‘ఐన్‌స్టీన్ వీసా’ పొందడం ఇక కష్టమే.. రూల్స్ కఠినతరం చేసిన ట్రంప్!
అమెరికాలో అడుగుపెట్టడమే కాదు.. అక్కడే శాశ్వతంగా స్థిరపడాలని కలలు కనే ప్రతిభావంతులకు ఇన్నాళ్లూ ఒక అద్భుతమైన అవకాశం ఉంది. ఉద్యోగం కోసం ఏళ్ల తరబడి ఎదురుచూడాల్సిన అవసరం లేదు.. H-1B వీసా కోసం కంపెనీల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. మీ రంగంలో మీకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు, అసాధారణ ప్రతిభ ఉంటే చాలు.. ఏకంగా అమెరికా గ్రీన్ కార్డు పొందే అవకాశం కల్పించే ఓ ప్రత్యేక వీసా ఉంది. అదే EB-1A!
దీనినే ప్రపంచవ్యాప్తంగా ‘ఐన్‌స్టీన్ వీసా’ అని పిలుస్తారు. సైన్స్, టెక్నాలజీ, కళలు, విద్య, వ్యాపారం, క్రీడలు.. ఇలా ఏ రంగంలోనైనా అసాధారణ ప్రతిభ చూపినవారికి అమెరికాలో శాశ్వత నివాసం పొందే మార్గాన్ని ఇది తెరుస్తుంది. అంతేకాదు, అర్హత ఉంటే సొంతంగానే దరఖాస్తు చేసుకోవచ్చు. ఉద్యోగ ఆఫర్ కోసం ఎదురుచూడాల్సిన అవసరం కూడా లేదు.
ఇంతటి ప్రత్యేకతలు ఉన్న వీసా కోసం ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఆసక్తి చూపిస్తుండగా.. ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వం తీసుకుంటున్న కఠిన వైఖరి వారిని ఆందోళనకు గురిచేస్తోంది. ఒకప్పుడు సులభంగా లభించిన ఈ వీసా ఇప్పుడు ఎందుకింత కష్టంగా మారింది? అసలు దరఖాస్తు చేసుకున్నవారిలో ఎంతమందికి గ్రీన్ కార్డు దక్కుతోంది? ఇక్కడే ఓ ఆసక్తికరమైన ట్విస్ట్ ఉంది. ఇదే వీసా ప్రోగ్రామ్ ద్వారా మెలానియా ట్రంప్ కూడా అమెరికాలో శాశ్వత నివాస హక్కు పొందారు!
75 శాతం నుంచి 32 శాతానికి.. ఎందుకలా?
ఐన్‌స్టీన్ వీసా విషయంలో అమెరికాలో పరిస్థితులు ఎంతలా మారిపోయాయో తాజా గణాంకాలు చూస్తేనే అర్థమవుతుంది. జో బైడెన్ అధ్యక్షుడిగా ఉన్న చివరి నెలల్లో EB-1A దరఖాస్తుల్లో సుమారు 75 శాతం ఆమోదం పొందాయి. కానీ డొనాల్డ్ ట్రంప్ మళ్లీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. 2026 మధ్య నాటికి ఆమోద రేటు ఏకంగా 32 శాతానికి పడిపోయింది. అంటే గతంలో నాలుగు దరఖాస్తులు వస్తే దాదాపు మూడు ఆమోదం పొందే పరిస్థితి ఉండగా.. ఇప్పుడు మూడు దరఖాస్తుల్లో ఒక్కటికి మాత్రమే అనుమతి లభించే పరిస్థితి కనిపిస్తోంది.
ది వాషింగ్టన్ పోస్ట్ వెల్లడించిన ఫెడరల్ ఇమ్మిగ్రేషన్ డేటా ప్రకారం, 2026 ఆర్థిక సంవత్సరం మొదటి మూడు త్రైమాసికాల్లో సుమారు 5,200 మందికి మాత్రమే ఈ వీసాలు మంజూరయ్యాయి. అదే 2024లో ఇదే సమయంలో దాదాపు 8,900 మందికి అనుమతి లభించింది. అంటే వేల సంఖ్యలో దరఖాస్తుదారులు ఈ అవకాశాన్ని కోల్పోతున్నారన్నమాట. ఈ పరిణామంతో తమ రంగాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నవారు కూడా వీసా తిరస్కరణను ఎదుర్కోవాల్సి వస్తోందని ఇమ్మిగ్రేషన్ న్యాయవాదులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి
పేరులో ఐన్‌స్టీన్.. కానీ ఈ వీసా కోసం అంతటి మేధావి కానక్కర్లేదు!
