అమెరికాలో రోడ్డు ప్రమాదం… తెలంగాణ యువకుడి దుర్మరణం
అమెరికాలో తెలుగు యువకుడు దుర్మరణం చెందాడు. అమెరికాలో ఉద్యోగం సాధించిన వారం రోజులకే రోడ్డు ప్రమాదంలో ఈరమల్ల సాయి తేజ (25) దుర్మరణం పాలయ్యాడు.అయితే.. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.సాయి తేజ స్వస్థలం నల్లగొండ జిల్లాలోని మునుగోడు. రెండేళ్ల క్రితం బీటెక్ పూర్తి చేసి, ఉన్నత విద్య కోసం అమెరికాకి వెళ్లాడు.
అక్కడ ఉన్నత విద్య పూర్తి చేసి, ఉద్యోగం కూడా సంపాదించాడు. అయితే.. నవంబర్ 18వ తేదీ సాయంత్రం న్యూయార్క్ లోని ఇంటర్ స్టేట్ 90 హైవేపై తన స్నేహితుడితో కలిసి కారులో ప్రయాణిస్తుండగా రోడ్డుకు అడ్డంగా వచ్చిన జింకను ఢీకొట్టారు. దీంతో కారు మరో రెండు వాహనాలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సాయితేజతో పాటు అతని స్నేహితుడు కూడా తీవ్రంగా గాయపడ్డారు. వారిద్దరినీ చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా, సాయితేజ మాత్రం అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.
ఇక.. సాయి తేజ మృతదేహాన్ని నల్లగొండకు తరలించేందుకు అమెరికాలోని తెలుగు సంఘాలు, అతడి స్నేహితులు ప్రయత్నాలు ప్రారంభించారు.
కొడుకు ఉద్యోగంలో చేరాడని, ఇక తమ కష్టాలు తీరాయని ఆనందపడిన తల్లిదండ్రులకు ఈ వార్త పిడుగుపాటులా తగిలింది. స్నేహితుల ద్వారా విషయం తెలుసుకున్న వారు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. సాయితేజ మరణంతో మునుగోడులో విషాద ఛాయలు అలముకున్నాయి.







