కుక్క కళ్లతో సినిమా చూస్తే ఎలా ఉంటుంది? జాక్ లండన్ క్లాసిక్పై AI ప్రయోగం
—సూర్య ప్రకాష్ జోశ్యుల
కొన్ని కథలు చదవం… వాటిలోకి వెళ్లిపోతాం.
జాక్ లండన్ రాసిన The Call of the Wild అలాంటి కథ. 1903లో వచ్చిన ఈ నవలలో పెద్దగా మనుషుల హీరోయిజం లేదు. భారీ ట్విస్టులు లేవు. అయినా ఒక కుక్క జీవితాన్ని చదువుతుంటే… కొద్దికొద్దిగా మనిషి నాగరికత వెనక్కి వెళ్లిపోతున్నట్టు, అడవి మనలోకి వస్తున్నట్టు అనిపిస్తుంది.
ఈ నవల్లో ప్రధాన పాత్ర బక్. బక్ ఒక కుక్క. కానీ జాక్ లండన్ అతన్ని కేవలం కుక్కగా రాయలేదు. సౌకర్యంగా పెరిగిన ఒక జీవి… ఆకలి, హింస, మంచు, భయం మధ్య తనలో దాగి ఉన్న మరో స్వభావాన్ని ఎలా కనుగొంటుందో రాశాడు. అందుకే The Call of the Wild ఇప్పటికీ ఒక జంతువు కథలా అనిపించదు. అది మనలోని ‘సివిలైజ్డ్’ మనిషి ఎంత పలుచని పొర మీద నిలబడి ఉన్నాడో చెప్పే కథలా అనిపిస్తుంది. ఈ నవల ప్రపంచ భాషలన్నింటిలోనూ అనువాదం అయ్యింది. తెలుగులోనూ ప్రకృతి పిలుపు గా కొడవగంటి కుటుంబరావుగారు అనువాదం చేసారు. అద్బుతమైన ఈ నవల, దీని అనువాదాలు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి.
అంత గొప్ప నవలను సినిమాగా మార్చాలనుకోవటం సహజం. అయితే అది అంత సులభం కాదు. ఇన్నేళ్లుగా The Call of the Wild ను తెరెక్కిస్తూనే ఉన్నారు. ఆ సినిమాలను చూస్తే ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుంది. నవలలో మనం బక్తో కలిసి ప్రయాణిస్తాం. సినిమాలో మాత్రం మనం బక్ను చూస్తాం. ఇదే అసలు తేడా.
జాక్ లండన్ కథను బక్ అనుభవిస్తున్న ప్రపంచం నుంచి రాశాడు. కానీ తెరపైకి వచ్చినప్పుడు అదే కథ ఎక్కువగా దర్శకుడి పాయింట్ ఆఫ్ వ్యూగా మారిపోయింది. బక్ పరుగెడతాడు. పోరాడతాడు. బాధపడతాడు. అడవిలోకి వెళ్తాడు. తెరమీద మనకు బక్ ఏం చేస్తున్నాడో కనిపిస్తుంది. కానీ బక్ ఏం అనుభవిస్తున్నాడో నవలలో ఉన్నంత లోతుగా తెరపైకి రావడం కష్టం. దాంతో ఒక విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది.
నవలలో రాసిన ప్రపంచాన్ని సినిమాగా చూడటం బదులు… నవల సారాంశాన్ని సినిమాగా చూస్తున్న అనుభూతి. ఇప్పుడు 123 ఏళ్ల తర్వాత వస్తున్న AI ప్రయోగం ఈ సమస్యను పూర్తిగా మరో కోణంలో చూడమంటోంది. Harry Potter సినిమాల్లో ఆరు చిత్రాలకు నిర్మాతగా పనిచేసిన డేవిడ్ బారన్, దర్శకుడు సైమన్ రమ్లీతో కలిసి The Call of the Wildను జనరేటివ్ AIతో రూపొందిస్తున్నారు. అయితే ఇక్కడ AIని ఉపయోగించడంలో అసలు ప్రయోగం మంచు, అడవులు, తోడేళ్లు, భారీ యాక్షన్ సన్నివేశాలను చవకగా తయారు చేయడం కాదు.
అది జరిగితే ఇది మరో VFX టెక్నాలజీ మాత్రమే. అసలు ప్రయోగం ఇంకా డెప్త్ లో ఉంది. కెమెరాను బక్ వైపు తిప్పడం కాదు… కెమెరా అనే భావననే బక్ అనుభవంగా మార్చడం. ఇన్నాళ్లూ సినిమా ఒక సన్నివేశాన్ని మనకు చూపిస్తుంది. AI ఆధారంగా రూపొందిస్తున్న ఈ వెర్షన్ మాత్రం ఒక సన్నివేశాన్ని బక్ ఎలా అనుభవిస్తాడో చూపించడానికి ప్రయత్నిస్తోంది.
