెయ్యటంలో అంత దర్జా – అన్నీ కనిపిస్తున్నై…
కొన్ని స్టేషన్లు దాటిన తర్వాత, కొంతమంది ప్రయాణీకులు దిగిపోయిన తర్వాత శేషగిరికి పైన పడుకునే ‘ఛాన్సు’ తగిలింది. రెండుకాళ్లూ బారజాపుకుని పడుకుని సిగరెట్టు పీలుస్తూ తనెంత తెలివిగా ప్రవర్తించి ఈ సీటు సంపాయించు కున్నాడో వూహించుకుని పొంగిపోయాడు. ఈ ‘తెలివి’ కంటే తెలివయిన పని మరొకటి చేస్తున్నందుకు సముద్రం పొంగినట్టు ఇంకా పొంగిపోయాడు శేషగిరి.
నిజానికి శేషగిరిది ఆంధ్రదేశంలో ‘పట్నం’ అనబడే ఒక పల్లెటూరికంటే, కాస్త నయం అయిన గ్రామం. అక్కడే శేషగిరికి ఉద్యోగం. ఈమధ్య శేషగిరి మిత్రుడొకడు అకస్మాత్తుగా చనిపోయాడు. తన ఈడు వాడు – సాటి వాడు వున్నట్టుండి – రెండు రోజుల జ్వరంవల్ల చనిపోవటం అందరినీ ఆశ్చర్యం కలిగించింది. అవాళ శేషగిరి వాళ్లింటికి వెళ్ళాడు. మిత్రులంతా వచ్చారు. చనిపోయిన ఆ మిత్రుడి బంధువులంతా గోలుగోలున ఏడుస్తున్నారు. అతని తల్లీ, భార్యా పిల్లలూ అంతా పాపం ఎంతగా ఏడుస్తున్నారో చూస్తే చూసినవారి గుండెలు తరుక్కుపోయినై. అతను ఎంత మంచివాడో, ఎంత కరక్టు మనిషో, ఎంత సౌమ్యవంతుడో మొదలైనవన్నీ మిత్రులంతా మాట్లాడుకున్నారు. వాళ్ళ కుటుంబానికి ఏవిధంగానైనా సహాయపడాలని నిశ్చయించు కున్నారు కూడా. ఆ రాత్రి శేషగిరి ఇంటికి వెళ్లి పక్కమీద పడుకుంటే ఎంతకూ నిద్రరాలేదు.
అతని ఆలోచనలన్నీ చనిపోయిన ఆ మిత్రుడిమీదికే పోయినై. నిజంగానే పాపం దురదృష్టవంతుడు! సరదాగా తమాషాగా వుండేవాడు. ఇంత చిన్నవయస్సు లోనే అతన్ని మృత్యువు మింగేస్తుందని ఎవడన్నా కల్లోనన్నా వూహించాడా! పాపం పిల్లలు చిన్నవాళ్లు! ఎంతమంది ఓదార్చినా వాళ్ళ దుఃఖం తగ్గటం లేదు. అనుకుంటాం గాని, ఎట్లా వూరుకోగలరు ఎవరు మాత్రం అవాళ మధ్యాహ్నం ఆఫీసుకు సెలవు కూడా ఇచ్చారు. ఆఫీసులో అందరూ అతని గురించే మాట్లాడుకున్నారు. బ్రతికున్న రోజుల్లో అతనంటే కిట్టనివాళ్లు సైతం చనిపోయాడని తెలిసి విచారించారు!
