రివ్యూ: డివోషనల్, మిస్టరీ థ్రిల్లర్ ‘మహేంద్రగిరి వారాహి’
తెలుగు టైమ్స్.నెట్ రేటింగ్ : 2.5/5
నిర్మాణ సంస్థలు: రాజశ్యామల ఎంటర్టైన్మెంట్స్, బ్రిడ్జ్ ఫిల్మ్స్
నటీనటులు: సుమంత్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి గోస్వామి, మాళవిక నాయర్,
బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, రాజీవ్ కనకాల, అలీ. తదితరులు
సంగీతం: అనూప్ రూబెన్స్, సినిమాటోగ్రాఫర్: ప్రతాప్ ఆర్ కృష్ణ
ఎడిటర్: జునైద్ సిద్ధిఖీ, ఆర్ట్ డైరెక్టర్: కృష్ణ ఆర్ట్స్
నిర్మాతలు: కలిపు మధు, లక్ష్మణ్
దర్శకత్వం: సంతోష్ జాగర్లపూడి
విడుదల తేది :11.09.2026
నిడివి :2 ఘంటల 34 నిముషాలు
ఒకప్పుడు అక్కినేని ఫ్యామిలీ హీరో సుమంత్ (సుమంత్) స్టార్ హీరోగా రాణించారు. సత్యం, గౌరీ, గోదావరి, వంటి సినిమాలతో అదరగొట్టాడు. కానీ ఆ తర్వాత ఆ స్థాయి సక్సెస్‌లు లేవు. దీంతో కొంత బ్రేక్ తీసుకున్నారు. స్పీడ్ పెంచి ఇప్పుడు మళ్లీ పుంజుకున్నారు. వరుస సినిమాలతో సందడి చేస్తున్నారు. సెకండ్ ఇన్నింగ్స్ లో మంచి దూకుడు చూపిస్తున్నాడు. ధియేట్రికల్ మార్కెట్ సంగతి ఎలా ఉన్నా.. అతని ఓటీటీ మార్కెట్ చాలా బెటర్ గా ఉంది. ‘అనగనగా’తో డీసెంట్ హిట్ అందుకున్న సుమంత్, అటు తర్వాత ‘న్యూటన్స్ థర్డ్ లా’ చేశాడు. అది థియేటర్లలో మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నప్పటికీ అక్కడ అంతంత మాత్రంగానే పెర్ఫార్మ్ చేసింది. కానీ ఓటీటీ రిలీజ్ తర్వాత దానికి మంచి అప్రీసియేషన్ లభించింది. ఇదే ఊపులో సుమంత్ నుండీ వస్తున్న మరో స్పిరిచువల్ మిస్టరీ థ్రిల్లర్ ‘మహేంద్రగిరి వారాహి’ (Mahendragiri Varahi) సినిమా. దీనికి సంతోష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. గతంలో ఇతను సుమంత్ తో ‘సుబ్రహ్మణ్యపురం’ అనే సినిమా తీశాడు. అది పర్వాలేదనిపించేలా ఆడింది. ఇప్పుడు వీరి కాంబినేషన్లో వస్తున్న రెండో సినిమా కాబట్టి ‘మహేంద్రగిరి వారాహి’ పై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. ఇందులో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి గోస్వామి, మాళవిక నాయర్ హీరోయిన్లుగా నటించారు. సిద్ధు జొన్నలగడ్డ స్పెషల్ రోల్ చేశారు. రాజశ్యామల ఎంటర్టైన్మెంట్స్, బ్రిడ్జ్ ఫిల్మ్స్ పతాకాలపై కలిపు మధు, సురభి లక్ష్మణ్ రావు నిర్మించారు. ఈ చిత్రం నేడు శుక్రవారం ధియేటర్ లలో విడుదలైంది. మరి సినిమా ఎలా ఉంది? సుమంత్‌కి మరో హిట్ పడిందా అనేది రివ్యూలో తెలుసుకుందాం.