ఉదాహరణకు— మనిషికి మంచు అంటే తెల్లగా కనిపించే భూభాగం. బక్కు అదే మంచు వాసనల సముద్రం కావచ్చు . చలితో గట్టిపడిన నేలకావచ్చు. పరుగెత్తేటప్పుడు కాళ్ల కింద జారిపోయే ప్రమాదం కావచ్చు. దూరంలో వినిపించే ఒక శబ్దం వెనుక దాగి ఉన్న ముప్పు కావచ్చు.ఒకే ప్రపంచం. వేర్వేరు అనుభవాలు. సినిమా ఇప్పటివరకు ఎక్కువగా మొదటి ప్రపంచాన్నే చూపించింది. AI ప్రయోగం రెండో ప్రపంచాన్ని తెరపైకి తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది.
అదే జరిగితే ఇది The Call of the Wildకే పరిమితమైన మార్పు కాదు. ఎందుకంటే ఇప్పటివరకు సినిమాకు ఒక ప్రాథమిక నియమం ఉంది:
ప్రేక్షకుడు ఏదో ఒక పాత్రను చూస్తాడు.ఫాలో అవుతాడు. AI ఆ రూల్ ని మార్చేస్తుంది. రేపు కథ ఒక కుక్క దృష్టిలో మాత్రమే కాదు.ఒక పక్షి దృష్టిలో కావచ్చు. సముద్రంలో ఉన్న తిమింగలం దృష్టిలో కావచ్చు. ఒక పురాతన మనిషి దృష్టిలో కావచ్చు. లేదా మనిషి ఎప్పుడూ చూడలేని ఒక కల్పిత జీవి దృష్టిలో కావచ్చు. అప్పుడు సినిమా అంటే కేవలం “కథను చూపించడం” కాదు.“మరో జీవి, మరో మనిషి, మరో ప్రపంచం ఎలా అనుభవిస్తుందో మనకు అనుభవింపజేయడం” కావచ్చు.
ఇదే ఈ AI ప్రయోగం యొక్క అసలు ప్రభావం. AI వల్ల దర్శకుడికి మరో కెమెరా దొరికిందని కాదు. ఇంతకాలం మనిషి కెమెరాతో చూపించలేకపోయిన దృష్టికోణాలను సృష్టించే అవకాశం దొరకవచ్చు. అది చాలా పెద్ద మార్పు. ఎందుకంటే సినిమా చరిత్రలో టెక్నాలజీ మారిన ప్రతిసారీ కేవలం చిత్ర నాణ్యత మాత్రమే మారలేదు. కథ చెప్పే విధానం కూడా మారింది.
శబ్దం వచ్చినప్పుడు పాత్రలు మాట్లాడటం మొదలుపెట్టాయి. రంగు వచ్చినప్పుడు ప్రపంచం కొత్తగా కనిపించింది. CGI వచ్చినప్పుడు అసాధ్యమైన ప్రపంచాలను నిర్మించగలిగాం. ఇప్పుడు జనరేటివ్ AI ముందు ఉన్న ప్రశ్న: మనిషి దృష్టి దాటి కూడా సినిమా వెళ్లగలదా?
The Call of the Wild ఆ ప్రయోగానికి ఇంట్రస్టింగ్ ఎగ్జాంపుల్ కావచ్చు.
ఈ ప్రయోగానికి అసలు పరీక్ష విజువల్స్ కాదు. AI ఎంత అందంగా అలాస్కాను సృష్టించిందన్నది కాదు. ఒక ప్రేక్షకుడు సినిమా ముగిసిన తర్వాత — “నేను బక్ కథ చూశాను” అంటాడా? లేక… “కొద్దిసేపు నేను బక్గా ఉన్నాను” అంటాడా? ఆ రెండింటి మధ్య ఉన్న తేడానే ఈ ప్రయోగం విజయాన్ని నిర్ణయించగలదు.
మరి అది నిజంగా సాధ్యమైతే…
The Call of the Wild మళ్లీ ఒక పాత నవల ఆధారంగా తీసిన సినిమా మాత్రమే కాదు. సినిమా ఇకపై కేవలం మనిషి కళ్లతో మాత్రమే ప్రపంచాన్ని చూడాల్సిన అవసరం లేదేమోనని చెప్పిన తొలి సంకేతాల్లో ఒకటిగా మిగిలిపోవచ్చు.