ఈ ఆలోచనల్లోంచి పోనుపోను శేషగిరికి ఇంకేవేవో ఆలోచనలు కలగసాగినై. శ్మశాన వైరాగ్యం కూడా కలిగింది. అందరూ ఇంతే కదా! పుట్టిన ప్రతివాడూ గిట్టాల్సిందేకదా! ఏనాడో తనూ చావాల్సినవాడే. తన కుటుంబమూ ఈ విధంగానే దిక్కులేనిదై పోవాల్సిందే!… శేషగిరికి గుండె గుభేలుమన్నది. తను కూడా చావాలన్న మాట! తన కుటుంబమూ మిత్రబృందమూ అంతా ఇదేవిధంగా విచారిస్తారన్నమాట! తన గొప్పతనం అంతా ఆరోజు బయటపడుతుందన్నమాట. తను చేస్తే తన గురించి ఇంతగా ఏడుస్తారా తన భార్యాబిడ్డలూ అంతా! శేషగిరికి నవ్వులాంటిదొచ్చింది. ఛా! ఇదేం అనుమానం!… తను చస్తే ఏడ్చేవాళ్లు ఈలోకంలో చాలామంది వున్నారు. తన మిత్రులంతా ఏడుస్తారు. దూరదూరంగా వున్న మిగతా మిత్రులకు కూడా తన ‘మరణవార్త’ తెలుస్తుందా? వెంటనే తెలియకపోయినా కొన్నాళ్ళకన్నా తెలుస్తుంది. తను చాలా గొప్పవాడైతే తను చనిపోయినట్టు వార్తాపత్రికల్లో పడుతుంది. అది చూసి వాళ్లు తెలుసుకోవచ్చును. ఐతే తన మరణవార్త వార్తాపత్రికలో పడేటంతటి గొప్పవాడు కాదు తను! కాని, ఒకటున్నది. తను గానీ ఎవరి చేతనన్నా హత్య చేయబడినా, తను ఆత్మహత్య చేసుకున్నా తను చచ్చిపోయినట్టు పేపర్లో పడుతుంది. తను ఆత్మహత్య చేసుకోవాలన్న మాట ఐతే!… ఎందుకూ చేసుకోవటం!
పైగా తను ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతాడో ఎవడికి తెలుసు! కనీసం ఎనభై ఏళ్ళయినా బ్రతికి వుండాలని తన ఆశ ఎనభై ఏళ్ళు బ్రతికేశాక ఆత్మహత్య చేసుకోవచ్చు. లేదా అప్పుడు తనను ఎవడన్నా వచ్చి ‘హత్య’ చేయవచ్చును! అట్లా హత్య చేయించుకోవాలంటే తనకు శత్రువులుండాలి… ఐనా ఇన్ని సంవత్సరాలు ఇంకా ముందు వుంటూ వుండగా ఈలోగా ఏవయినా గొప్ప గొప్ప కార్యాలు చేసి గొప్పవాడినే కావచ్చుగా. శేషగిరి ఇంకా ఇంకా ఆలోచించాడు… ఎంతయితేనేం ఏమైతేనేం – తను చనిపోతే తన గురించి అందరూ ఎట్లా విలపిస్తారో ఎవడూ చూడలేడు, చూడగలిగితే?… అదృష్టవంతుడే! ‘చూడగలగడం’ ఎట్లా? … ఆ ‘ముచ్చట’ చూడాలని తనకున్నది. శేషగిరికి ‘ఠపీ’ మని ఎవరూ వూహించరాని, ఎవరికీ ఎన్నడూ కలగని విపరీతమైన వూహ ఒకటి కలిగింది.. తను చచ్చిపోయినట్టు నటిస్తే?-
తను చూడలేడు గదా! తనే అనేమిటి శేషగిరి దిగ్గున లేచి కూచున్నాడు. ఇది చాలా చక్కగా వున్నది. అప్పుడు తన గొప్పతనం అంతా తనే వినొచ్చు. తన మిగతా మిత్రులంతా తనను ఎంతగా పొగుడుతారో తెలుసుకోవచ్చును. అప్పుడే నిజమైన మిత్రులెవరో, దొంగలెవరో కూడా తెలిసిపోతుంది. ఆ ఆఫీసరు కూడా విచారిస్తాడు. విచారించి తీరాలి! ఇట్లా అందరూ విచారంలో పడి తను బ్రతికివుంటే ఇంకా ఎన్నెన్ని ఘన కార్యాలు చేసేవాడో చెప్పుకుంటూ వుంటే – తను ఒక్కసారిగా ‘ఢాం’ మని లేచి కూచోవాలి. అప్పుడు మిగతావాళ్లంతా స్తంభించుకుపోయి, సంతోషంతో తెప్పరిల్లి తనను కావలించు కుంటారు. తన భార్య ఒక్కసారి సావిత్రి అంత గొప్పదైనట్టుగా భావించుకుంటుంది. అప్పటి సంతోషం ఆనందం ఎట్లా వుంటాయో వూహించటానికి కూడా వీల్లేదు.
