జాగ్రత్త: బ్లాక్ ఫ్రైడే ఆఫర్ల మాటున ఆన్లైన్ మోసాలు!
ఏడాది పొడవునా ఎదురుచూసే భారీ డిస్కౌంట్లు.. కళ్లు చెదిరే ఆఫర్లు.. తక్కువ ధరకే నచ్చిన వస్తువులను సొంతం చేసుకునే అవకాశం! బ్లాక్ ఫ్రైడే వచ్చిందంటే ఆన్లైన్ షాపింగ్ ప్రియులకు పండగే. ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలు మొదలుకొని చిన్న చిన్న ఆన్లైన్ స్టోర్ల వరకు ప్రత్యేక ఆఫర్లతో వినియోగదారులను ఆకర్షిస్తుంటాయి. అయితే ఈ డిస్కౌంట్ల సందడిలో మరో ప్రమాదం కూడా నెమ్మదిగా పెరుగుతోంది. షాపింగ్‌ను సులభతరం చేస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఇప్పుడు సైబర్ నేరగాళ్లకు కూడా కొత్త ఆయుధంగా మారుతోంది. మరి ఆకర్షణీయమైన ఆఫర్ల వెనుక ఎలాంటి మోసాలు దాగి ఉన్నాయి? ఏఐ షాపింగ్ అసిస్టెంట్లను నమ్మడం ఎంతవరకు సురక్షితం?
ఏడాదిలో 77 రెట్లు పెరిగిన ఏఐ షాపింగ్!
ఆన్లైన్ షాపింగ్‌లో ఏఐ వినియోగం అనూహ్యంగా పెరుగుతోంది. వినియోగదారుల తరఫున వస్తువులను వెతకడం, ధరలను పోల్చడం, నచ్చిన ఉత్పత్తులను ఎంపిక చేయడం, చివరకు ఆర్డర్లు చేయడం వరకు ఏఐ ఆధారిత షాపింగ్ ఏజెంట్లు సేవలు అందిస్తున్నాయి.
మోసాల నివారణ సంస్థ ఫోర్టర్ (Forter) వెల్లడించిన వివరాల ప్రకారం.. ఏఐ షాపింగ్ కార్యకలాపాలు గత ఏడాదితో పోలిస్తే ఏకంగా 77 రెట్లు పెరిగాయి. మూడు నెలల క్రితంతో పోలిస్తే 11 రెట్లు అధికంగా నమోదయ్యాయి. సంస్థ విడుదల చేసిన సైబర్ వీక్ లైవ్ ట్రాకర్ ప్రకారం.. నవంబర్ 26, 27 తేదీల్లో ఏఐ ఏజెంట్ల ద్వారా జరిగిన ఆర్డర్లు గత ఏడాదితో పోలిస్తే 108 రెట్లు పెరిగాయి.
అంటే వినియోగదారులు స్వయంగా వెబ్సైట్లలో వెతికి కొనుగోలు చేయడం కంటే.. ఏఐ అసిస్టెంట్లకు తమ అవసరాలను చెప్పి వాటి ద్వారా షాపింగ్ చేయడానికి ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. అయితే ఇదే సమయంలో సైబర్ నేరగాళ్లు కూడా తమ వ్యూహాలను మార్చుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి
బ్లాక్ ఫ్రైడే వేళ ఫిషింగ్ దాడుల కలకలం!
డిస్కౌంట్ల కోసం వినియోగదారులు ఆన్లైన్లో ఎక్కువ సమయం గడిపే బ్లాక్ ఫ్రైడే సీజన్‌ను సైబర్ నేరగాళ్లు లక్ష్యంగా చేసుకుంటున్నారు. నకిలీ ఆఫర్ల పేరుతో ఈమెయిళ్లు, మెసేజ్‌లు పంపిస్తూ వ్యక్తిగత వివరాలు, బ్యాంకింగ్ సమాచారం దొంగిలించేందుకు ప్రయత్నిస్తున్నారు.