‘ఐన్‌స్టీన్ వీసా’ అనే పేరు వింటే ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్తలకే ఇస్తారేమో అనిపించవచ్చు. కానీ దీనికి ఐన్‌స్టీన్‌తో నేరుగా సంబంధం లేదు. ఇది అసాధారణ ప్రతిభ కలిగిన వ్యక్తులకు ఇచ్చే EB-1A కేటగిరీకి ఉన్న ప్రజాదరణ పొందిన పేరు మాత్రమే. సైన్స్‌లో గొప్ప పరిశోధనలు చేసినవారే కాదు.. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన కళాకారులు, క్రీడాకారులు, వ్యాపారవేత్తలు, విద్యావేత్తలు కూడా ఈ వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
అయితే ప్రతిభ ఉందని చెప్పుకుంటే సరిపోదు. దాన్ని నిరూపించే ఆధారాలు ఉండాలి. అంతర్జాతీయ స్థాయి అవార్డులు సాధించడం, తమ పనిపై ప్రముఖ మీడియా సంస్థల్లో కథనాలు రావడం, తమ రంగంలో కీలకమైన ఆవిష్కరణలు చేయడం, ఇతరుల పనిని అంచనా వేసే న్యాయనిర్ణేతలుగా వ్యవహరించడం, పరిశోధనా పత్రాలు ప్రచురించడం, ప్రముఖ సంస్థల్లో కీలక బాధ్యతలు నిర్వహించడం వంటి అంశాలు ఇందుకు ఉపయోగపడతాయి. మొత్తం పది అర్హత ప్రమాణాల్లో కనీసం మూడింటిని నిరూపించాల్సి ఉంటుంది. లేదంటే ఒలింపిక్ మెడల్, పులిట్జర్, ఆస్కార్ వంటి అత్యున్నత స్థాయి గుర్తింపులు ఉండాలి.
ఇక్కడే అసలు సమస్య మొదలవుతోంది. ఈ అర్హతలు సాధించినంత మాత్రాన వీసా ఖరారైనట్లు కాదు. మొదట అభ్యర్థి కనీస అర్హతలను పరిశీలిస్తారు. ఆ తర్వాత ఆయన సాధించిన విజయాలు నిజంగా అసాధారణమైనవేనా? సమర్పించిన ఆధారాలు ఎంత బలంగా ఉన్నాయి? తన రంగంపై ఆయన ఎంతటి ప్రభావం చూపించారు? అనే అంశాలను అధికారులు మరోసారి లోతుగా పరిశీలిస్తారు. ప్రస్తుతం ఈ తుది పరిశీలనలోనే ఎక్కువ దరఖాస్తులు తిరస్కరణకు గురవుతున్నాయని న్యాయవాదులు చెబుతున్నారు.
అర్హతలు ఉన్నా సరిపోవడం లేదా? ట్రంప్ సర్కార్ కొత్త వైఖరి ఇదేనా?
ట్రంప్ ప్రభుత్వం అధికారికంగా EB-1A దరఖాస్తులను తిరస్కరించాలని ఆదేశించినట్లు ఆధారాలు లేవు. అయినప్పటికీ, అధికారులు గతంతో పోలిస్తే మరింత కఠినంగా వ్యవహరిస్తున్నారని ఇమ్మిగ్రేషన్ న్యాయవాదులు చెబుతున్నారు. గతంలో నిర్దేశించిన ప్రమాణాలకు సంబంధించిన ఆధారాలు చూపిస్తే చాలావరకు దరఖాస్తులు ఆమోదం పొందేవని, ఇప్పుడు మాత్రం అభ్యర్థి మొత్తం కెరీర్‌ను, సాధించిన విజయాల ప్రాధాన్యతను మరింత లోతుగా అంచనా వేస్తున్నారని అంటున్నారు.