ఈ నాటకం ఆడి చూడాలనుకున్న శేషగిరికి ‘అందరూ నమ్ముతారా’ అనే సందేహం కలిగింది. నమ్మకేం జేస్తారు? ఇటువంటి విషయాల్లో సాధారణంగా ఎవడూ నాటకం ఆడడు. కానీ ఒక చిక్కున్నది. ఏ జబ్బూ జ్వరమూ లేకుండా తను ఎట్లా చావటం? ఒకవేళ గుండెల్లో వున్నట్టుండి ఏదో నొప్పి కలిగినట్టు నటించి, చచ్చిపోయినట్టు పడిపోతే? – ఇదీ అంత సులభమైనది కాదు. ఆ సమయంలో ఎవడన్నా తన గుండె మీద చెయ్యివేసి చూశాడంటే, నిజంగా గుండె ఆగిపోతుంది! కాకపోయినా, అంత సేపు వూపిరి స్తంభించి, శవమల్లే పడుక్కోటం మాటలు కాదు. ఇంకెట్లా నాటకం ఆడాలోననీ శేషగిరి చాలా ఆలోచించాడు. ఆఖరికి దివ్యమైన వూహ ఒకటి కలిగింది.
తను ఏదో వూరుకు వెళ్లిపోయి అక్కడ తను అకస్మాత్తుగా చనిపోయినట్టుగా ఎవరి చేతో టెలిగ్రాం ఇప్పించి, తను మారువేషంలో దొంగతనంగా ఇల్లు చేరుకుని వ్యవహారాన్నంతా చాటుగా చూడవచ్చును. తను చనిపోయాడనే వైరు రాగానే తన భార్య… శేషగిరికి కళ్లు చెమ్మగిల్లాయి. పాపం! ఒక్కసారి మూర్ఛపోయి ఏడుస్తుంది… కాని అంతలోనే తను ఎదుటబడితే ఎంత సంతోషిస్తుంది!… ఈ వెధవలంతా వస్తారు. తనను గురించి మాట్లాడుకుంటారు. ఆఫీసు ఒకపూట మూస్తారు కూడాను. ఇదంతా తలచుకుంటూ వుంటే శేషగిరికి ఆనందం ఆగలేదు.
‘భేష్’ అనుకున్నాడు. ఏనాడూ ఎవడూ ఆడని మహత్తర నాటకం తను ఆడబోతున్నాడు! …
ఈ ఉద్దేశం మీదనే శేషగిరి ఆఫీసుకు నాలుగురోజులు సెలవుపెట్టి పనిమీద మద్రాసు వెళ్తున్నట్టుగా భార్యతో చెప్పి రైలెక్కాడు. ఎక్కుతూనే తను ఏంచేసినా దివ్యంగా ఫలిస్తుందనటానికి తార్కాణంగా చిన్న నాటకం ఆడి చక్కని సీటు సంపా యించుకున్నాడు. తను మద్రాసు చేరుకుని, రెండురోజులు పోయాక ఎవరో మిత్రుడిస్తున్నట్టుగా ఒక “వైరు” సృష్టించి ఇంటికి పంపాలి. దాని వెనకనే తనూ ఇల్లు చేరుకోవాలి!
