అడల్ట్ సినిమాలతో AIకి శిక్షణా? మెటా పై రూ.3,700 కోట్ల వివాదం
–సూర్య ప్రకాష్ జోశ్యుల
రోజువారీ మనం AIని ఏ ప్రశ్న అడిగినా సమాధానం ఇట్టే క్షణాల్లో ఇచ్చేస్తూంటుంది. అంతేనా మనం అడిగినట్లుగా , మన ఆలోచనలకు తగ్గట్టుగా ఫొటోలు తయారు చేస్తోంది. వీడియోలు క్రియేట్ చేస్తుంది. అక్కడితో ఆగిందా …మన మనిషులం మాట్లాడే తీరు, కదలికలు, ముఖ కవళికలు కూడా అర్థం చేసుకుంటోంది. ఇవన్నీ చూసాక మనందరీ ఒక సందేహం రావడం సహజమే. ఇంత నేర్పు AIకి ఎక్కడి నుంచి వచ్చింది?
మనిషిలా స్కూలుకు వెళ్లలేదు. పుస్తకాలు పట్టుకుని చదవలేదు. అయినా ఇదంతా ఎప్పుడు నేర్చుకుంది,అదెలా సాధ్యం అని?
మన రోబో సినిమాలో చూసినట్లు…అదీ చదువుకోవాలి, కాకపోతే క్షణాల్లో ఎంత మాటరైనా అది చదివేయగలదు. కాబట్టి మనమిచ్చే డేటానే AIకి గురువు. కోట్లాది పేజీలు, ఫొటోలు, వీడియోలు, ఆడియోలు, కోడ్, ఇతర డిజిటల్ కంటెంట్‌ను విశ్లేషిస్తూ AI నేర్చుకుంటుంది. అది నేర్చుకుంటుంది సరేనండీ…దానికి ఈ డేటా అంతా పోగుచేసి ఇచ్చేదెవరు? అంటే దాన్ని తయారు చేసినవాళ్లు, కోట్లు ఖర్చుపెట్టినవాళ్లు అని చెప్పేస్తాం.
అయితే అలా డేటా పోగుచేసుకుని, మళ్లీ దాన్ని ఉపయోగించడానికి అనుమతి తీసుకున్నారా? అన్న ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పలేం. మనష్యులం చదువుతున్నాం, వాడుకుంటున్నాం. దానికి ఎవరికైనా డబ్బులు కట్టాలా అంటే..యాజటీజ్ అదే కాపీ కొట్టినా, ఆ పాట్రన్ ని ఫాలో అయినా డబ్బులు కట్టాల్సిందే. ఇదే లాజిక్ ఇప్పుడు టెక్ ప్రపంచాన్ని కోర్టుల దాకా లాగుతోంది. రోజుకో కేసు వస్తోంది. AI కంపెనీలు కోర్టులు చుట్టూ ఇప్పటికే తిరుగుతున్నాయి.
అలాంటి వివాదంలోకి ఇప్పుడు ఒక ఊహించని కంటెంట్ కూడా వచ్చింది. అవే అడల్ట్ సినిమాలు. మనవాళ్లు రహస్యంగా చూసే సినిమాలను కూడా దాని బుర్రలోకి ఎక్కించేరని, దానికి డేటాగా ఇచ్చేసారని భారీ ఆరోపణ. ఆరోపణతో ఆగలేదు. కోర్టులో కేసు వేసారు. అది నిజమని రుజువైతే దాదాపు రూ.3,700 కోట్లు కట్టాలి.
ఏంటా కేసు
అమెరికాలోని అడల్ట్ ఫిల్మ్ నిర్మాత Strike 3 Holdings చేసిన ఆరోపణల ప్రకారం, మెటా వేలాది అడల్ట్ సినిమాలను BitTorrent ద్వారా డౌన్లోడ్ చేసి, AI వ్యవస్థలకు శిక్షణ ఇవ్వడానికి ఉపయోగించి ఉండొచ్చని వాదిస్తోంది. మెటా మాత్రం ఈ ఆరోపణలను ఖండిస్తోంది.
