ప్రజలకు సత్వర న్యాయం అందించాలి : సీఎం చంద్రబాబు
లోక్ అదాలత్, ఆర్బిట్రేషన్ లాంటి ప్రత్యామ్నాయాలతో సత్వర న్యాయం
కోర్టు కేసుల పరిష్కారానికి ప్రభుత్వంలో లీగల్ ఏఐ స్టాక్ వ్యవస్థ
భారతదేశంలో 4 వ్యవస్థలు బలంగా ఉండడం వల్లనే సంక్షోభాలను ఎదుర్కొని నిలబడ్డాం
తూర్పుగోదావరి జిల్లా కోర్టు 222వ, రాజమండ్రి బార్ అసోసియేషన్ 131 ఏళ్ల వేడుకల్లో సీఎం చంద్రబాబు
రాజమహేంద్రవరం, నవంబరు 28: న్యాయ వ్యవస్థలో సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించి కేసుల నిర్వహణను మరింత సమర్థంగా, వేగంగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. లీగల్ గవర్నెన్స్, లిటిగేషన్ మేనేజ్మెంట్ కోసం త్వరలోనే లీగల్ ఏఐ స్టాక్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. ప్రస్తుతం ఆన్లైన్ లిటిగేషన్ కేస్ మేనేజ్మెంట్ వ్యవస్థ ద్వారా 8.4 లక్షల కేసులను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఏఐ ఆధారంగా కేసుల విశ్లేషణ, కౌంటర్ అఫిడవిట్ల తయారీ, చట్టాలు, ప్రభుత్వ ఉత్తర్వులు, నిబంధనలు, కేసుల రికార్డులను ఒకే డిజిటల్ వేదికపైకి తీసుకురావడం ఈ వ్యవస్థ లక్ష్యమని వివరించారు. తూర్పుగోదావరి జిల్లా కోర్టు 222 ఏళ్లు, రాజమండ్రి బార్ అసోసియేషన్ 131 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాజమహేంద్రవరంలోని మంజీరా సరోవర్ ప్రీమియర్ హోటల్లో నిర్వహించిన వేడుకల్లో సీఎం పాల్గొని ప్రసంగించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎస్వీఎన్ భట్టీ నారాయణ భట్టి, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ పి.నరసింహ, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసాగిల్, త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రామచంద్రరావు, పలువురు హైకోర్టు న్యాయమూర్తులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వారి సమక్షంలో వార్షికోత్సవ సావనీర్‌ను సీఎం విడుదల చేశారు. సీనియర్ న్యాయవాదులు, న్యాయమూర్తులు, విశ్రాంత న్యాయమూర్తులను సత్కరించారు.
ప్రజలకు సత్వర న్యాయం అందించాలి
ప్రజాస్వామ్యంలో న్యాయవ్యవస్థతో పాటు ప్రజాప్రతినిధుల వ్యవస్థ కూడా ప్రజల హక్కుల పరిరక్షణకు పనిచేస్తోందని చంద్రబాబు పేర్కొన్నారు. రాజ్యాంగం నిర్దేశించిన విలువలను కాపాడుతూ ప్రతి ఒక్కరికీ సకాలంలో న్యాయం అందించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. లోక్ అదాలత్‌లు, మధ్యవర్తిత్వం, ఆర్బిట్రేషన్ వంటి ప్రత్యామ్నాయ విధానాలను ప్రోత్సహించడం ద్వారా కేసుల పరిష్కారాన్ని వేగవంతం చేయవచ్చని చెప్పారు. కోర్టుల్లో ప్రభుత్వం కూడా ప్రతివాదిగా ఉన్న కేసులను న్యాయస్థానాల సహకారంతో త్వరితగతిన పరిష్కరించి ప్రజలకు ప్రయోజనం కల్పించాలన్నది తమ ఆలోచనగా వెల్లడించారు. తాటి చెట్ల ఆకులపై తీర్పుల ప్రతులు రాసిన రోజుల నుంచి నేటి కృత్రిమ మేధ వరకు న్యాయ వ్యవస్థ ఎంతో రూపాంతరం చెందిందని సీఎం అన్నారు. ప్రజా కోర్టుగా పేరొందిన సీతానగరం రచ్చబండ కోర్టు 1849లోనే అధికారిక కోర్టుగా గుర్తింపు పొందిందని గుర్తుచేశారు. రాజమండ్రి బార్ అసోసియేషన్, తూర్పుగోదావరి జిల్లా కోర్టులు సుదీర్ఘకాలంగా ప్రజలకు న్యాయ సేవలు అందిస్తున్నాయని అభినందించారు. రాజమండ్రి బార్ అసోసియేషన్‌లో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసిన జస్టిస్ కోకా సుబ్బారావు దేశ తొమ్మిదో ప్రధాన న్యాయమూర్తిగా పనిచేయడం ఈ ప్రాంతానికి గర్వకారణమన్నారు. స్వాతంత్య్ర సమరయోధుడు టంగుటూరి ప్రకాశం పంతులు వంటి న్యాయవాదులు బ్రిటీష్ పాలకులను ఎదిరించి నిలిచిన ధైర్యశాలులని కొనియాడారు. ఆదికవి నన్నయ్య, కందుకూరి వీరేశలింగం పంతులు వంటి మహనీయుల జన్మస్థలంగా, కార్యక్షేత్రంగా చారిత్రక ప్రాధాన్యం కలిగిన ప్రాంతమని పేర్కొన్నారు. ఆర్థర్ కాటన్ నిర్మించిన బ్యారేజీ ఉభయగోదావరి జిల్లాల డెల్టాను సస్యశ్యామలం చేసి ఈ ప్రాంతాన్ని అన్నపూర్ణగా మార్చిందని గుర్తుచేశారు.
అమరావతికి అండగా నిలిచిన తీర్పు
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా ఇచ్చిన తీర్పు రాష్ట్రాన్ని, అమరావతిని కాపాడిందని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఏపీ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసాగిల్ చరిత్రలో నిలిచిపోయారని అభినందించారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లు కూడా త్వరలో అమల్లోకి వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు సంక్షోభాలను ఎదుర్కొంటున్నా భారత్ మాత్రం స్థిరంగా ముందుకు సాగుతోందని సీఎం చెప్పారు. ప్రజాస్వామ్యంలోని నాలుగు స్తంభాలు పటిష్ఠంగా ఉండటమే దీనికి ప్రధాన కారణమన్నారు. 2047 నాటికి దేశాన్ని వికసిత్ భారత్‌గా, రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దడమే లక్ష్యమని చెప్పారు. పౌర పాలనలోనూ ఏఐ సాంకేతికతను వినియోగించి మెరుగైన సేవలు అందిస్తున్నామని, పన్నుల వసూళ్లలోనూ సాంకేతిక పరిజ్ఞానంతో మంచి ఫలితాలు సాధిస్తున్నామని వివరించారు. వచ్చే ఏడాది ఏపీ జీవనాడి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడంతో పాటు గోదావరి పుష్కరాలను నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. సీఎంగా మూడోసారి గోదావరి పుష్కరాలను నిర్వహించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. పుష్కరాలకు విచ్చేసి పుణ్య స్నానాలు ఆచరించాలని సుప్రీం కోర్టు, హైకోర్టు న్యాయమూర్తులను ముఖ్యమంత్రి ఆహ్వానించారు. 222 ఏళ్ల చరిత్ర కలిగిన తూర్పుగోదావరి జిల్లా కోర్టుకు, 131 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకున్న రాజమండ్రి బార్ అసోసియేషన్‌కు ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు.