కథ :
రాక్షస సంహారం కోసం అవతారం ఎత్తిన వారాహి అమ్మవారు మహేంద్రగిరి ప్రాంతంలో వెలిసి ఆ ప్రాంత ప్రజలకు అభయంగా నిలుస్తుంది. అయితే మహేంద్రగిరి ప్రాంతానికి చెందిన మహేంద్రగిరి రాజవంశాన్ని 200 ఏళ్లుగా వారాహి అమ్మవారి శాపం వెంటాడుతుంటుంది. ఆ కుటుంబంలో జన్మించిన ప్రతి మగాడు 33వ జన్మతిథి రోజు కన్నుమూస్తుంటారు. అది యాక్సిడెంట్‌గానే జరుగుతుంటుంది. అమ్మవారే స్వయంగా వచ్చి ప్రాణాలు తీస్తుంటుంది. అందుకు కారణం ఆ వంశంలో మహేంద్రవర్మ అనే రాజు.. మహేంద్రగిరి అమ్మవారి దేవాలయంలో ఉన్న అమ్మాయిపై అఘాయిత్యానికి పాల్పడటమే. ఆ శాప విముక్తికోసం రాజవంశానికి చెందినవారు అనేక రకాల పూజలు చేస్తారు. కానీ ఫలితం ఉండదు. దీన్ని రాజేంద్ర వర్మ(సిద్ధు జొన్నలగడ్డ) సైతం ఎదురిస్తాడు. కానీ ఆ శాపానికి బలవుతాడు. అతని భార్య సుజాత(మాళవిక మోహనన్) అప్పటికే గర్భవతి. ఆమె కూడా కారు ప్రమాదంలో గాయపడుతుంది. ఇక ప్రస్తుతం రాజవంశంలో మగాళ్లు లేదు. కానీ కూతురు కొడుకు ఉంటాడు. అతను కూడా వీరి రక్తమే కావడంతో ఆ శాపం వారికి కూడా వర్తిస్తుంటుందంటారు. అయితే దాన్ని నరేంద్రవర్మ(వంశీ) పెద్దగా లెక్కచేయడు. దానికి విముక్తి ఉందని తన భార్య చెబుతుంది. కానీ అది కూడా విఫలమవుతుంది.
నరేంద్రవర్మ, అతనితోపాటు సిద్ధార్థ్(సుమంత్) అన్న రాజీవ్(కమల్ కామరాజు) కూడా అమ్మవారి శాపానికి బలవుతారు. ఇద్దరు ఒకే రోజు మహేంద్రగిరి వారాహి అమ్మవారి టెంపుల్‌కి వస్తారు. అందులో దున్నపోతు వారిద్దని పొడిచి చంపేస్తుంది. ఇదంతా అమ్మవారి శాపం వల్లే జరిగిందా? లేక దీని వెనకాల ఇంకా ఎవరైనా ఉన్నారా? అనే అనుమానం సిద్ధార్థ్‌కి కలుగుతుంది. సిద్ధార్థ్ ఒక యూట్యూబర్. ఇలాంటి మూఢ నమ్మకాలను ఇన్వెస్టిగేట్ చేసి దొంగ బాబాలు, మాంత్రికుల బండారాలు బయటపెడుతుంటాడు. రాజవంశానికి చెందిన నరేంద్ర వర్మ తో సిద్దార్థ్ సోదరుడు రాజీవ్ కూడా శాపం కారణంగా మరణిస్తారు. తన అన్న మరణంపై అనేక అనుమానాలు వ్యక్తం కావడంతో సిద్దార్థ్ ఆ దిశగా దృష్టిపెడుతాడు. అయితే ఇప్పుడు తన అన్న రాజీవ్ మరణానికి కారణం ఏంటి? మహేంద్రగిరి రాజవంశంలో అసలు ఏం జరిగిందనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటాడు. మరి ఈ క్రమంలో తనకు ఎదురైన అడ్డంకులేంటి? ఎలాంటి అనుభవాలు ఫేస్ చేశాడు? ఇందులో బ్రహ్మానందం, రాజీవ్ కనకాల, వెన్నెల కిశోర్ పాత్రలు ఏంటి? వారి పాత్రల్లో ఉన్న ట్విస్ట్ లేంటి? ఐశ్వర్యా రాజేష్ పాత్రేంటి? ఈ మొత్తానికి సిద్ధార్థ్ ఎలాంటి ముగింపు పలికారు అనేది మిగిలిన సినిమా.
నటీనటుల హావభావాలు :
సిద్ధార్థ్ పాత్రలో సుమంత్ ఫర్వాలేదనిపించాడు. స్క్రీన్ ప్రజెన్స్ బాగుంది. కానీ ఇప్పటికే ఇలాంటి సినిమా చేయడంతో కొత్తగా ఫీలయ్యే అవకాశమే కలుగులేదు. కొన్ని సీన్లలో హుందాగా, ఎమోషనల్ కంటెంట్‌ను డెలివరీ చేసి తన మార్కు చాటుకొన్నాడు. సిద్దూ జొన్నలగడ్డ తన ఇమేజ్‌కు తగని పాత్రలో కనిపించాడు. ఆయన ఈ పాత్ర చేయకుండా ఉండాల్సిందేమో అనే ఫీలింగ్ కలుగుతుంది. సిద్దూ వల్ల ఈ సినిమాకు గానీ, ఆయనకు గానీ ఎలాంటి ఉపయోగమే కలుగలేదని చెప్పాలి. ప్రారంభంలో ఆయన పాత్ర పెద్దగా ఇంపాక్ట్ చూపలేదు. సెకండాఫ్‌లో బాగుంది. అలాగే ఐశ్వర్యా రాజేష్ పాత్ర కాసేపు సర్ప్రైజ్ చేస్తుంది. చివర్లో ఆమె పాత్ర వాహ్ అనిపిస్తుంది. నరేంద్ర వర్మగా వంశీ మెప్పించే ప్రయత్నం చేశాడు. కమల్ కామరాజు పాత్ర కూడా ఓకే అనిపిస్తుంది. మరోవైపు పూజారిగా బ్రహ్మానందం కనిపించాడు. ఆయన పాత్రలోని ట్విస్ట్ షాకిస్తుంది. అలాగే రాజీవ్ కనకాల పాత్రలోని ట్విస్ట్ ఊహించేలా ఉంటుంది. దీనికితోడు వెన్నెల కిశోర్ పాత్ర కొంత ఎంటర్ టైన్ చేసింది.
