వెబ్ సీరిస్ తొలగించాలంటూ 2.25 లక్షల మంది సంతకాలు! అయినా నంబర్ వన్!
ఓ వెబ్ సిరీస్.. విడుదలైన కొద్ది రోజులకే ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. లక్షలాది మంది ఎగబడి చూస్తున్నారు. నెట్‌ఫ్లిక్స్ చార్టుల్లో నంబర్ వన్ స్థానాన్ని కూడా దక్కించుకుంది. కానీ ఇక్కడో ట్విస్ట్ ఉంది! అదే సిరీస్‌ను తమ ప్లాట్‌ఫామ్ నుంచి వెంటనే తొలగించాలంటూ మరోవైపు పెద్ద ఉద్యమమే మొదలైంది. ఏకంగా 2.25 లక్షల మందికి పైగా ఆన్లైన్ పిటిషన్‌పై సంతకాలు చేశారు. ఇంతకీ ఆ సిరీస్‌లో ఏముంది? ఎందుకంత వ్యతిరేకత? అయినా ప్రేక్షకులు మాత్రం ఎందుకు చూస్తున్నారు? ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారిన ఆ వెబ్ సిరీస్ పేరే ‘ది బాడీ’ (The Body).
సీరిస్ కథేంటి!
ఎనిమిది ఎపిసోడ్లతో రూపొందిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్ కథ 2004లోని ఓ క్యాథలిక్ హైస్కూల్ నేపథ్యంలో సాగుతుంది. అక్కడ ఓ అమ్మాయిల డ్యాన్స్ టీమ్ ఉంటుంది. అందులో చోటు సంపాదించుకోవడం, టీమ్‌లో గుర్తింపు తెచ్చుకోవడం కోసం అమ్మాయిల మధ్య పోటీ నడుస్తుంటుంది. అయితే కొత్తగా టీమ్‌లో చేరిన అమ్మాయిలకు ఓ విచిత్రమైన ఆచారం నిర్వహించడం అక్కడి సంప్రదాయం.
హాలోవీన్ రాత్రి జరిగే ఈ కార్యక్రమం సరదాగా మొదలైనా.. చివరకు భయంకరమైన మలుపు తిరుగుతుంది. ఓ పాత కాన్వెంట్లో జరిగే పార్టీలో అమ్మాయిలు సాతానిక్ ఆచారాలను పోలిన ఓ కార్యక్రమం నిర్వహిస్తారు. ఆ సమయంలో చోటుచేసుకున్న అనూహ్య పరిణామంతో గ్రేస్ అనే అమ్మాయి కోమాలోకి వెళ్లిపోతుంది. అయితే ఆమెకు ఏం జరిగిందన్నది బయటకు చెప్పడానికి మిగతా అమ్మాయిలు భయపడతారు. నిజాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేస్తారు.
కానీ అక్కడి నుంచే అసలు ఉత్కంఠ మొదలవుతుంది. గ్రేస్‌కు సంబంధించిన వింత అనుభవాలు మిగతా అమ్మాయిలను వెంటాడుతుంటాయి. కొందరికి ఆమె కనిపిస్తున్నట్లు అనిపిస్తుంది. మరికొందరికి భవిష్యత్తును సూచించే దర్శనాలు కలుగుతాయి. ఇవన్నీ నిజంగా అతీంద్రియ శక్తుల ప్రభావమా? లేక జరిగిన సంఘటనపై ఉన్న అపరాధభావం, భయంతో కలుగుతున్న మానసిక భ్రమలా? అన్నది ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతుంది.
మత విశ్వాసాలే వివాదానికి కారణమా?
ఈ సిరీస్‌లోని కథాంశమే ఇప్పుడు వివాదానికి ప్రధాన కారణంగా మారింది. ముఖ్యంగా క్యాథలిక్ స్కూల్ నేపథ్యంలో సాతానిక్ ఆచారాలను పోలిన సన్నివేశాలు చూపించడం, ఆల్ సెయింట్స్ డే సందర్భంగా పాత్రలను సాధువుల తరహాలో చూపిస్తూ ప్రచార చిత్రాలు రూపొందించడం కొందరు క్రైస్తవ సంఘాలకు తీవ్ర అభ్యంతరకరంగా అనిపించింది.