అమెరికా ఇమ్మిగ్రేషన్ న్యాయవాదుల సంఘంలో పనిచేసిన మాజీ అధికారి కేట్ అంగుస్టియా కూడా ఈ భారీ తగ్గుదలపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఒకవైపు ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రతిభావంతులను అమెరికాకు తీసుకురావాలని ట్రంప్ ప్రభుత్వం చెబుతుంటే.. మరోవైపు ఈ వీసాల ఆమోదాలు ఇంతలా తగ్గడం విచిత్రంగా ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. న్యాయవాది రేచెల్ బాస్కిన్ సైతం ప్రస్తుతం దరఖాస్తుల పరిశీలనలో అధికారుల వ్యక్తిగత అంచనాలకు ఎక్కువ ప్రాధాన్యం పెరిగిందని పేర్కొన్నారు.
అయితే అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖ మాత్రం ఈ విధానాన్ని సమర్థించుకుంటోంది. వేగం కోసం నాణ్యతను, భద్రతా తనిఖీలను పక్కనపెట్టబోమని, వీసా దరఖాస్తుదారులపై మరింత సమగ్ర పరిశీలన జరుపుతున్నామని స్పష్టం చేసింది.
భారతీయులకూ షాకే.. డబ్బులిస్తే అవార్డులు, గుర్తింపులు వస్తాయా?
ఈ పరిణామం భారతీయులని కంగారు పెడుతోంది. ముఖ్యంగా H-1B వీసా ద్వారా అమెరికాలో ఉద్యోగాలు చేయాలనుకునేవారు ఎదుర్కొంటున్న సమస్యలు, గ్రీన్ కార్డు కోసం ఏళ్ల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితుల కారణంగా చాలామంది ఇప్పుడు EB-1A వైపు మొగ్గు చూపుతున్నారు. తమ కెరీర్లో సాధించిన విజయాలను ఆధారంగా చేసుకుని నేరుగా గ్రీన్ కార్డు పొందాలని ప్రయత్నిస్తున్నారు.
దాంతో కొన్ని ఇమ్మిగ్రేషన్ కన్సల్టెన్సీలు వ్యాపారంగా మార్చుకుంటున్నాయనే ఆరోపణలు కూడా వెలుగులోకి వచ్చాయి. అవార్డులు సంపాదించడంలో సహాయం చేస్తామని, పరిశోధనా పత్రాల్లో సహ రచయితలుగా పేర్లు చేర్పిస్తామని, వివిధ సంస్థల్లో జడ్జిలుగా అవకాశాలు కల్పిస్తామని కొన్ని సంస్థలు డబ్బులు తీసుకుంటున్నట్లు CBS న్యూస్ పరిశోధనలో వెల్లడైంది. అంటే నిజంగా కష్టపడి సాధించాల్సిన గుర్తింపులను కొందరు డబ్బులు పెట్టి పొందుతున్నారనే ఆందోళనలు వ్యక్తమయ్యాయి.
ఈ వ్యవహారంలో భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త రంజీత్ ముధోల్కర్ నిర్వహిస్తున్న సంస్థ పేరు కూడా ప్రస్తావనకు వచ్చింది. తమ కార్యక్రమం ద్వారా 56 మంది విజయవంతంగా వీసాలు పొందారని ఆయన సంస్థ పేర్కొంది. అయితే కొందరు మాజీ కస్టమర్లు తాము వాస్తవానికి గుర్తింపులను కొనుగోలు చేస్తున్నామని తర్వాత తెలుసుకున్నట్లు CBS న్యూస్‌కు వెల్లడించారు. ఈ ఆరోపణలను ముధోల్కర్ ఖండించారు. తమ సంస్థ ఎలాంటి అవార్డులు, జర్నల్స్ లేదా ప్రచురణలను విక్రయించదని, వాటిని తప్పనిసరి కూడా చేయదని స్పష్టం చేశారు.
ఇదే వీసాతో మెలానియా అమెరికాలో స్థిరపడ్డారు.. మరి ఇప్పుడు?
ఈ కథనంలో అందరినీ ఆశ్చర్యపరిచే అంశం ఇదే. ప్రస్తుతం ఇతరులకు ఇంత కఠినంగా మారిన EB-1 ప్రోగ్రామ్ ద్వారానే మెలానియా ట్రంప్ కూడా అమెరికాలో శాశ్వత నివాస హక్కు పొందారు. 2001లో మోడల్‌గా పనిచేస్తున్న సమయంలో ఆమెకు ఈ వీసా లభించింది. అయితే ఆమెకు ఈ కేటగిరీ కింద అర్హత ఎలా లభించిందనే అంశంపై అప్పట్లో చర్చ జరిగింది.