సాంకేతికవర్గం పనితీరు :
సినిమాటోగ్రఫి, మ్యూజిక్, విజువల్ గ్రాఫిక్స్ పర్వాలేదనిపిస్తాయి. ఆ సీన్లకు చేసిన విజువల్ గ్రాఫిక్ వర్క్ కూడా బాగుంది. అమ్మవారి సీన్లు, కొన్ని గ్రాఫిక్ షాట్స్ క్వాలిటీగా ఉంటాయి. సినిమాకి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించారు. ఆయన పాటలు, నేపథ్య సంగీతం కొంత వరకు ఓకే. కానీ ఎలివేట్ చేయాల్సిన సీన్లలోనూ నార్మల్‌గానే ఆర్ఆర్ ఉండటం, అది కూడా రొటీన్‌గానే ఉంది. ఇదే సినిమాకి పెద్ద మైనస్‌గా చెప్పొచ్చు. దీంతో చాలా సీన్లు తేలిపోయాయి. ముఖ్యంగా దేవుడికి సంబంధించిన సీన్లు చప్పగా సాగాయి. ఆర్కే ప్రతాప్ కెమెరా వర్క్ బాగుంది. ప్రతాప్ ఆర్ కృష్ణ చిత్రీకరించిన డివోషనల్ సీన్లు బాగున్నాయి. ఎడిటింగ్ పరంగా కొంత వర్క్ చేయాల్సింది. దర్శకుడు సంతోష్ జాగర్లపూడి ఎంచుకున్న కథ పాతదే దాన్ని ఎంగేజింగ్‌గా తెరకెక్కించాడు. సినిమా లుక్ గ్రాండియర్‌గా ఉంది. కానీ ఆ స్థాయి సీన్లు లేకపోవడం మైనస్‌గా చెప్పొచ్చు. సస్పెన్స్ అంశాలు ఫర్వాలేదు. క్లైమాక్స్ ట్విస్ట్ ఊహించని విధంగా ఉంది. దీంతో అంతా సర్ప్రైజ్ అవుతారు. ఈ విషయంలో దర్శకుడి ఆలోచన అదిరింది.
విశ్లేషణ :
ఇటీవల దేవుడికి సంబంధించిన కథలతో చాలా సినిమాలు వస్తున్నాయి. చాలా వరకు ఆకట్టుకుంటున్నాయి. ఇది కూడా ఆ కోవకి చెందిన మూవీనే.డివోషనల్, యాక్షన్, ఎమోషనల్ కంటెంట్ ఉన్న కథను పేపర్ మీద చూస్తే బ్రహ్మండమైన పాయింట్‌గా అనిపిస్తుంది. దర్శకుడు సంతోష్ జాగర్లమూడి రాసుకొన్న పాయింట్ కూడా ఇంట్రెస్టింగ్‌గానే అనిపిస్తుంది. కానీ పూర్తిస్థాయిలో స్క్రీన్ మీద కథగా చెప్పే ప్రయత్నంలో కంప్లీట్‌గా తడబాటుకు గురయ్యారనే చెప్పాలి. లాజిక్ పరంగా ఈ కథ, సన్నివేశాలు, ట్విస్టులు ఎక్కడా కూడా కన్విన్స్‌గా ఉండవు. అయితే డెఫినెట్‌గా బెస్ట్ డివోషనల్ థ్రిల్లర్ అయ్యే స్కోప్ ఉన్న కథ. అలాంటి అవకాశాన్ని మిస్ చేసుకొన్నారనే చెప్పాలి. డివోషనల్ కంటెంట్ సినిమాల చూడాలనుకొనే వారు ఈ సినిమాపై ఓసారి లుక్కేయండి.. ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్తే కొంత మేరకు సంతృప్తి పడే అవకాశం ఉంది.








