శాశ్వత అధికారంకోసం మోడీ కుట్ర.. డీ లిమిటేషన్ పై కాంగ్రెస్ ఫైర్..!
నియోజకవర్గాల పునర్విభజన బిల్లు ప్రజాస్వామ్యానికి తీరని ముప్పని కాంగ్రెస్ మండిపడింది. ప్రధాని మోడీ, అమిత్ షాలు శాశ్వత అధికారం కోసం కుట్రలు పన్నుతున్నారని.. అందులో భాగంగానే ఈబిల్ తెస్తున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ఆరోపించారు.కేంద్ర మంత్రివర్గం ఆమోదం పొందిన ఈ రాజ్యాంగ సవరణ బిల్లును నవంబర్ 30న ప్రారంభం కానున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ప్రవేశపెట్టనుంది కేంద్రం. ఈ నేపథ్యంలో, ఢిల్లీలోని ఇండియా కూటమి నేతల భేటీ అనంతరం ఖర్గే కేంద్రం తీరుపై మండిపడ్డారు.
లోక్సభ స్థానాల సంఖ్యను 850కి పెంచడం వెనుక ఉన్న అసలు ఉద్దేశం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సవరించిన బిల్లు ఎస్సీ, ఎస్టీ వర్గాలకు తీవ్ర అన్యాయం చేస్తోందని ఆరోపించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 330 ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు రిజర్వ్డ్ స్థానాల పెంపుపై బిల్లులో ఎలాంటి స్పష్టమైన హామీ ఇవ్వలేదని దుయ్యబట్టారు. త్వరలో 2026 జనాభా లెక్కలు రానున్నప్పటికీ, ఆ వివరాల ఆధారంగా కాకుండా తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల మేరకే సరిహద్దులను మార్చే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
ఇవి కూడా చదవండి
డీలిమిటేషన్ ప్రక్రియ బాధ్యతలను కేంద్ర ఎన్నికల సంఘానికి (ఈసీఐ) అప్పగించాలన్న ప్రతిపాదనను ఖర్గే తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ నిష్పాక్షికంగా వ్యవహరించడం లేదని, ఇప్పటికే ఆయన ఆరోపణల బోనులో నిలబడ్డారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సంఘం ద్వారా తమకు నచ్చిన స్థానాలను జనరల్ గానూ, ఇష్టం వచ్చిన వాటిని రిజర్వ్డ్గానూ మార్చేసి తీవ్ర అవకతవకలకు పాల్పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఏప్రిల్లో ఈ బిల్లు వీగిపోయిన తర్వాత సంఖ్యాబలం కోసం బీజేపీ కుయుక్తులు పన్నిందని ఖర్గే ఆరోపించారు. తృణమూల్ కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన వంటి ప్రతిపక్ష పార్టీలను చీల్చి, విపక్షాలను బలహీనపరిచి ఇప్పుడు మళ్లీ బిల్లును ముందుకు తెస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ బిల్లును ప్రస్తుత రూపంలో ఆమోదిస్తే దేశానికి తీరని నష్టం వాటిల్లుతుందని, పార్లమెంట్లో ఇండియా కూటమి కలిసికట్టుగా దీనిపై పోరాడుతుందని స్పష్టం చేశారు.







