అమెరికా ఉద్యోగాలు… మోడల్ మారుతోంది! ఎవరికి లాభం?
అమెరికా అనగానే మనవాళ్ళకు ముందుగా గుర్తుకొచ్చేది H-1B. అయితే గత కొంతకాలంగా ఈ వీసా నిబంధనలు బాగా కఠినం కావడంతో, ఇండియా నుంచి అమెరికా వెళ్లే ఐటీ ఉద్యోగుల సంఖ్య భారీగా పడిపోతోంది. ఇది చూసి చాలామంది “ఇక భారతీయ ఐటీ పని అయిపోయినట్లే” అని భావిస్తున్నారు. కానీ నిజానికి అక్కడ జరుగుతున్నది వేరు! అందరూ అనుకుంటున్నట్లు ఇది ఇండియన్ ఐటీ పరిశ్రమకు ముగింపు కాదు, అసలైన ఆట ఇప్పుడే మొదలైంది. ఐటీ ప్రపంచంలో ఒక కొత్త బిజినెస్ మోడల్ చాలా వేగంగా రూపుదిద్దుకుంటోంది.అది కూడా గ్లోబల్ మీడియా, వ్యాపార దిగ్గజాలు అందరూ ఈ మార్పు గురించే ఆసక్తిగా మాట్లాడుకునే స్ధాయిలో కావటం చెప్పుకోదగ్గ విషయం. ఇంతకీ ఆ మార్పు ఏమిటి
రూటు మారిన అమెరికా డ్రీమ్
ఒకప్పుడు మన దేశంలో ఐటీ ఇంజినీర్ కెరీర్ గ్రాఫ్ దాదాపు ఒకేలా ఉండేది. హైదరాబాద్ లేదా బెంగళూరులో ఉద్యోగంలో చేరడం, ఐదేళ్లు అనుభవం వచ్చాక కంపెనీ ద్వారా H-1B వీసా సాధించడం, ఆ వెంటనే అమెరికాలో క్లయింట్ సైట్‌కు వెళ్లడం. అక్కడ డాలర్లలో జీతం తీసుకుంటూ సెటిల్ అవ్వడం ఒక డ్రీమ్‌లా ఉండేది. దశాబ్దాలుగా మన ఐటీ రంగం పెరిగిన తీరులో ఈ మోడల్ చాలా కీలక పాత్ర పోషించింది. కానీ, ఇప్పుడు ఆ దారిలో పెద్ద మార్పులొచ్చాయి. అమెరికా ప్రభుత్వం విధించిన కఠిన ఆంక్షలు కేవలం వీసా దరఖాస్తుల సంఖ్యను మాత్రమే తగ్గించలేదు, అసలు ఉద్యోగి అమెరికా భూభాగం మీద అడుగుపెట్టాల్సిన అవసరమే లేని ఒక కొత్త పని విధానానికి తెరలేపాయి.
అమెరికాలో మనిషి అక్కర్లేదు.. పని జరిగితే చాలు!
ఒక అమెరికన్ కంపెనీకి సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ కోసం ఒక ఇంజినీర్ కావాలనుకుందాం. పాత రోజుల్లో అయితే ఇండియాలోని ఐటీ కంపెనీ సదరు ఉద్యోగిని H-1B వీసాపై విమానం ఎక్కించి అమెరికా పంపించేది. కానీ, ఇప్పుడా పని చేయాలంటే కంపెనీకి తడిసి మోపెడవుతోంది. వీసా ఖర్చులు, లీగల్ చిక్కులు, అమెరికా వేతన నిబంధనలు, నిమిషానికో మారే రూల్స్.. ఇవన్నీ దాటుకుని మనిషిని పంపడం కంటే, అదే ఇంజినీర్‌తో హైదరాబాద్, పుణె లేదా బెంగళూరులోని ఆఫీస్ నుంచి పని చేయించడం చాలా సులువైపోయింది. దీంతో కంపెనీలకు ఒక స్పష్టత వచ్చింది. “పని చక్కగా జరిగేటప్పుడు, ఉద్యోగి భౌతికంగా అమెరికాలోనే ఉండాల్సిన అవసరం ఏముంది?” అనే ప్రశ్న నుంచి ఈ కొత్త విప్లవం పుట్టుకొచ్చింది.
