మహిళా రిజర్వేషన్లు అమలుచేసి తీరతాం.. విపక్షాలు అడ్డుకోలేవన్న ప్రధాని మోడీ..!
మహిళా రిజర్వేషన్ల అమలు దిశగా కేంద్రం అడుగులేస్తోంది. ఈ బిల్లు అమలుకు ఎదురయ్యే అన్ని అడ్డంకులను పరిష్కరించేదిశగా ముందుకెళుతోంది. డీ లిమిటేషన్, మహిళా బిల్లుకు సంబంధించి అంశాల వారీగా విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తుండడంతో.. వాటన్నింటినీ దాటుకుంటూ ఒక్కో అడుగు ముందుకేస్తోంది.
ఈక్రమంలో మహిళా రిజర్వేషన్ల విషయంలో ఎదురయ్యే అన్ని అడ్డంకులను తొలగిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పార్టీలు ఈ రిజర్వేషన్ల అమలును ఎప్పటికీ అడ్డుకోలేవని స్పష్టం చేశారు.
ఈ మేరకు సామాజిక మాధ్యమాల వేదికగా ఓ వీడియో విడుదల వేశారు మోడీ. మహిళా రిజర్వేషన్లపై తాము ‘నారీ శక్తి’కి మాట ఇచ్చామని, దానిని నెరవేర్చేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. డీలిమిటేషన్-మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్రం ఈనెల 30న లోక్సభలో ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో మోడీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ఇవి కూడా చదవండి
‘‘చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల (Women’s Quota)కు సంబంధించి దశాబ్దాలుగా పోరాటం సాగుతోంది. దీని కోసం ప్రయత్నం చేస్తున్నవారిలో నేనూ ఒకడిని. ఎంతోమంది మహిళలు ఈ విషయాన్ని నా ఎదుట లేవనెత్తుతూనే ఉన్నారు. ఎంతోమంది సోదరీమణులు లేఖలు పంపారు. దేశంలో 100 శాతం నారీశక్తి ఆశీర్వాదం మాపై ఉంది. మహిళా రిజర్వేషన్ల దారిలో వచ్చే ప్రతి అడ్డంకిని తొలగిస్తాం. ఇందుకోసం మేం దృఢ సంకల్పంతో ఉన్నాం. కేవలం సమయం కోసం చూస్తున్నాం. ప్రతిపక్ష పార్టీలు ఎప్పటికీ దీన్ని అడ్డుకోలేవు’’ అని ప్రధాని మోదీ తెలిపారు.







