తన నవలల కంటే తన జీవితమే థ్రిల్లింగ్.. జెఫ్రీ ఆర్చర్ చివరి అధ్యాయం ముగిసింది
ఒకప్పుడు బ్రిటన్ పార్లమెంట్లో ఎంపీగా అడుగుపెట్టాడు.. ఆ తర్వాత రాజకీయ వివాదాల్లో చిక్కుకుని జైలుకెళ్లాడు. కానీ అదే వ్యక్తి రాసిన కథలు ప్రపంచవ్యాప్తంగా 30 కోట్లకు పైగా కాపీలు అమ్ముడయ్యాయి. రాజకీయాలు, స్కాండల్స్, జైలు, బెస్ట్ సెల్లర్ నవలలు.. ఇలా ఓ సినిమా కథను తలపించే జీవితాన్ని గడిపిన బ్రిటిష్ రచయిత జెఫ్రీ ఆర్చర్ ఇక లేరు.
లండన్‌లోని తన నివాసంలో ప్రశాంతంగా రాసుకుంటూనే ఆయన కన్నుమూసినట్లు ప్రచురణ సంస్థ హార్పర్‌కాలిన్స్ ప్రకటించింది. రాజకీయాల్లో సంచలనాలు, ఊహించని సవాళ్లు, ఆపై జైలు శిక్ష వరకు.. ఆయన జీవితం మొత్తం ఒక అద్భుతమైన థ్రిల్లర్ నవలను తలపిస్తుంది.
కష్టాల నుంచి పుట్టిన అద్భుత రచయిత
జెఫ్రీ ఆర్చర్ చాలా చిన్న వయసులోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టి, కేవలం 29 ఏళ్లకే పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికై అందరి దృష్టినీ ఆకర్షించారు. కానీ ఆ సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు. కెనడాకు చెందిన ఒక కంపెనీలో పెట్టిన పెట్టుబడులు పూర్తిగా మునిగిపోవడంతో ఆయన దాదాపు దివాళా తీసే పరిస్థితికి చేరుకున్నారు.
సరిగ్గా అదే ఆర్థిక సంక్షోభాన్ని తనలోని రచనా సామర్థ్యానికి ఇంధనంగా మార్చుకున్నారు. ఆ అనుభవాల ఆధారంగానే 1975లో ‘నోట్ ఎ పెన్నీ మోర్, నోట్ ఎ పెన్నీ లెస్’ అనే తొలి నవలను రాసి, ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది పాఠకుల మనుసులను గెలుచుకున్నారు. ఆ తర్వాత ఆయన వెనుతిరిగి చూసుకోలేదు; ప్రపంచవ్యాప్తంగా ఆయన పుస్తకాలు 30 కోట్లకు పైగా కాపీలు అమ్ముడయ్యాయి.
అధిరోహించిన శిఖరాలు.. ఎదురైన వివాదాలు
రచనల్లో కోట్లు సంపాదిస్తున్నప్పటికీ రాజకీయాల పట్ల ఆయనకున్న మోజు తగ్గలేదు. కన్జర్వేటివ్ పార్టీకి కొండంత అండగా నిలుస్తూ భారీగా నిధులు సమకూర్చడంతో అప్పటి ప్రధాని మార్గరెట్ థాచర్ ఆయనను పార్టీ డిప్యూటీ చైర్మన్‌గా నియమించారు.
అయితే, ఒక వ్యభిచారిణికి డబ్బులు చెల్లించారనే వివాదం చుట్టుముట్టడంతో ఆ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత హౌస్ ఆఫ్ లార్డ్స్ సభ్యుడిగా, లండన్ మేయర్ రేసులో అభ్యర్థిగా ముందంజలో ఉన్న సమయంలో పాత కేసులో తప్పుడు సాక్ష్యం ఇప్పించేందుకు యత్నించారనే ఆరోపణలు ఆయనను కోలుకోలేని దెబ్బతీశాయి.
ఇవి కూడా చదవండి
కోర్టు తీర్పు, జైలు జీవితం నుంచి చివరి శ్వాస వరకు
2001లో జరిగిన విచారణలో కోర్టును దారిమళ్లించారనే నేరం రుజువు కావడంతో ఆర్చర్‌కు నాలుగేళ్ల జైలు శిక్ష పడింది. రాజకీయ జీవితం ముగిసినా, జైలు శిక్ష అనుభవించినా ఆయన కలం మాత్రం ఆగలేదు. భార్య మేరీ ఆర్చర్ ప్రతి కష్టసమయంలోనూ ఆయనకు కొండంత అండగా నిలిచారు.
పతనం నుంచి బెస్ట్ సెల్లర్ వరకు
తన ఆర్థిక అనుభవాల నుంచి స్ఫూర్తి పొంది ‘Not a Penny More, Not a Penny Less’ నవలను రాశారు. అది 1976లో ప్రచురితమైంది. తర్వాత ‘Shall We Tell the President?’ 1977లో వచ్చింది. కానీ 1979లో వచ్చిన ‘Kane and Abel’ ఆయన జీవితాన్నే మార్చేసింది.
ఆ పుస్తకం 3 కోట్లకు పైగా కాపీలు అమ్ముడైంది. ఆ తర్వాత అది బెస్ట్ సెల్లింగ్ ట్రైలజీగా మారింది. 1985లో సామ్ నీల్ నటించిన అమెరికన్ మినిసిరీస్గా కూడా ‘Kane and Abel’ తెరకెక్కింది.
తన ఐదు దశాబ్దాల కెరీర్లో ఆర్చర్ మొత్తం 31 నవలలు రాశారు. వీటితో పాటు పలు చిన్న కథల సంకలనాలు, నాటకాలు, పిల్లల కథలు, మూడు భాగాల జైలు జ్ఞాపకాలను కూడా రచించారు.
‘ది గార్డియన్’ ప్రకారం, ‘ది సండే టైమ్స్’ బెస్ట్ సెల్లర్ జాబితాలో ఆర్చర్ పుస్తకాలు మొత్తం 14 సంవత్సరాల 5 నెలలు కొనసాగాయి. అలాగే ‘ది న్యూయార్క్ టైమ్స్’ బెస్ట్ సెల్లర్ జాబితాలో ఐదేళ్లకు పైగా నిలిచాయి.
రాజకీయాల్లో ఒకప్పుడు ఎదిగి, ఆ తర్వాత తీవ్రంగా పడిపోయిన వ్యక్తి.. అదే జీవితంలోని ఒడిదుడుకులను కథలుగా మలిచి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది పాఠకులను సంపాదించుకున్నారు. జెఫ్రీ ఆర్చర్‌కు భార్య డేమ్ మేరీ ఆర్చర్, కుమారులు జేమ్స్, విలియం, పలువురు మనుమలు ఉన్నారు.
చివరి రోజుల్లో ప్రోస్టేట్ క్యాన్సర్‌తో పోరాడుతూ కూడా ఆయన రాయడం ఆపలేదు. తన చివరి నవల ‘ఆడమ్ అండ్ ఈవ్’ విడుదల కానున్న తరుణంలో, చేతిలో కలం పట్టుకుని ప్రశాంతంగా కన్నుమూస్తూ తన జీవితం అనే సుదీర్ఘమైన థ్రిల్లర్ కథకు ఆర్చర్ ముగింపు పలికారు.