అనుకున్నట్టుగా శేషగిరి మద్రాసు చేరుకున్నాడు. హోటలు గదిలో మకాం పెట్టి వూరంతా తిరిగాడు. ఎరిగున్న పాత స్నేహితుడొకడుంటే కలుసుకున్నాడు. ఇద్దరూ కలిసి తిరిగారు. మూడోనాడు, తన వూరుకు బయల్దేరే బండికి తను సిద్ధమై స్టేషను చేరుకుని – స్టేషన్ నుంచే ఇంటికి వైరు చేశాడు – “అకస్మాత్తుగా మీ శేషగిరి ప్రమాదంవల్ల మరణించినట్టు తెలియజేయడానికి విచారిస్తున్నాను. వివరాలు ఉత్తరం రాస్తున్నాను” – మిత్రుడు.
ఈ వైరు వెళ్లిపోయింది! శేషగిరి రైలుపెట్టెలో కూలబడి సిగరెట్టు కాల్చు కున్నాడు. ఇంక కొన్ని గంటల్లో ఈవైరు ఇంటికి జేరుతుంది. ‘టెలిగ్రాం’ అంటేనే తన భార్యకు పాపం, ఎక్కడలేని భయమూనూ, అట్లా భయపడుతూనే ఈ వైరు పుచ్చుకుని చూస్తుంది. అంతే! సొమ్మసిల్లి పడిపోతుంది. పిల్లలంతా ‘అమ్మా నాన్న నాన్న’ అని ఏడుస్తారు. కాస్సేపట్లో తను చచ్చిపోయినట్టు ఊరంతా తెలిసిపోతుంది. శేషగిరి ఇవన్నీ వూహించుకున్నాడు. మధ్యలో అతనికి ఏడుపు వచ్చింది. ఛా- ఈ నాటకం ఎందుకాడుతున్నట్టు తను అని కూడా అనిపించింది.
ఇందువల్ల ఏం ప్రయోజనం? ఆ, ప్రయోజనం ఏముంది! చిన్న తమాషా. తను చచ్చిపోయిన తర్వాత అందరూ ఎట్లా ఏడుస్తారో చూడవచ్చునుగా! ఎవరూ చూడని, చూడలేని ఒక వింతయిన విశేషం తను కాబట్టి చూడబోతున్నాడు. సమయం చూసి తను ఎదుట పడాలి వాళ్లంతా నిర్ఘాంతపోయి ‘నువ్వు చచ్చిపోలేదు’ అంటారు. ‘నేను చచ్చిపోవటమా’ అని తను ఆశ్చర్యపడతాడు. భార్య ఆ వైరు చూపిస్తుంది. కాస్సేపు తనూ నిర్ఘాంతపోయి, “హుం, కిట్టనివాళ్లిచ్చిన వైరు” అని తేలుస్తాడు. ఇట్లా ఐతే ఈ నాటకం అంతా తను ఆడినట్టు ఏ కోశానా ఎవడూ అనుమానించ లేడు. ఆ ‘కిట్టనివాడిని’ అంతా తిట్టి దిగపారబోయొచ్చు. అందువల్ల ఇట్లా నాటకం ఆడినందువల్ల – తనకేం నష్టంలేదు సరికదా – కిట్టని వాళ్లెవరో తననిట్లా చేసినందుకు అందరి దగ్గరా సానుభూతి కూడా పొందుతాడు. శేషగిరి గుండె దిటవు చేసుకున్నాడు!