బ్రిటన్‌కు చెందిన సైబర్ భద్రతా సంస్థ డార్క్ట్రేస్ (Darktrace) నవంబర్ 24న విడుదల చేసిన నివేదిక ప్రకారం.. నవంబర్‌లో తొలి మూడు వారాల్లో రోజువారీ బ్లాక్ ఫ్రైడే ఫిషింగ్ ఈమెయిళ్ల సంఖ్య అక్టోబర్‌తో పోలిస్తే 13 రెట్లకు పైగా పెరిగింది. 2025తో పోలిస్తే ఈసారి ఈ సీజనల్ పెరుగుదల 29 శాతం అధికంగా నమోదైంది.
డార్క్ట్రేస్ సీఈఓ ఎడ్ జెన్నింగ్స్ ఏఐ ఏజెంట్లను సరికొత్త అంతర్గత భద్రతా ముప్పుగా అభివర్ణించారు. ఆ సంస్థ భద్రత, ఏఐ వ్యూహ విభాగం వైస్ ప్రెసిడెంట్ మార్గరెట్ కన్నింగ్‌హామ్ మరో కీలక విషయాన్ని వెల్లడించారు. నకిలీ రివ్యూలు, వెబ్పేజీల్లో దాచిన సూచనల ద్వారా ఏఐ అసిస్టెంట్లను తప్పుదారి పట్టించి, మోసపూరిత విక్రయదారులను సిఫార్సు చేసేలా చేయవచ్చని హెచ్చరించారు.
నకిలీ స్టోర్లను సిఫార్సు చేస్తున్న ఏఐ చాట్బాట్లు!
ఏఐ అసిస్టెంట్లు సూచించే ప్రతి షాపింగ్ లింక్ సురక్షితమైనదేనా? అన్న ప్రశ్నకు పరిశోధనలు ఆందోళనకరమైన సమాధానాలనే ఇస్తున్నాయి.
సెర్చబుల్ (Searchable) సంస్థ 82 బ్రాండ్లు, బ్రిటన్‌లో 7,380 షాపింగ్ ప్రశ్నలపై పరిశోధన నిర్వహించింది. ఇందులో ChatGPT, గూగుల్ జెమినీ (Gemini), గూగుల్ AI Mode పనితీరును పరిశీలించింది.
ఈ అధ్యయనంలో ప్రతి ఆరు ప్రముఖ బ్రాండ్లలో ఒక బ్రాండ్‌కు సంబంధించిన షాపింగ్ ప్రశ్నకు ఏఐ చాట్బాట్లు అనుమానాస్పద నకిలీ బ్లాక్ ఫ్రైడే స్టోర్లను సూచించినట్లు వెల్లడైంది.
ముఖ్యంగా డిస్కౌంట్ల గురించి అడిగినప్పుడు ఈ సమస్య ఎక్కువగా కనిపించింది. ChatGPT, Google AI Modeతో పోలిస్తే అనుమానాస్పద వెబ్సైట్లను సూచించే అవకాశం 62 శాతం ఎక్కువగా ఉన్నట్లు పరిశోధన పేర్కొంది. అలాగే Geminiతో పోలిస్తే ఆ అవకాశం ఆరు రెట్లకు పైగా ఉన్నట్లు తెలిపింది.
మరోవైపు మేధో సంపత్తి సంస్థ పోడ్కీ (Podqi) పరిశోధనలో ఏఐ షాపింగ్ సమాధానాల్లో 18 శాతానికి పైగా నకిలీ, కాపీహక్కుల ఉల్లంఘనలకు సంబంధించిన లేదా చెల్లని వెబ్సైట్ల సమాచారం ఉన్నట్లు గుర్తించారు.
అచ్చం అసలైన వెబ్సైట్లలాగే నకిలీ స్టోర్లు!
గతంలో నకిలీ వెబ్సైట్లను గుర్తించడం కొంత సులభంగా ఉండేది. అక్షర దోషాలు, తప్పులతో కూడిన వాక్యాలు, నాసిరకం డిజైన్లు వంటి అంశాల ఆధారంగా వాటిని అనుమానించేవారు. కానీ ఇప్పుడు జనరేటివ్ ఏఐ అందుబాటులోకి రావడంతో అసలైన ఆన్లైన్ స్టోర్లను పోలిన నకిలీ వెబ్సైట్లను కూడా రూపొందించడం సులభమైంది.