నిజంగా సినిమాలు డౌన్ లోడ్ చేసారా అంటే వాళ్లు అవును చేసారు అంటున్నారు అడల్డ్ కంపెనీ నిర్మాతలు. అందుకు వారు చెప్పేది ఓ మెటా ఎగ్జిక్యూటివ్ ఇంటి ఇంటర్నెట్ నుంచి దాదాపు 20 వేల ఫైళ్లకు సంబంధించిన టొరెంట్ కార్యకలాపాలు నమోదయ్యాయని కూడా Strike 3 చెబుతున్నారు. ఈ క్రమంలో కథ సాధారణ కాపీరైట్ వివాదం నుంచి కోట్ల డాలర్ల కేసుగా మారింది.
AIకి అసలు శిక్షణ ఎలా ఇస్తారు?
ముందుగా AI ఎలా నేర్చుకుంటుందో అర్థం చేసుకుంటే ఈ వివాదం ఎందుకు వచ్చిందో సులభంగా అర్థమవుతుంది.
ఒక చిన్నపిల్లకు కుక్కను చూపిస్తూ “ఇది కుక్క” అని పదిసార్లు చెబితే, కొంతకాలానికి ఆ పిల్ల కుక్కను గుర్తించడం నేర్చుకుంటుంది. AIకి మాత్రం పదిసార్లు చూపిస్తే సరిపోదు. లక్షలు, కోట్ల ఉదాహరణలు చూపించాల్సి ఉంటుంది.
అందుకే దానికి వేల రకాల వీడియోలు చూపిస్తారు. మనుషులు ఎలా నడుస్తారు, చేతులు ఎలా కదుపుతారు, ముఖం ఎలా మారుతుంది, కెమెరా ఎలా కదులుతుంది, వెలుతురు ఎలా మారుతుంది, ఒక వస్తువు మరో వస్తువుతో ఎలా సంబంధం కలిగి ఉంటుంది వంటి ఎన్నో విషయాలను అది గమనిస్తుంది.
కానీ AI సినిమా చూస్తూ కథను మనిషిలా గుర్తుపెట్టుకోదు. “ఈ సన్నివేశంలో ఇలా జరిగింది” అని జ్ఞాపకం పెట్టుకోదు. భారీ మొత్తంలో డేటాను విశ్లేషించి, వాటిలో కనిపించే నమూనాలను గణితపరంగా నేర్చుకుంటుంది. అందుకే AIకి ఎంత ఎక్కువ, ఎంత వైవిధ్యమైన డేటా దొరికితే అంత విస్తృతమైన నమూనాలను నేర్చుకునే అవకాశం ఉంటుంది.
మరి అడల్ట్ సినిమాల గోలేంటి? AIకి అడల్ట్ సినిమాలు ఎందుకు కావాలి?
అసలు అడల్ట్ సినిమాలు ద్వారా ట్రైనింగ్ ఇచ్చారా లేదా అనేది ఇంకా పూర్తిగా తేలలేదు. కేవలం ఆరోపణ పర్వం దశలోనే ఉంది. అయితే అడల్ట్ ఫిల్మ్ లు చూసి ఏఐ ఏం నేర్చుకోవాలి అంటే.. టెక్నికల్ గా చూస్తే అడల్ట్ వీడియో కూడా ఒక వీడియోనే. అందులో విస్తృతమైన మానవ కదలికలు లేదా శరీరాన్ని అర్థం చేసుకునే సామర్థ్యాన్ని పెంచడానికి డేటా అవసరమైతే, అడల్ట్ కంటెంట్ కూడా ఆ డేటాలో భాగం కావచ్చు అంటున్నారు నిపుణులు.