తన వూరుకు ఇవతలి స్టేషను చేరుకునేటప్పటికి రాత్రయింది. ఆ స్టేషన్లో బండి ఆగటమే తడవుగా ఏదో ఆలోచన తట్టి, శేషగిరి ఛటుక్కున సంచీ తీసుకుని దిగిపోయాడు. అమ్మయ్య! సమయానికి బుద్ధి మహాచక్కగా పనిచేసింది. లేకపోతే తన వూళ్లోనే గాని తను దిగితే తన మరణవార్త విన్న ఏ స్నేహితుడి కంటనన్నా పొరపాటున గాని తను పడితే ఇంకేమన్నా వుందా? అందుకనే శేషగిరి ముందు స్టేషన్లోనే దిగి జాగ్రత్త పడ్డాడు। శేషగిరి నెమ్మదిగా ఆ వూళ్లోకి నడిచాడు. ఆ వూళ్లో తనను ఎరిగున్న వాళ్లు ఎక్కడో వుంటే ఒకడుంటాడు! ఒకవేళ వాడు తనను పలకరించినా అట్టే ఏం ఇబ్బందిలేదు. ఎంచేతంటే తను చచ్చిపోయినట్టు అప్పుడే వీడికి తెలిసే అవకాశం లేదు!
ఆ వూళ్లో చిన్న హోటలుంటే అక్కడ సంచీ పెట్టి భోజనం చేశాడు శేషగిరి. ఈ రాత్రివేళ రహస్యంగా తనవూరు చేరుకోవాలి. వూరు చేరటంతో సరికాదు ఇల్లూ చేరుకోవాలి. చేరుకోవటం అంటే రహస్యంగా తను అంతా గమనించేందుకు అనువైన చోటు ఒకటి చూసుకోవాలి. ఇదంతా సమస్యగానే కనిపించింది శేషగిరికి.
సుమారు తొమ్మిది గంటలవేళ శేషగిరి పల్లెటూరి వాడల్లే వేషం వేసుకుని . తలకొక పాగా కూడా చుట్టుకుని హోటలు గుమ్మం దాటి బయటకొచ్చాడు. అక్కడికి తనవూరు నాలుగు మైళ్ళు. నడిచి వెళ్ళటం అంటే సాధ్యంకాని విషయం. ఈ వేళప్పుడు బస్సులు దొరకవు. దొరికినా బస్సు అనవసరం. అందులో తనకు తెలిసిన మొహాలు కనిపించవచ్చును. కాకపోయినా, బహిరంగంగా అందరికీ తను కనిపించాల్సివస్తుంది – ‘స్టాండు’ లో నన్నా. ఇట్లా వూహిస్తూనే శేషగిరి నెమ్మదిగా నడవసాగాడు. అతనికి ఒక జట్కా కనిపించింది. శేషగిరి జట్కా వాడి ముఖాన్ని పరికించి చూశాడు. ఎరిగి ఉన్న ముఖం కాదది!
“జట్కా!” అన్నాడు శేషగిరి.
జట్కావాడు ఆశగా వొచ్చి, శేషగిరి వేషం చూసి – ఇది బేరం పడని వ్యవహారం ” ఎక్కడి కెళ్లాలి?” అన్నాడు నిర్లక్ష్యంగా. శేషగిరికి మండిపోయింది. ఇష్టం వచ్చినట్టు పేల్తున్నావ్?’ అందామను కున్నాడు. కాని అంతలోనే తన వేషం గుర్తుకొచ్చి మాటకూడా మార్చాలని గుర్తు కొచ్చింది. శేషగిరి తన వూరుపేరు చెప్పి అక్కడికి పోవాలన్నాడు. జట్కా వాడూ అతనూ కాసేపు బేరాలాడుకున్నాక శేషగిరి జట్కా బండి ఎక్కి, హత్యచేసిన వాడికంటే కూడా ఎక్కువ నేరం చేసినవాడల్లే భయపడుతూ – ఒకమూల ఒదిగి కూచున్నాడు. జట్కా బండి బయల్దేరాక కూడా శేషగిరికి అనేక సందేహాలు కలిగినై. తను సరాసరి ఎక్కడికి పోవడం? వూళ్లో ఎక్కడో దిగిపోయి తన ఇంటికి నడుచుకుని పోవడమా? కాకపోతే సరాసరి తన యింటికే పోవడమా? ఈ రెండోది అపాయకరమైనది. ఒకవేళ – వీధి మొదట్లో దిగేసి నెమ్మదిగా నడిచిపోతే? ఏమో, ఎవడు చూస్తాడో, ఏం జరుగుతుందో! ఈ లోపల ఎట్లావున్నా తన వీధి ప్రాంతాల మాత్రం తాను చాలా
మెలకువగా ఉండాలి.
