వన గణపతికి ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం
కేవలం మొక్కలతోనే 9 అడుగుల ఎత్తులో తయారు చేసిన వన గణపతి (Vana Ganapati) కళాకృతికి ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కింది. ఈ మేరకు తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం పొట్టిలంక గ్రామానికి చెందిన మురుగన్ నర్సరీ రైతు ధనరాజు (Dhanaraju)కు ధ్రువీకరణ పత్రాలు అందాయి. పంజాబ్ (Punjab)కు చెందిన ఈ సంస్థ కొరియర్ ద్వారా వీటిని పంపించింది. ఆయన రెండేళ్ల పాటు శ్రమించి ఈ అద్భుతమైన ఆకృతిని తయారు చేశారు. కేవలం నాలుగు మాల్పీజియా తీగజాతి మొక్కలతో ఈ గణేష్ ఆకృతిని తయారు చేయడం సోషల్ మీడియాలో వైరల్ కావడంతోపాటు జాతీయస్థాయి మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ (International Book of Record) సంస్థ ఈ మొక్కకు సంబంధించిన వివరాలను సేకరించింది. అరుదైన గుర్తింపు లభించడం పట్ల రైతు ధనరాజు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.