ది వాషింగ్టన్ పోస్ట్ కథనం ప్రకారం, కేట్ మాస్, గిసెల్ బుండ్చెన్, నవోమీ క్యాంప్‌బెల్ వంటి అగ్రశ్రేణి సూపర్ మోడళ్ల స్థాయిలో మెలానియా గుర్తింపు పొందలేదనే అభిప్రాయాలు అప్పట్లో వ్యక్తమయ్యాయి. 2000లో స్పోర్ట్స్ ఇల్లస్ట్రేటెడ్ స్విమ్‌సూట్ ఎడిషన్‌లో ఆమె కనిపించడం కూడా ఆమె వృత్తిపరమైన గుర్తింపుల్లో ఒకటిగా ప్రస్తావించబడింది. అయినప్పటికీ, అప్పట్లో అమల్లో ఉన్న ఇమ్మిగ్రేషన్ నిబంధనల ప్రకారం ఆమె అర్హత సాధించి ఉండవచ్చని న్యాయ నిపుణులు అభిప్రాయపడ్డారు.
ఈ వీసా ద్వారా శాశ్వత నివాస హక్కు పొందిన తర్వాత ఆమె అమెరికా పౌరసత్వం పొందే మార్గం సుగమమైంది. అంతేకాదు, తన స్లోవేనియా దేశానికి చెందిన తల్లిదండ్రులకు కూడా అమెరికాలో చట్టబద్ధమైన నివాసం కల్పించే అవకాశం లభించింది. అంటే ఒకప్పుడు ఆమెకు అమెరికాలో స్థిరపడేందుకు ఉపయోగపడిన ఇదే వీసా ఇప్పుడు ఇతరులకు మాత్రం అంత సులభంగా దొరకడం లేదు.
ఐన్‌స్టీన్ వీసాలోనూ మూడు రకాలున్నాయి.. అవేంటంటే?
చాలామందికి తెలియని మరో విషయం ఏమిటంటే, EB-1 ప్రోగ్రామ్‌లో మూడు వేర్వేరు కేటగిరీలు ఉన్నాయి. EB-1A అసాధారణ ప్రతిభ కలిగిన వ్యక్తుల కోసం ఉద్దేశించింది. EB-1B అంతర్జాతీయ గుర్తింపు ఉన్న ప్రొఫెసర్లు, పరిశోధకులకు వర్తిస్తుంది. ఇక EB-1C విదేశాల్లోని బహుళజాతి సంస్థల్లో మేనేజర్ లేదా ఎగ్జిక్యూటివ్ హోదాలో పనిచేస్తూ, అదే సంస్థకు చెందిన అమెరికా విభాగానికి బదిలీ అయ్యేవారికి ఉపయోగపడుతుంది. ఈ మూడింటి అర్హతలు వేర్వేరుగా ఉంటాయి. అయితే ‘ఐన్‌స్టీన్ వీసా’ అనే పేరు ప్రత్యేకంగా EB-1A కేటగిరీకి ఎక్కువగా వాడుకలో ఉంది.
ప్రతిభకు ప్రాధాన్యమా.. లేక కఠిన తనిఖీలకే పెద్దపీటనా?
ప్రపంచవ్యాప్తంగా ప్రతిభావంతులను ఆకర్షించడంలో అమెరికాకు ఈ వీసా ఒక ముఖ్యమైన మార్గంగా ఉంది. ముఖ్యంగా AI, టెక్నాలజీ, పరిశోధన, కళారంగాల్లో అత్యుత్తమ ప్రతిభ ఉన్నవారు అమెరికాలో స్థిరపడితే అక్కడి ఆర్థిక వ్యవస్థకు, పరిశోధన రంగానికి ప్రయోజనం కలుగుతుందని నిపుణులు భావిస్తున్నారు. కానీ దరఖాస్తుల తిరస్కరణలు పెరుగుతుండటంతో అమెరికా తనకు అవసరమైన అంతర్జాతీయ ప్రతిభను కోల్పోయే ప్రమాదం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
అమెరికా ఇమ్మిగ్రేషన్ కౌన్సిల్ కూడా ఉద్యోగ ఆధారిత గ్రీన్ కార్డులపై పెరుగుతున్న ఆంక్షలు, తిరస్కరణలు ప్రపంచ ప్రతిభను ఆకర్షించి నిలుపుకునే అమెరికా సామర్థ్యంపై ప్రభావం చూపవచ్చని హెచ్చరించింది.
—సూర్య ప్రకాష్ జోశ్యుల