ఊరు చేరుకుంటున్న కొద్దీ శేషగిరి గుండె ఎక్కువగా కొట్టుకోసాగింది. జట్కావాడు గుర్రాన్ని అదిలిస్తూ ఉషారుగా తోల్తున్నాడు. బండి వూళ్లో ప్రవేశించింది. ఎలెక్ట్రిక్ దీపాల వెల్తుర్లో మనుషులు కన్పిస్తున్నారు. ఉండి ఉండి దీపపు వెలుగు శేషగిరి మీద పడుతూవుంటే శేషగిరి మొహం కప్పుకుంటూ పక్కకు తప్పుకుంటున్నాడు. “ఎక్కడికి?” అన్నాడు జట్కావాడు. శేషగిరి ఏదో వీధి పేరు చెప్పి దారి చూపించసాగాడు. ఆ వీధి శేషగిరి వీధికాదు – దాని వెనక వీధి. ఆ వీధిలోకి గనకపోతే, దొడ్డి గుమ్మాన తన ఇంట్లో ప్రవేశించవచ్చును. ఆ వీధి సమీపిస్తున్న కొద్దీ శేషగిరికి కాళ్లూ చేతులూ వణక సాగినయ్. తన వీధి దాటి అవతలి వీధి చేరుకునేలోగా శేషగిరి తను ఎరిగిన మనిషిని చూశాడు. వొట్టి చూడడం కాదు పరీక్షగా చూశాడు మనిషి ముఖంలో ‘ విషాదచ్ఛాయలు’ ఉన్నాయేమోనని. ఉన్నట్టే కనిపించింది శేషగిరికి. తను చెప్పిన వీధి రానే వచ్చింది. బండి బాగా వీధిలోకి పోయాక, కాస్త చీకటిగా వున్నచోట్లో బండిని ఆపించి, నెమ్మదిగా దిగాడు. కాళ్లు వొణుకుతూ ఉండడంవల్ల సరిగా నిలబడలేక కొద్దిగా తూలాడు. అంతలోనే సర్దుకుని, డబ్బులు తీసి ధైర్యంగా జట్కావాడి చేతిలో పెట్టేశాడు.
ఆ జట్కా వెళ్ళిపోయింది. శేషగిరి ఆ చీకట్లో కదిలి బయటికొచ్చాడు. అదంత పెద్ద వీధి కాదు. సందు, ఎక్కడా మనుష్య సంచారం లేదు. తన దొడ్డి గుమ్మం కొన్నిగజాల దూరంలోనే ఉన్నది. అక్కడికి చేరుకోడానికి శేషగిరి సప్త సముద్రాలూ దాటాల్సినంత ప్రయత్నం చేసి, నెమ్మదిగా రెండడుగులు ముందుకువేసి చటుక్కున ఆగాడు. వెనకాల ఎవరో వస్తున్న శబ్దం వినిపించింది. శేషగిరి వెనక్కు తిరిగాడు తన మిత్రుడొకడు! శేషగిరికి గుండె ‘దడ దడ’ హెచ్చింది. తొందరగా చీకట్లో కొచ్చి తారట్లాడసాగాడు. దొంగలాగ నక్కుతూన్న శేషగిరిని చూసి “ఎవరది?” అని గద్దించాడు ఆ మిత్రుడు. శేషగిరి ప్రాణాలు పైనే ఎగిరిపోయినయ్. అయినా ఆ వెంటనే నిలదొక్కుకుని, గొంతు మార్చి, ధాటీగా – “ఈ యింటి నౌకరోడిని బాబూ!” – అన్నాడు.
