ఆ కల ఇప్పుడు నెరవేరింది… టీటీఏ మెగా కన్వెన్షన్‌లో మీనాక్షి చౌదరి
అమెరికాలోని చార్లెట్లో జరుగుతున్న ‘తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్’ మెగా కన్వెన్షన్ 2026లో హీరోయిన్ మీనాక్షి చౌదరి పాల్గొన్నారు. తనదైన చరిష్మాతో ప్రేక్షకులను అలరించిన ఆమె, ఈ వేదికపై తన వ్యక్తిగత విషయాలను , తెలుగు సినిమా పట్ల తనకున్న అభిమానాన్ని పంచుకున్నారు.
మీనాక్షి చౌదరి ప్రసంగం…
కన్వెన్షన్ ప్రారంభంలో ప్రదర్శనలు ఇచ్చిన యువ కళాకారులను, ఈ కార్యక్రమంలో ఉన్న అద్భుతమైన ఎనర్జీని ఆమె మనస్ఫూర్తిగా అభినందించారు. టీటీఏ ఆహ్వానం పట్ల కృతజ్ఞతలు తెలిపిన మీనాక్షి, ఒకప్పుడు తాను అమెరికాలో చదువుకోవాలని కలలు కన్నానని, కానీ ఇప్పుడు సినిమా కెరీర్ ద్వారా ఇక్కడికి రావడం ఎంతో సంతోషాన్ని ఇస్తోందని పంచుకున్నారు.
తెలుగు ప్రేక్షకులు సినిమాను చాలా ప్రేమిస్తారని, వారి అభిమానం ఎంతో ప్రత్యేకం అని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి తనను ఆహ్వానించిన పైళ్ల మల్లారెడ్డి, విజయ్, ఇతర నిర్వాహకులకు ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
‘లక్కీ భాస్కర్’ సినిమాకు నేషనల్ అవార్డు రావడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన మీనాక్షి, దర్శకుడు వెంకీ అట్లూరి , టీమ్ మొత్తానికి అభినందనలు తెలిపారు. ఇదే క్రమంలో, సినిమాలోంచి ఒక డైలాగ్‌ను సరదాగా చెప్పి ప్రేక్షకులను అలరించారు.