అయితే…
AIకి శిక్షణ ఇవ్వడానికి అడల్ట్ సినిమాలే అవసరం లేదు. మానవ కదలికలు, ముఖ కవళికలు, శరీర భంగిమలు వంటి విషయాలను చట్టబద్ధమైన ఇతర వీడియోల ద్వారా కూడా నేర్పించవచ్చు. అయినా ఇప్పుడు “అడల్ట్ సినిమాలతో AIకి శిక్షణ ఇవ్వొచ్చా? ఇవ్వకూడదా” అనేది కాదు. “ఇవ్వాలి అనుకుంటే..అలా చేయడానికి కాపీరైట్ ఉన్న సినిమాలను అనుమతి లేకుండా ఎందుకు తీసుకున్నారు?” అనేదే అసలు లా పాయింట్.
మెటా పేరు ఇక్కడికి ఎలా వచ్చింది?
ఇదే సమయంలో Strike 3 Holdings మెటాపై కాపీరైట్ ఉల్లంఘన ఆరోపణలు చేసింది. Strike 3, Counterlife Mediaతో కలిసి మెటా వేలాది అడల్ట్ సినిమాలను BitTorrent ద్వారా డౌన్లోడ్ చేసిందని, వాటిని AI మోడళ్లకు శిక్షణ ఇవ్వడానికి ఉపయోగించిందని ఆరోపిస్తోంది.
మెటా మాత్రం ఈ వాదనను తిరస్కరిస్తోంది. ముఖ్యంగా టొరెంట్ ద్వారా సేకరించిన కంటెంట్‌ను AI శిక్షణ కోసం ఉపయోగించిందన్న ఆరోపణను అంగీకరించడం లేదు.
మరో విచిత్రమైన అంశం
అయితే Strike 3 చెబుతున్న కథనం ప్రకారం, 2025 మార్చి 20న మెటా కంపెనీకి చెందిన IP చిరునామాలో BitTorrent కార్యకలాపాలను గుర్తించారు. ఈ విషయాన్ని మెటా న్యాయవాదులకు కూడా తెలియజేశారు.
ఆ తర్వాత కొన్ని గంటల్లోనే మరో IP చిరునామాలో అదే తరహా కార్యకలాపాలు కనిపించాయని Strike 3 చెబుతోంది.
ఆ IP చిరునామా ఎవరిదో తెలుసా?
మెటా Reality Labsలో పనిచేస్తున్న ఓ ఎగ్జిక్యూటివ్ ఇంటిది. ఇక్కడే అనుమానం మొదలైంది. కంపెనీ నెట్‌వర్క్‌లో కార్యకలాపాలు బయటపడుతున్నాయని తెలిసిన తర్వాత వాటిని ఇంటి ఇంటర్నెట్కు మార్చారా? అన్న అనుమానాన్ని Strike 3 వ్యక్తం చేసింది.
అయితే ఇది Strike 3 వాదన మాత్రమే. మెటా ఈ ఆరోపణను అంగీకరించడం లేదు. అసలు ఆ ఇంటి కనెక్షన్‌ను ఎవరు ఉపయోగించారు? ఎలాంటి పరికరాల నుంచి ఫైళ్లు బదిలీ అయ్యాయి? అవి తర్వాత ఎక్కడికి వెళ్లాయి? మెటా వ్యవస్థలకు చేరాయా? వంటి ప్రశ్నలకు సమాధానాలు దొరికితేనే ఈ ఆరోపణకు బలం వస్తుంది.
20 వేల ఫైళ్లు ఎందుకు అంత పెద్ద విషయం?
ఎందుకంటే ఇది ఒకటి రెండు సినిమాల కథ కాదు. Strike 3 ప్రకారం, ఆ ఎగ్జిక్యూటివ్ ఇంటి ఇంటర్నెట్ కనెక్షన్‌తో దాదాపు 20 వేల ఫైళ్లకు సంబంధించిన BitTorrent కార్యకలాపాలు నమోదయ్యాయి.
అందులో అడల్ట్ వీడియోలతో పాటు సినిమాలు, టీవీ షోలు, సాఫ్ట్వేర్, పుస్తకాలు వంటి అనేక రకాల కంటెంట్ ఉన్నట్లు సంస్థ ఆరోపిస్తోంది. Meta Quest VRకు సంబంధించిన అడల్ట్ టైటిళ్లు కూడా ఉన్నాయని చెబుతోంది.