ఈ సిరీస్ క్రైస్తవ మత విశ్వాసాలను కించపరిచేలా ఉందని సంప్రదాయవాద క్రైస్తవ సంఘాలు విమర్శిస్తున్నాయి. దీంతో సిటిజెన్గో (CitizenGO) అనే అడ్వకసీ సంస్థ రంగంలోకి దిగింది. నెట్‌ఫ్లిక్స్ చీఫ్ కంటెంట్ ఆఫీసర్ పీటర్ రైస్‌కు ఉద్దేశించి ఆన్లైన్ పిటిషన్ ప్రారంభించింది. ‘ది బాడీ’ని ప్రపంచవ్యాప్తంగా నెట్‌ఫ్లిక్స్ నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది. ఈ సిరీస్‌ను ‘దైవదూషణకు పాల్పడే క్రైస్తవ వ్యతిరేక కంటెంట్, సాతానిక్ ఆచారాలను ప్రోత్సహించేది’ అంటూ అభివర్ణించింది.
2.25 లక్షల సంతకాలు.. లక్ష్యం 5 లక్షలు!
ఈ పిటిషన్‌కు మద్దతు రోజురోజుకూ పెరుగుతోంది. నవంబర్ 26 నాటికి ఏకంగా 2.25 లక్షలకు పైగా సంతకాలు నమోదయ్యాయి. దీంతో నిర్వాహకులు తమ తదుపరి లక్ష్యాన్ని 5 లక్షల సంతకాలుగా పెంచారు. అంటే ఈ సిరీస్‌పై వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
అయితే ఇంత పెద్ద వివాదం నడుస్తున్నా నెట్‌ఫ్లిక్స్ మాత్రం ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. సిరీస్‌ను తొలగించే విషయంలోనూ ఎలాంటి ప్రకటన చేయలేదు.
వివాదాలు ఒకవైపు.. వ్యూస్ మరోవైపు!
ఇక్కడే మరో ఆసక్తికరమైన విషయం ఉంది. సిరీస్‌ను తొలగించాలంటూ పిటిషన్లు నడుస్తుంటే.. మరోవైపు ప్రేక్షకులు మాత్రం దీన్ని భారీగా చూస్తున్నారు. నెట్‌ఫ్లిక్స్ టుడమ్ నవంబర్ 24న విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. నవంబర్ 16 నుంచి 22 మధ్య ఒక్క వారంలోనే ఈ సిరీస్‌కు 95 లక్షల వ్యూస్ వచ్చాయి. మొత్తం 7.03 కోట్ల గంటల పాటు ప్రేక్షకులు దీన్ని వీక్షించారు.
నవంబర్ 11న విడుదలైన తొలి వారంలో 51 లక్షల వ్యూస్ మాత్రమే నమోదయ్యాయి. రెండో వారానికి వచ్చేసరికి ఈ సంఖ్య ఏకంగా 86 శాతం పెరిగింది. నెట్‌ఫ్లిక్స్ గ్లోబల్ ఇంగ్లిష్ టీవీ చార్టులో మొదటి స్థానాన్ని దక్కించుకుంది. రెండో స్థానంలో ఉన్న ‘బ్లాక్ డవ్స్’ సీజన్ 2కు 37 లక్షల వ్యూస్ మాత్రమే వచ్చాయి. దీంతో ‘ది బాడీ’ డజన్ల కొద్దీ దేశాల్లో టాప్ చార్టుల్లో నిలిచింది.
ఇంతకీ ప్రేక్షకులను ఆకర్షిస్తున్నదేమిటి?
ఈ సిరీస్‌ను కేవలం హారర్ కథగా చూడలేం. ఇందులో టీనేజ్ జీవితాలు, స్నేహాలు, అసూయ, ప్రేమ, ఆధిపత్య పోరు, మానసిక సంఘర్షణలు అన్నీ కలిసిపోయాయి. ఒకవైపు స్కూల్లో జరిగే సాధారణ సంఘటనలు కనిపిస్తుంటే.. మరోవైపు వాటి వెనుక ఏదో రహస్యం దాగి ఉన్నట్లు కథ సాగుతుంది.
