మీ ఆఫీస్ లు పేల్చేస్తాం…అమెరికా టెక్ దిగ్గజాలకు ఇరాన్ బాంబ్ వార్నింగ్!
యుద్ధం అంటే కేవలం సరిహద్దుల్లో సైనికుల పోరాటమే అనుకుంటున్నారా? ఇప్పుడు పరిస్థితి మారుతోంది. క్షిపణులు, డ్రోన్లతో పాటు టెక్నాలజీ కంపెనీలు కూడా యుద్ధ రాజకీయాల్లోకి లాగబడుతున్నాయి. తాజాగా ఇరాన్ విడుదల చేసిన ఓ వీడియో చూస్తే ఈ విషయం మరింత స్పష్టమవుతుంది. అమెరికాకు చెందిన అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఎలాన్ మస్క్ స్పేస్ఎక్స్ సంస్థల కార్యాలయాలనే లక్ష్యంగా చేసుకుంటామంటూ టెహ్రాన్ హెచ్చరికలు జారీ చేసింది. అమెరికా, ఇజ్రాయెల్ సైనిక చర్యలకు ఈ కంపెనీలు సహకరిస్తున్నాయన్నది ఇరాన్ ఆరోపణ. తమపై దాడులకు పరోక్షంగా సహకరించే సంస్థలు ఇకపై సురక్షితంగా ఉండలేవన్న సంకేతాలను ఈ వీడియో ద్వారా పంపించింది.
భవనాలపై డ్రోన్లు.. భారీ పేలుళ్లు.. వీడియో చూస్తేనే షాక్!
ఇరాన్ ప్రభుత్వ మీడియా సంస్థ మెహర్ న్యూస్ ఏజెన్సీ గురువారం తన టెలిగ్రామ్ ఛానెల్లో ఈ వీడియోను విడుదల చేసింది. ఇందులో అమెజాన్, మైక్రోసాఫ్ట్, స్పేస్ఎక్స్ వంటి కంపెనీల కార్యాలయాలపై డ్రోన్లు దూసుకెళ్లడం, ఆ తర్వాత భారీ పేలుళ్లు సంభవించడం, భవనాలు మంటల్లో చిక్కుకోవడం వంటి దృశ్యాలను చూపించారు. కృత్రిమ మేధ (AI) సాయంతో రూపొందించిన ఈ వీడియోను చూస్తే నిజంగానే ఆయా కార్యాలయాలపై దాడులు జరిగినట్లుగా అనిపిస్తుంది.
వీడియో ప్రారంభంలోనే వ్యాఖ్యాత చేసిన హెచ్చరిక మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. “మా పిల్లలను చంపిన వారిని మేము వదిలిపెట్టం” అంటూ మొదలుపెట్టి, అమెరికా ప్రజలకు తమతో ఎలాంటి సమస్య లేదని, కానీ ఇరాన్‌పై సైనిక చర్యలకు సహకరిస్తున్న కంపెనీలను మాత్రం ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. అంటే అమెరికా ప్రజలకు ఒక సందేశం.. అక్కడి టెక్ కంపెనీలకు మరో హెచ్చరిక అన్నమాట!
అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే.. ఈ వీడియోలో చూపించిన పేలుళ్లు, దాడులు వాస్తవంగా జరిగినవి కావు. అవి AIతో సృష్టించిన దృశ్యాలు మాత్రమే. ఇది దాడుల ప్రకటన కంటే హెచ్చరికను ప్రచారం చేసే వీడియోగా కనిపిస్తోంది.
పరిహారం ఇవ్వండి.. లేదంటే మీ ఆఫీసులే పేలిపోతాయి!
ఇరాన్ హెచ్చరికలు కేవలం మాటలకే పరిమితం కాలేదు. తమపై జరిగిన సైనిక దాడుల్లో భాగస్వాములైన కంపెనీలు ముందుకొచ్చి తమ పాత్రను అంగీకరించాలని, నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేసింది. అలా చేయకపోతే వాటికి కూడా తీవ్ర పరిణామాలు తప్పవని వీడియోలో హెచ్చరించింది.
“ఇరాన్‌పై దాడుల్లో పాల్గొన్న కంపెనీలు పరిహారం చెల్లించి పశ్చాత్తాపం వ్యక్తం చేయాలి. లేదంటే అదే స్థాయిలో విధ్వంసాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది” అంటూ వ్యాఖ్యాత హెచ్చరించారు. చివర్లో అమెరికాను ఉద్దేశించి పశ్చాత్తాపమా? విధ్వంసమా? మీరే నిర్ణయించుకోండి అంటూ సవాల్ విసిరారు.
ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతోంది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉపయోగించే టెక్నాలజీ సేవలను అందిస్తున్న ఈ కంపెనీలను ఇరాన్ ఎందుకు లక్ష్యంగా చేసుకుంటోంది? వాటికి అమెరికా సైనిక కార్యకలాపాలతో ఎలాంటి సంబంధం ఉందని ఆరోపిస్తోంది?
మినాబ్ స్కూల్ దాడి.. 175 మంది మృతి.. చిన్నారుల మరణాలే కారణమా?
