పల్లెల్లో ప్రగతి పండుగ, రూ.11,085 కోట్లతో కూటమి సర్కార్ భారీ ప్లాన్..!
ఆంధ్రప్రదేశ్లోని గ్రామీణ ప్రాంతాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం సరికొత్త ప్రణాళికతో ముందుకు సాగుతోంది. గ్రామాల్లో మౌలిక వసతులను అట్టడుగు స్థాయి నుండి బలోపేతం చేసేందుకు ‘పల్లె పండుగ 3.0’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ బృహత్తర ప్రాజెక్టును సెప్టెంబర్ 29న నెల్లూరు జిల్లా ఉదయగిరి వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu), ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Pawan Kalyan) అధికారికంగా ప్రారంభించనున్నారు.
గతంలో విజయవంతంగా పూర్తయిన పల్లె పండుగ 1.0, 2.0 కార్యక్రమాల స్ఫూర్తితో.. ఈసారి మరింత భారీ వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. మొత్తం రూ.11,085 కోట్ల భారీ బడ్జెట్తో ఈ సరికొత్త విడతను రూపొందించారు. ఈ వ్యయంలో కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం కింద రూ.5,391 కోట్లు వాటాగా అందిస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం తన సొంత వాటాగా రూ.5,694 కోట్లను కేటాయించి గ్రామాల్లో నిధుల కొరత లేకుండా చూస్తోంది. ఈ భారీ నిధులతో రాష్ట్రవ్యాప్తంగా రహదారుల నెట్వర్క్ను పూర్తిగా ఆధునీకరించనున్నారు.
పల్లెల్లో అంతర్గత రవాణాను మెరుగుపరిచేందుకు 6,000 కిలోమీటర్ల మేర సీసీ రోడ్లను, అలాగే ప్రధాన గ్రామాలను అనుసంధానిస్తూ 9,500 కిలోమీటర్ల మేర అత్యాధునిక బీటీ రోడ్లను నిర్మించనున్నారు. దీనివల్ల గ్రామీణ ప్రజల ప్రయాణ కష్టాలు శాశ్వతంగా తొలగిపోనున్నాయి. రహదారులతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకైన వ్యవసాయ, పాడి పరిశ్రమలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. పాడి రైతులకు అండగా నిలిచేందుకు 22,000 మినీ గోకులాల నిర్మాణాన్ని చేపట్టనున్నారు.
దీనితో పాటు సుస్థిర ఆదాయ వనరులను సృష్టించేందుకు వీలుగా 50,000 ఎకరాల విస్తీర్ణంలో ఉద్యాన పంటల సాగును పెద్ద ఎత్తున ప్రోత్సహించనున్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం, సామాజిక జీవనాన్ని మెరుగుపరిచేందుకు మరో వినూత్న ప్రణాళికను అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా 1,000 కిలోమీటర్ల పొడవైన మేజిక్ డ్రెయిన్లను నిర్మించనున్నారు. అలాగే ప్రజల సౌకర్యార్థం ఆధునిక బస్ షెల్టర్లు, పాలనా సౌలభ్యం కోసం నూతన పంచాయతీ భవనాలు మరియు గ్రామాల్లో చర్చలకు వేదికలైన రచ్చబండలను పునర్నిర్మించి పల్లెల్లో సరికొత్త వెలుగులు నింపనున్నారు.