చెక్ పాయింట్ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్‌కు చెందిన అమెరికా విభాగం చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్ సిండి కార్టర్ ఈ విషయంపై హెచ్చరించారు. ఏఐ సాయంతో నమ్మదగినట్లుగా కనిపించే నకిలీ స్టోర్‌ఫ్రంట్‌లను సృష్టించవచ్చని తెలిపారు.
అందువల్ల వినియోగదారులు ఏఐ సూచించిన లింకులను గుడ్డిగా నమ్మకుండా, అధికారిక రిటైలర్ వెబ్సైట్లను నేరుగా సందర్శించాలని సూచించారు. అలాగే కొనుగోళ్ల సమయంలో క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లింపులు చేయడం మంచిదని పేర్కొన్నారు.
బెటర్ బిజినెస్ బ్యూరో (BBB) గణాంకాలు కూడా ఇదే ఆందోళనను వ్యక్తం చేస్తున్నాయి. 2026లో ఇప్పటివరకు ఏఐ ప్రస్తావన ఉన్న మోసాల ఫిర్యాదులు 4,312కు చేరాయి. గతంతో పోలిస్తే ఈ సంఖ్య రెట్టింపు కంటే ఎక్కువగా పెరిగినట్లు మార్కెట్‌వాచ్ వెల్లడించింది.
ఏఐ షాపింగ్‌పై రిటైలర్లలో భిన్నాభిప్రాయాలు!
ఏఐ ఆధారిత షాపింగ్ వేగంగా విస్తరిస్తుండటంతో ప్రముఖ రిటైల్ సంస్థలు కూడా తమ వ్యూహాలను మార్చుకుంటున్నాయి. మెటా మ్యూజ్ (Meta’s Muse), ఓపెన్ఏఐ చాట్‌జీపీటీ వంటి టూల్స్ ద్వారా షాపింగ్, చెక్అవుట్ ప్రక్రియలు పెరుగుతున్నాయి.
అయితే ఈ ఏఐ ఏజెంట్లను తమ ప్లాట్‌ఫామ్‌లలో ఎంతవరకు అనుమతించాలనే విషయంలో సంస్థల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
సెప్టెంబర్‌లో అమెజాన్ తన వెబ్సైట్లో మ్యూజ్ ద్వారా షాపింగ్ చేయడాన్ని అడ్డుకుంది. మరోవైపు వాల్‌మార్ట్ మాత్రం కస్టమర్ ఖాతాల్లో ఏఐ ఏజెంట్ల కోసం ప్రత్యేక ప్రొఫైల్స్‌ను ఏర్పాటు చేసింది. ఈ పరిణామాలు ఏఐ షాపింగ్ వల్ల కలిగే అవకాశాలతో పాటు భద్రతాపరమైన సవాళ్లు కూడా పెరుగుతున్నాయని సూచిస్తున్నాయి.
ఆఫర్ల మోజులో పడితే.. జేబుకు చిల్లు!
బ్లాక్ ఫ్రైడే ఆఫర్లు, భారీ డిస్కౌంట్లు వినియోగదారులను ఆకర్షించడం సహజం. అయితే తక్కువ ధరకు వస్తువు లభిస్తోందనే తొందరలో ఏ లింక్ పడితే ఆ లింక్ తెరవడం, వెబ్సైట్ వివరాలు పరిశీలించకుండా చెల్లింపులు చేయడం ప్రమాదకరం. ముఖ్యంగా ఏఐ సూచించిన ప్రతి వెబ్సైట్ నమ్మదగినదని భావించకూడదు.
సైబర్ నేరగాళ్లు కూడా మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా తమ మోసాల పద్ధతులను మార్చుకుంటున్నారు. అందుకే బ్లాక్ ఫ్రైడే షాపింగ్‌లో ఆఫర్లను ఆస్వాదించడంతో పాటు డిజిటల్ భద్రతకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలి. లేదంటే తక్కువ ధరకు వస్తువు కొనాలన్న ఆశ.. ఉన్న డబ్బును పోగొట్టుకునే పరిస్థితికి దారితీయవచ్చు.
—సూర్య ప్రకాష్ జోశ్యుల