ఆ మిత్రుడు ‘ఓ’ అని తన దారిన వెళ్ళిపోయాడు – ఈల పాట పాడుకుంటూ. ‘అమ్మయ్య’ అనుకున్నాడు శేషగిరి. తను మహానటుడు! కాని అంతలోనే శేషగిరికి ఓ అనుమానం కలిగింది. తను చనిపోయిన వార్త వీడు వినలేదా? వింటే, ఇట్లా ఈలపాట పాడతాడా? ఒకవేళ వినలేదేమో! వినకుండా వుండటానికి అవకాశంలేదు. ఆ వైరు చాలాసేపటిముందే చేరి వుంటుంది. కొంపదీసి ఆ వైరు చేరలేదేమో అనే సందేహం కూడా కలిగింది. చేరక ఏమవుతుంది? అసలు తన కొంప జేరితేనేకాని అన్ని విషయాలూ పూర్తిగా బయటపడవు.
ప్రాణాలు బిగపట్టుకుని వూపిరి స్తంభించుకుని నెమ్మదిగా అడుగులువేస్తూ శేషగిరి తన ఇంటి దొడ్డిగుమ్మం చేరుకున్నాడు. దొడ్డిగుమ్మం ఏమంత ఎత్తయినది కాదు. తట్టి చూశాడు – మూసివుంది. ఏమయినా ఏడుపులు వినిపిస్తున్నాయేమోనని తలుపు మీద చెవిపెట్టి విన్నాడు. ఎక్కడా ఏమీ వినిపించలేదు. దానికి ఒక కారణం వుండొచ్చు. దొడ్డి గుమ్మం నుంచి ఇంట్లోకి కొద్దిగా దూరం వుంది. ఇక్కడినుంచి కేక వేసినా కూడా అందనంత దూరం!
అటూ ఇటూ చూసి శేషగిరి గోడ ఎగబాకి, చప్పుడు చెయ్యకుండా అవతలకు దిగాడు. అంతా చీకటిగా వుంది. దొడ్డినిండా గడ్డి పెరగటంవల్ల దోవకూడా సరిగా తెలియటంలేదు. అలవాటయిన ప్రదేశమే కాబట్టి తడుముకుంటూ దొడ్డిదాటి బావి దగ్గరకు చేరుకున్నాడు. బావికి ముందున్న తలుపులు కూడా మూసివున్నై. శేషగిరి నెమ్మదిగా తలుపు సందులోంచి చూశాడు. గుడ్డిగా దీపం వెలుగు కనిపించింది. ఆ వెలుగులోనే దూరంగా మసకమసకగా ఎవరో పడివున్నట్టు కూడా కనిపించింది. ఆ పడివున్నది తన భార్యేనని తెలుసుకోగల్గాడు శేషగిరి. ఎవరో ఏడుస్తున్నట్టు కూడా వినిపించింది. అమ్మయ్య! తన వైరు అందింది! కాని గోలుగోలున ఏడుపు
వినిపించటంలేదు.
అంతలోనే శేషగిరి పెద్దగా ఏడుపు విన్నాడు. అది తన తల్లిది! ఎవరో ఇంటికి రాగా వాళ్ళను చూచి ఆమె బావురుమన్నట్టుంది. “ఎంత పని చేశావురా నాయనా, ఎంతపని చేశావురా! ఇంతలోనే నీకు నూరేళ్లూ నిండిపోయాయా నా తండ్రీ! నీ శవాన్ని కూడా చూసే దిక్కులేక పోయిందిరా” అని ఆమె ఏడుస్తున్నది. “వూరుకోండమ్మా ఏంజేస్తాం” అంటున్నారెవరో. తన భార్య పక్కనే ఎవరో కూచుని లేవదీస్తున్నారు. ఆమె లేచి కూచుంది. అంతలోనే ఒక్కసారి కూలబడి భోరున ఏడ్చింది. పిల్లలంతా ‘అమ్మా అమ్మా’ అని దగ్గర కొస్తూ చుట్టుముట్టారు. ఒకబ్బాయి ‘నాన్నా నాన్నా’ అంటూ ఏడుస్తున్నాడు.