సంఖ్యలు చెప్తున్న సత్యం
అమెరికా ప్రభుత్వ అధికారిక లెక్కలు చూస్తే ఈ మార్పు ఎంత వేగంగా జరుగుతోందో అర్థమవుతుంది. భారతదేశానికి చెందిన దిగ్గజ ఐటీ కంపెనీల H-1B రిజిస్ట్రేషన్లు FY2025లో దాదాపు 24,946 ఉంటే, FY2027 నాటికి అవి ఏకంగా 2,055కు పడిపోయాయి. అంటే ఊహించని విధంగా 92 శాతం మేర రిజిస్ట్రేషన్లు తగ్గిపోయాయి. కాన్సులర్ ప్రాసెసింగ్ అభ్యర్థనలు కూడా 97 శాతం వరకు పడిపోయాయి. వీటిని కేవలం వీసా లెక్కలుగా మాత్రమే చూడలేం. దీని వెనుక ఐటీ కంపెనీల ఒక వ్యూహాత్మక వ్యాపార నిర్ణయం ఉంది. “మనిషిని అక్కడికి పంపాల్సిన అవసరం లేనప్పుడు, ఆ ఖర్చు దండగ” అని కంపెనీలు భావిస్తున్నాయి. ఫలితంగా ఉద్యోగం అమెరికాదే కావచ్చు, కానీ ఆ పని చేసే వ్యక్తి మాత్రం మన దేశంలోనే ఉంటున్నాడు.
ఇవి కూడా చదవండి
ఉద్యోగం అక్కడ.. పని ఇక్కడ!
ఇక్కడ చిన్న వ్యత్యాసాన్ని మనం గమనించాలి. ఒక ఉద్యోగం ఎక్కడ ఉందనేది ఒక విషయమైతే, దానికి సంబంధించిన పని ఎక్కడ జరుగుతుందనేది మరో విషయం. డిజిటల్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక ఈ రెండింటి మధ్య ఉన్న దూరం చెరిగిపోయింది. వ్యక్తిని అమెరికాకు తరలించడం కంటే, డేటాను కోడింగ్ రూపంలో ఇక్కడి నుంచే పంపించడం చాలా చవక, సులభం కూడా. వీసా ఖర్చులు, నిబంధనల భారం పెరిగేసరికి మన ఐటీ కంపెనీలకు భారత్‌లోని డెలివరీ సెంటర్ల విలువ మరింత బాగా అర్థమైంది. ఇక్కడ ఇప్పటికే సిద్ధంగా ఉన్న మౌలిక వసతులు, అపారమైన ప్రతిభ ఉన్న ఇంజినీర్లను ఉపయోగించుకుని పనిని ఇక్కడి నుంచే కానిచ్చేస్తున్నాయి.
భారతదేశానికి కలిసొచ్చేది ఏమిటి?
ఇది భారతదేశంలో టెక్ ఉద్యోగాల ecosystemను పెద్దదిగా చేయగలదు. అలాగే డాలర్లు ఇండియాలోకి వస్తూనే ఉంటాయి ఇది చాలా ముఖ్యమైన ఆర్థిక కోణం. ఉద్యోగి అమెరికాకు వెళ్లకపోయినా, అతను అమెరికన్ కంపెనీకి సేవ అందిస్తే ఆ సేవకు చెల్లింపు మాత్రం అమెరికా నుంచే వస్తుంది. వీటితో పాటు భారతీయ నగరాల ప్రాధాన్యం మరింత పెరగవచ్చు. H-1B ద్వారా అమెరికాకు వెళ్లే ఉద్యోగులపై ఆధారపడటం తగ్గితే, కంపెనీలు India-based global delivery centresపై ఎక్కువ పెట్టుబడి పెట్టాల్సి రావచ్చు. దీంతో:Hyderabad, Bengaluru, Pune, Chennai, Noida, Gurugram లాంటి నగరాల్లో global projects, AI, cybersecurity, cloud, engineering, consulting వంటి high-value work పెరగడానికి అవకాశం ఉంటుంది. కంపెనీలు ఆ పనిని భారత్‌లో ఉంచాలంటే అవసరమైన నైపుణ్యాలు ఇక్కడ అందుబాటులో ఉండాలి.
