‘సిలికానాంధ్ర’ రజతోత్సవ సంబరాలు…కుంభ హారతి ప్రత్యేకం
అమెరికా: మాతృభాష, తెలుగు సంస్కృతి, కలలు మరియు పరంపర పరిరక్షణే ధ్యేయంగా సేవలందిస్తున్న ప్రముఖ సాంస్కృతిక సంస్థ ‘సిలికానాంధ్ర’ తన 25 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా రజతోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు సిద్ధమైంది. 2026, ఆగస్టు 1వ తేదీన కాలిఫోర్నియాలోని ప్రసిద్ధ ‘ఓక్లాండ్ ఎరీనా’ వేదికగా ఈ సాంస్కృతిక సంబరాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఒకే వేదిక – అనేక సాంప్రదాయాలు – అనంతమైన ఆత్మగౌరవం అనే నినాదంతో రూపుదిద్దుకున్న ఈ వేడుకల్లో భాగంగా రోజంతా పలు విశేష కార్యక్రమాలను నిర్వహించనున్నారు.
శోభా యాత్ర: సాంప్రదాయబద్ధంగా సాగే వైభవ సమేత ఊరేగింపు,
కుంభ హారతి: శోభాయమానమైన దివ్య మంగళ హారతుల సమర్పణ.
సంగీతామృత వర్షిణి, లయామృత వర్షిణి: శాస్త్రీయ సంగీతం మరియు వాద్య బృందాల స్వరతరంగాలు.
లలిత గీతామృత వర్షిణి: మధురమైన లలిత గీతాల ఆలాపన.
శతక శంఖారావం: ప్రాచీన తెలుగు శతక పద్యాల ప్రతిధ్వని.
కూచిపూడి నాట్యామృతవర్షిణి: తెలుగుదనానికి ప్రతీకగా నిలిచే సాంప్రదాయ కూచిపూడి నృత్య రూపకాలు.
వందే భారతం: దేశభక్తిని చాటిచెప్పే ప్రత్యేక ప్రదర్శనలు.
దక్ష యజ్ఞం: ఘనమైన ఇతిహాస నాటక ప్రదర్శన.
జానపద జాతర: మన గ్రామీణ జానపద కళల కోలాహలం.
అమెరికాలోని తెలుగువారందరూ ఈ చారిత్రాత్మక రజతోత్సవ వేడుకల్లో పెద్ద సంఖ్యలో పాల్గొని, మన సంస్కృతీ సాంప్రదాయాల పండగను విజయవంతం చేయాలని సిలికానాంధ్ర నిర్వహణ వర్గం కోరింది.