“నాన్నగారు వస్తారమ్మా!” అన్నారు ఎవరో.
“నాన్న! బాబూ! నాన్న ఇంక రారమ్మా నాన్న ఇంక రారు!” అని శేషగిరి భార్య తల బాదుకుని ఏడుస్తున్నది… ఎవరెవరో వస్తున్నారు… మాటలు వినిపిస్తున్నై…
తన మరణవార్త అందరికీ తెలిసిపోయినట్టు రూఢి చేసుకున్నాడు శేషగిరి. అంతా వింటూ ఆనంద పడసాగాడు. వచ్చినవాళ్లలో కొందరు వెళ్తున్నారు… కొందరు వస్తున్నారు. తనను గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. ఆ మాటలేమిటో సరిగ్గా తెలియకపోయినా ఎవరెవరు రావాలని తను అనుకున్నాడో ఆ స్నేహితులంతా వస్తున్నారు. మధ్యలో భార్య శోష వచ్చి పడిపోయింది. శేషగిరికి దుఃఖం కలిగింది. తన భార్యను ఇంకా ఏడిపించటం తగదనుకున్నాడు. తను చచ్చిపోతే అంతా ఈవిధంగా దుఃఖిస్తారని తేలిపోయింది! తనను గురించి అంతా మంచిగానే మాట్లాడుకుంటారన్న మాట! ఈ వ్యవహారాన్ని ఇంక పొడిగించరాదని తీర్మానించుకున్నాడు శేషగిరి.. ఇంక అట్టే ఆలస్యం చెయ్యకుండా వాళ్ళముందు పడాలి. లేకపోతే తను చనిపోయినట్టు తన మామగారికీ, దూరపు బంధువులకూ కూడా తెలియజేస్తారు. తను ఆడిన నాటకం బాగా రక్తి కట్టింది! తను ఇంక తలపాగా లాగి పారేసి, పైన తొడుక్కున్న వేషం తీసేసి – దేవుడు పంపినట్టు ఛటుక్కున ఇంట్లో ప్రత్యక్షం కావాలి! శేషగిరి, కిందవున్న చేతి సంచీ చేతిలోకి తీసుకుని, ఇంట్లోకి రావటానికని మళ్ళీ దొడ్డిగుమ్మం దాటాలని
లేచాడు.
ఇంట్లో రోదన ధ్వనులు ఎక్కువయినై. శేషగిరి భార్య ఎంతమంది వూరుకో మంటున్నా వినకుండా పిల్లవాళ్లను పట్టుకుని, నెత్తినోరూ బాదుకుని ఏడుస్తున్నది. ఈ ఏడుపుల శబ్దాన్ని చీల్చుకుంటూ భయంకరమైన ఆర్తనాదం ఒకటి వినిపించింది వాళ్ళకు. అందరూ ఆశ్చర్యంగా పరుగెత్తి దొడ్డి తలుపులు తెరిచి చూశారు. ఆ కేక వేసినవాడు శేషగిరి! చీకట్లో క్రింద బోర్లాపడివున్నాడు. చేతిలో వుండాల్సిన సంచీ పట్టుతప్పి ఎక్కడో పడిపోయివున్నది. శేషగిరి స్నేహితుడొకడు దీపం తీసుకొచ్చి చూశాడు. శేషగిరి నోట్లోంచి తెల్లగా నురగలు వస్తున్నై!…. అందరూ దిష్టి బొమ్మలల్లే చూస్తూ వుండగా శేషగిరి కాళ్ళకు చుట్టుకుని వున్న ఒక పెద్ద సర్పం బుసలు కొడుతూ నెమ్మదిగా బయటకు వచ్చి, తొందరగా ఆ చీకట్లోంచి పాకి పొదల్లోకి దూరిపోయింది!
Click here for All Ravi Kondala Rao Hasya Kathalu