ఈ హెచ్చరికలకు సంబంధించి ఇరాన్ మరో విషాదకరమైన ఘటనను తెరపైకి తీసుకొచ్చింది. అదే దక్షిణ ఇరాన్‌లోని మినాబ్ పట్టణంలో ఫిబ్రవరిలో జరిగిన పాఠశాలపై బాంబు దాడి. ఈ ఘటనలో 175 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఎక్కువ మంది చిన్నారులే ఉండటం ఇరాన్ ఆగ్రహానికి ప్రధాన కారణంగా నిలిచింది. ఈ క్షిపణి దాడికి అమెరికానే బాధ్యత వహించిందని ప్రాథమిక సైనిక దర్యాప్తులో తేలినట్లు కథనం పేర్కొంది.
ఈ ఘటనను ప్రస్తావిస్తూ మెహర్ న్యూస్ తన టెలిగ్రామ్ పోస్టులో అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలపై ఆరోపణలు చేసింది. అమెరికా, ఇజ్రాయెల్ సైనిక సంస్థలతో ఈ కంపెనీలకు రహస్య భాగస్వామ్యాలు ఉన్నాయని, ఇరాన్‌పై జరుగుతున్న సైనిక చర్యలకు అవి సహకరిస్తున్నాయని పేర్కొంది. అయితే ఈ ఆరోపణలకు సంబంధించిన పూర్తి ఆధారాలు స్వతంత్రంగా నిర్ధారణ కాలేదు.
ఒకవైపు ఇరాన్ హెచ్చరికలు.. మరోవైపు ట్రంప్ దాడుల సంకేతాలు!
ఇప్పటికే అమెరికా, ఇరాన్ మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయి. ఒకవైపు చర్చలు జరుగుతున్నాయన్న వార్తలు వస్తుంటే, మరోవైపు క్షిపణి దాడులు, ప్రతిదాడులు కొనసాగుతున్నాయి. ఇలాంటి సమయంలో కొత్త ఏడాది ప్రారంభంలోనే ఇరాన్‌పై మరోసారి సైనిక చర్య చేపట్టే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంకేతాలివ్వడం పరిస్థితిని మరింత ఆసక్తికరంగా మార్చింది.
ఇటీవల హార్ముజ్ జలసంధిలోని ఖేష్మ్ ద్వీపంలో ఉన్న క్షిపణి ప్రయోగ కేంద్రంపై అమెరికా దాడి చేసింది. ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) చేపట్టిన శత్రు చర్యలకు ప్రతిస్పందనగానే ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు వాషింగ్టన్ ప్రకటించింది. దీనికి బదులుగా ఇరాన్ కూడా ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసింది. అయితే వాటిని అమెరికా మిత్రదేశాలైన గల్ఫ్ దేశాల రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయి.
చర్చల పేరుతో డ్రామా చేస్తున్నారంటూ ట్రంప్ ఫైర్!
ఇరాన్‌తో జరుగుతున్న చర్చల్లో ఎలాంటి పురోగతి లేకపోవడంపై ట్రంప్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. యుద్ధాన్ని ముగించేందుకు చర్చలు జరపాలని చెబుతున్న ఇరాన్.. ఆచరణలో మాత్రం ముందడుగు వేయడం లేదని ఆయన ఆరోపిస్తున్నారు. ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇరాన్ చర్చల తీరును తీవ్రంగా విమర్శించారు. వాళ్లు ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటారని, కానీ ఆ మాటల్లో ఎలాంటి అర్థం ఉండదని వ్యాఖ్యానించారు.
ఇరాన్ చర్చల ప్రతినిధులను ‘ప్రొఫెషనల్ ట్యాప్ డ్యాన్సర్లు’తో పోలుస్తూ, అసలు విషయానికి రాకుండా తప్పించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. మరోవైపు విదేశాల్లో విధులు నిర్వహిస్తున్న అమెరికా సైనికులతో థాంక్స్‌గివింగ్ సందర్భంగా మాట్లాడినప్పుడూ ఇరాన్ అంశాన్ని ప్రస్తావించారు.
ఇక టెక్ కంపెనీల పరిస్థితి ఏంటి?
ఇప్పటివరకు అమెరికా, ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఘర్షణ ప్రధానంగా సైనిక స్థావరాలు, క్షిపణి కేంద్రాలు, వ్యూహాత్మక ప్రాంతాల చుట్టూనే తిరిగింది. కానీ ఇప్పుడు అమెజాన్, మైక్రోసాఫ్ట్, స్పేస్ఎక్స్ వంటి ప్రైవేటు టెక్ సంస్థల పేర్లు కూడా ఈ వివాదంలో వినిపిస్తున్నాయి. AI వీడియో ద్వారా ఇరాన్ ఇచ్చిన హెచ్చరికలు అంతర్జాతీయ టెక్ రంగంలోనూ చర్చకు దారితీసే అవకాశం ఉంది.
మరి ఇరాన్ హెచ్చరికలు కేవలం మానసిక ఒత్తిడి పెంచే ప్రచారానికే పరిమితమవుతాయా? నిజంగానే అమెరికా టెక్ కంపెనీల కార్యాలయాలకు ముప్పుగా మారతాయా? మరోవైపు ట్రంప్ చెప్పినట్లుగా అమెరికా కొత్త ఏడాదిలో ఇరాన్‌పై మళ్లీ దాడులకు దిగుతుందా? తేలాల్సి ఉంది.
—సూర్య ప్రకాష్ జోశ్యుల







