స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్‌ను పూర్తిగా వినియోగించాలి : సీఎం చంద్రబాబు
కరువు, తుఫాన్లతో నష్టపోయిన రైతులకు త్వరగా ఇన్పుట్ సబ్సిడీ
ఇన్పుట్ సబ్సిడీకి బీమా సాయం తోడైతే రైతుకు మేలు
హార్టికల్చర్‌తో పాటు ప్రకృతి సేద్యానికీ జీ రామ్ జీ నిధులను వినియోగించుకోవాలి
-డిజాస్టర్ మేనేజ్మెంట్పై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి, నవంబర్ 28:- ఒకవైపు కరువు, మరోవైపు తుపాన్ల బెడద ఉన్న రాష్ట్రంలో ప్రజలను ఆదుకోవడానికి డిజాస్టర్ మేనేజ్మెంట్ నిధులను సద్వినియోగం చేసుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. కరువు, తుపాన్ల సమయంలో డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్ ద్వారా బాధితులకు అండగా నిలిచి, వారికి న్యాయం చేయాలన్నారు. ఈ నిధులను పూర్తిగా వినియోగించుకోవడంతో పాటు కేంద్రం నుంచి అదనపు నిధులు సాధించాలని చెప్పారు.

ఎల్ నినో కారణంగా ఏర్పడిన కరువు, అర్నబ్, మురసు తుపాన్లతో రైతులకు జరిగిన నష్టం, ఇన్పుట్ సబ్సిడీ చెల్లింపులపైనా సీఎం సమీక్షించారు. నష్టపోయిన రైతులకు సాధ్యమైనంత త్వరగా ఇన్పుట్ సబ్సిడీ అందించాలని ఆదేశించారు. ఎన్డీఆర్ఎఫ్ నిబంధనల ప్రకారం కరువు, రెండు తుపాన్ల వల్ల వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక రంగాల్లో జరిగిన నష్టానికి గాను ఎస్డీఆర్ఎఫ్ నుంచి రూ.2,459 కోట్లు చెల్లించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు. ఇందులో ఒక్క వ్యవసాయ రంగానికి ఎల్ నినో కారణంగా ఏర్పడిన కరువుకు రూ.1,721 కోట్లు, అర్నబ్ తుపానుకు రూ.602 కోట్లు, మురసు తుపానుకు రూ.97 కోట్లు ప్రతిపాదించినట్లు వివరించారు.
ఇవి కూడా చదవండి
ఎస్డీఆర్ఎఫ్ నిధుల నుంచి ప్రభుత్వం అందించే ఇన్పుట్ సబ్సిడీతో పాటు ప్రతి రైతుకూ బీమా సాయం అందేలా చూడాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఇందుకు అవసరమైన వివరాలను పక్కాగా సేకరించి, నిధులను నేరుగా బాధిత రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలన్నారు. ఇన్పుట్ సబ్సిడీతో పాటు బీమా సొమ్ము కూడా రైతులకు చేరితే వారికి న్యాయం జరుగుతుందని సీఎం చెప్పారు. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో అందుబాటులో ఉన్న నిధులను రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు కార్యాచరణ చేపట్టాలని సీఎం సూచించారు. హార్టికల్చర్‌కు జీ రామ్ జీ నిధుల వినియోగానికి ఇప్పటికే ఆమోదం ఉందని పేర్కొన్నారు. ప్రకృతి సేద్యానికీ ఈ నిధులను వినియోగించేందుకు అవసరమైన అనుమతులు సాధించాలని అధికారులకు సూచించారు.







