ఏపీ టూరిజానికి డిజిటల్ బూస్ట్..!
ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు కూటమి ప్రభుత్వం సరికొత్త, వినూత్న వ్యూహాలతో ముందుకు సాగుతోంది. ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని రాజమహేంద్రవరంలోని మంజీర కన్వెన్షన్ హాల్ వేదికగా నిర్వహించిన కార్యక్రమాల్లో ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. సాంప్రదాయ పద్ధతులకు డిజిటల్ పవర్ తోడు చేసి, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల ద్వారా ఏపీ టూరిజం బ్రాండ్‌ను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లేలా ప్లాన్ చేశారు.
పర్యాటక దినోత్సవ వేడుకల్లో భాగంగా మంత్రి కందుల దుర్గేష్ స్వయంగా ఆంధ్రా స్పెషల్ ‘ఆత్రేయపురం పూతరేకులు’ తయారు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. సాంప్రదాయ వంటకాల తయారీని ప్రోత్సహిస్తూ ఆయన చేసిన ఈ ప్రయత్నం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అనంతరం, కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖ సోషల్ మీడియా డిజిటల్ క్రియేటర్లు, ఇన్ఫ్లుయెన్సర్లకు మంత్రి స్వయంగా అరిటాకుల్లో ఆంధ్రా సాంప్రదాయ వంటకాలను వడ్డించారు. వారందరితో కలిసి ఒకే బంతిలో కూర్చుని భోజనం చేస్తూ, ఆంధ్రా రుచుల గొప్పతనాన్ని వివరించారు.
గోదావరి జిల్లాల ఆతిథ్యానికి, నోరూరించే ఆంధ్రా వంటకాలకు ఇన్ఫ్లుయెన్సర్లు సైతం ఫిదా అయిపోయారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. నేటి డిజిటల్ యుగంలో పర్యాటక ప్రమోషన్లకు సోషల్ మీడియానే అత్యంత బలమైన సాధనమని స్పష్టం చేశారు. అందుకే రాష్ట్రంలోని అద్భుతమైన పర్యాటక ప్రాంతాలను, సంస్కృతీ సంప్రదాయాలను ప్రపంచానికి చాటిచెప్పేందుకు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను ఏపీ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లుగా మారుస్తున్నట్లు ప్రకటించారు. ఇందులో భాగంగానే ‘ది గోదావరి కాల్స్’ (The Godavari Calls) పేరిట ఇన్ఫ్లుయెన్సర్ల కోసం ప్రత్యేక బస్ టూర్ నిర్వహించామన్నారు.
ఇవి కూడా చదవండి
రాబోయే 2027 గోదావరి పుష్కరాలే లక్ష్యంగా ఏపీ టూరిజాన్ని పూర్తిగా రీడిజైన్ చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రంలోని 130 పర్యాటక ప్రాంతాలను ఏకంగా 130 భాషల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మరియు డిజిటల్ టెక్నాలజీ సహాయంతో ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయబోతున్నట్లు సంచలన విషయాన్ని వెల్లడించారు. కంటెంట్ క్రియేటర్ల క్రియేటివిటీని ఉపయోగించుకుంటూ, ఏపీలోని ప్రతి పర్యాటక కేంద్రానికి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చేలా ఒక రోడ్ మ్యాప్ సిద్ధం చేశామని, ఈ వినూత్న ప్రచార శైలి ద్వారా ఏపీ టూరిజం సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.