ముఖ్యంగా గ్రేస్‌కు ఎదురైన అనుభవాలు నిజమా? ఆమెకు ఏదైనా అతీంద్రియ శక్తి ఉందా? లేక అమ్మాయిలందరూ ఒకే రకమైన భయానికి లోనవుతున్నారా? అనే ప్రశ్నలు ప్రతి ఎపిసోడ్‌లోనూ ఉత్కంఠను పెంచుతాయి. ప్రేక్షకులను తర్వాతి ఎపిసోడ్ చూసేలా చేసే ఈ మిస్టరీ, సిరీస్‌కు ప్రధాన ఆకర్షణగా మారింది. 2004 నాటి వాతావరణం, అప్పటి టీనేజ్ సంస్కృతి, భయపెట్టే సన్నివేశాలు కూడా కథకు ప్రత్యేకమైన రూపాన్ని తీసుకొచ్చాయి.
‘మా ఉద్దేశం మతాన్ని కించపరచడం కాదు’..
మరోవైపు ఈ విమర్శలపై సిరీస్ సృష్టికర్త క్విన్ షెపర్డ్ స్పందించారు. ఈ సిరీస్ రాయడం వల్ల ఆధ్యాత్మికతతో తనకున్న అనుబంధం మరింత మెరుగుపడిందని ఆమె తెలిపారు. తమ టీమ్‌లోని ప్రతి ఒక్కరికీ మత విశ్వాసాల పట్ల సానుకూల దృక్పథం ఉందని, అయితే మత వ్యవస్థల్లోని లోపాలను ప్రశ్నించే వైఖరి కూడా ఉందని వివరించారు.
నటుడు మార్సెల్ రూయిజ్ కూడా విమర్శలపై స్పందిస్తూ.. పిటిషన్‌పై సంతకాలు చేసినవారిలో ఎంతమంది నిజంగా ఈ సిరీస్‌ను చూశారో తనకు సందేహంగా ఉందని అన్నారు. కొన్నిసార్లు కళపై వచ్చే విమర్శలు కూడా కళలో భాగమేనని వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి
రెండో సీజన్ ఉంటుందా?
మొదటి సీజన్ ముగింపు కూడా ప్రేక్షకుల్లో మరిన్ని ప్రశ్నలు రేకెత్తించింది. దీంతో రెండో సీజన్ ఎప్పుడు వస్తుందా అని చాలామంది ఎదురుచూస్తున్నారు. అయితే నెట్‌ఫ్లిక్స్ ఇప్పటివరకు సీజన్ 2పై అధికారిక ప్రకటన చేయలేదు. సిరీస్ సృష్టికర్త క్విన్ షెపర్డ్, కో-షోరన్నర్ గినా గామెల్ మాత్రం కథను ముందుకు ఎలా తీసుకెళ్లాలనే దానిపై ఇప్పటికే ఆలోచనలు సిద్ధం చేసుకున్నట్లు తెలిపారు. రెండో సీజన్ రావాలని తాము కూడా గట్టిగా కోరుకుంటున్నామని షెపర్డ్ చెప్పారు.
మొత్తానికి …
‘ది బాడీ’ ఇప్పుడు రెండు కారణాలతో ప్రపంచవ్యాప్తంగా చర్చలో నిలుస్తోంది. ఒకవైపు మత విశ్వాసాలను కించపరిచిందంటూ తొలగించాలని డిమాండ్లు, మరోవైపు రికార్డు స్థాయిలో పెరుగుతున్న వ్యూస్. విమర్శలు ఈ సిరీస్‌కు మరింత ప్రచారం తెచ్చిపెడుతున్నాయా? లేక ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నది దాని కథలోని మిస్టరీనా? ఏదేమైనా నెట్‌ఫ్లిక్స్‌కు మాత్రం ‘ది బాడీ’ ఇప్పుడు పెద్ద చర్చగా మారింది.
—సూర్య ప్రకాష్ జోశ్యుల