అసలు డౌట్
ఇంత పెద్ద మొత్తంలో కంటెంట్‌ను ఒక వ్యక్తి తన వ్యక్తిగత వినోదం కోసం డౌన్లోడ్ చేశాడా? అన్న ప్రశ్న ఇక్కడ అందరికీ వస్తోంది.
అంటే ఆ డేటా వెనుక వేరే ఉద్దేశం ఉందా? ఇదే ఇప్పుడు కోర్టులో తేలాల్సిన అసలు విషయం.
కేసు ఏమౌతుంది
ఒకవేళ కాపీరైట్ ఉన్న వీడియోలను AI శిక్షణ కోసం సేకరించారన్న ఆరోపణకు ఆధారాలు దొరికితే, అది కేవలం మెటా కేసుగా మిగిలిపోదు. ఎందుకంటే ఇదే సమస్యను ఇప్పటికే ప్రపంచంలోని అనేక AI కంపెనీలు ఎదుర్కొంటున్నాయి. AIకి పుస్తకాలు చదివించారు. వార్తలు చూపించారు. ఫొటోలు విశ్లేషింపజేశారు. వీడియోలు చూపించారు. సంగీతం వినిపించారు. కానీ ఆ కంటెంట్ సృష్టించిన వాళ్లను ఎవరైనా “మీ కంటెంట్‌ను మా AIకి నేర్పించుకోవచ్చా?” అని? అడిగి ఫర్మిషన్ తీసుకున్నారా?.
ఈ క్రమంలో అనుమతి లేకుండా ఇంటర్నెట్లో లభించే కంటెంట్‌ను AI శిక్షణకు ఉపయోగించడం ఎంతవరకు చట్టబద్ధమన్నది ఇంకా పూర్తిగా తేలని ప్రశ్న.
రూ.3,700 కోట్ల వివాదం ఎలా వచ్చింది?
ఇప్పుడు ఈ కేసులో ఉన్న సంఖ్య చూస్తే అసలు విషయం అర్థమవుతుంది. సవరించిన దావాలో 2,973 సినిమాలు ఉన్నట్లు పేర్కొన్నారు. అమెరికా కాపీరైట్ చట్టం కింద ఉద్దేశపూర్వక కాపీరైట్ ఉల్లంఘన నిరూపితమై, ప్రతి పనికి గరిష్ఠ చట్టబద్ధ నష్టపరిహారం వర్తిస్తే మొత్తం సుమారు $446 మిలియన్లు అవుతుంది. మన రూపాయల్లో ఇది సుమారు రూ.3,700 కోట్లకు పైగా.
మెటాకు ఇప్పటికే ఎదురుదెబ్బ
ఈ కేసును ప్రారంభ దశలోనే కొట్టివేయాలని మెటా చేసిన ప్రయత్నాన్ని కాలిఫోర్నియాలోని ఫెడరల్ కోర్టు గత జూన్‌లో తిరస్కరించింది. మెటా డౌన్లోడ్ చేసిన ఫైళ్లకు సంబంధించి ఇచ్చిన వివరణ నమ్మడానికి కష్టంగా ఉందని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.
ఏదైమైనా ..
మనిషి చదువు కోవాలంటే పుస్తకం కొనాలి. సినిమా చూడాలంటే టికెట్ కొనాలి. సంగీతం వినాలంటే కొన్నిసార్లు సబ్స్క్రిప్షన్ కట్టాలి. మరి AIకి కోట్లాది కంటెంట్ ముక్కలతో శిక్షణ ఇవ్వాల్సి వస్తే ఆ కంటెంట్ సృష్టించిన వాళ్లకు ఎవరు చెల్లించాలి? అది కూడా మన లాగ పుస్తకం కొనుక్కుంటే సరిపోతుందా?