అలాగని అమెరికా కంపెనీ కోసం Hyderabad నుంచి పని చేయడం అంటే అమెరికాలో కూర్చొని అదే పని చేయడం కాదు. ఉద్యోగి: US clientను పొందవచ్చు. కానీ: US salary, US benefits, US lifestyle పొందకపోవచ్చు. కాబట్టి “అమెరికా పని ఇండియాకు వస్తోంది” అనేది మంచి వార్తలా కనిపించినా, ప్రతి ఉద్యోగికి అది అమెరికా ఉద్యోగానికి సమానం కాదు.
ఈ స్కిల్స్ సరిపోవు
అయితే, ఈ మార్పు ఇండియాకు పూర్తిగా విజయం అని చెప్పలేం. ఎందుకంటే, ఆటోమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అందుబాటులోకి వచ్చాక మామూలు కోడింగ్, బేసిక్ సపోర్ట్ పనులు చేయడం చాలా తేలికైపోయింది. కేవలం తక్కువ జీతాలకే పని చేసి పెడతామంటే కుదరదు. కాబట్టి మన ఐటీ ఉద్యోగులు రూట్ మార్చక తప్పదు. ఏఐ ఇంజినీరింగ్, క్లౌడ్ ఆర్కిటెక్చర్, సైబర్ సెక్యూరిటీ, ప్రొడక్ట్ ఇంజినీరింగ్ వంటి అధిక నైపుణ్యాలు ఉన్న పనులను నేర్చుకోవాల్సి ఉంటుంది. ఒకవైపు అమెరికా వీసా ఆంక్షలు, మరోవైపు ఏఐ వేగం.. ఈ రెండింటినీ తట్టుకోవాలంటే మన వాళ్లు కేవలం ‘ ఉద్యోగాలు’ రావడంపై కాకుండా ‘ఎలాంటి ఉద్యోగాలు’ వస్తున్నాయనే దానిపై దృష్టి పెట్టాల్సి ఉంది.
ప్రపంచం చుట్టూ తిరుగుతున్న ఉద్యోగాలు
మరో ఆసక్తికరమైన విషయమేమిటంటే, మన ఐటీ కంపెనీలు కేవలం అమెరికా మీదే ఆధారపడకుండా యూరప్ వైపు కూడా వేగంగా విస్తరిస్తున్నాయి. టీసీఎస్, పర్సిస్టెంట్, ఎల్‌టిఐ మైండ్‌ట్రీ వంటి కంపెనీలు యూరప్‌లో స్థానిక సంస్థలను కొనుగోలు చేస్తూ తమ ఉనికిని పెంచుకుంటున్నాయి. భారత్‌లో సాంకేతిక సామర్థ్యం, యూరప్‌లో స్థానిక నెట్వర్క్, అమెరికాలో క్లయింట్లు.. ఇలా ఒకే దేశంపై ఆధారపడకుండా గ్లోబల్ మోడల్‌ను అమలు చేస్తున్నాయి.
అమెరికా ప్రభుత్వం సరిహద్దుల వద్ద మనుషుల రాకపోకలను కట్టడి చేయగలదేమో కానీ, డిజిటల్ నెట్వర్క్ ద్వారా జరిగే పనిని ఆపడం దానికి కూడా సాధ్యం కాని పని. హైదరాబాద్‌లో కూర్చుని రాత్రి వేళ అమెరికా క్లయింట్‌తో కాల్ మాట్లాడే ఇంజినీర్ రాసే కోడ్.. అక్కడ అమెరికన్ కంపెనీ సిస్టమ్‌లో క్షణాల్లో రన్ అవుతోంది. ఒకప్పుడు గ్లోబలైజేషన్ అంటే ఉద్యోగి దేశం మారడం, కానీ ఇప్పుడు ఉద్యోగి ఎక్కడికీ కదలకుండానే అతని ఉద్యోగం ప్రపంచమంతా తిరుగుతోంది. అమెరికా H-1B తలుపులు చిన్నవి చేస్తుంటే, మన ఐటీ కంపెనీలు ఆ తలుపుతో పనే లేని ఒక సరికొత్త డిజిటల్ మార్గాన్ని నిర్మించుకున్నాయి.
—సూర్య ప్రకాష్ జోశ్యుల








