‘ఎ చైల్డ్ ఆఫ్ మై ఓన్’ రివ్యూ: తల్లి కావాలనే కోరిక ఓ నేరంగా మారితే?
—సూర్య ప్రకాష్ జోశ్యుల
Rating: 2.5/5
ఒక స్త్రీకి పిల్లలు కావాలనుకోవడం సహజమే. కానీ అదే కోరిక చుట్టూ కుటుంబం, భర్త, సమాజం ఒత్తిడి పెడుతూ పోతే? ‘తల్లి కాలేకపోతే నువ్వెందుకు?’ అనే మాటలు పదే పదే వినిపిస్తే? ఒకరోజు ఆ కోరికే అబద్ధానికి దారి తీస్తే? ఆ అబద్ధం చివరికి ఓ పసిబిడ్డను దొంగిలించేంత పెద్ద నేరంగా మారితే?
ఇదే షాకింగ్ నిజ జీవిత ఘటన చుట్టూ తిరిగే నెట్‌ఫ్లిక్స్ డాక్యూడ్రామా ‘ఎ చైల్డ్ ఆఫ్ మై ఓన్’. దర్శకురాలు మైటే అల్బెర్డీ ఈ కథను కేవలం క్రైమ్‌గా చూపించకుండా.. ఒక మహిళను ఆ స్థాయికి తీసుకెళ్లిన మానసిక, కుటుంబ, సామాజిక పరిస్థితులను కూడా తడిమే ప్రయత్నం చేశారు.
కథేంటి?
2009లో మెక్సికోలో 26 ఏళ్ల ఎలియోనర్ అలెజాండ్రా మారిన్ మెండోజా అలియాస్ ‘అలే’ జీవితంలో జరిగిన సంఘటన ఇది. వరుసగా గర్భస్రావాలు కావడంతో ఆమెపై కుటుంబం నుంచి పిల్లల కోసం ఒత్తిడి పెరుగుతుంది. చివరికి తాను గర్భవతి అని అందరినీ నమ్మించడానికి ప్లాన్ చేస్తుంది. బరువు పెంచుకోవడం, పొట్టను గర్భవతిలా కనిపించేలా చేయడం, వైద్య రికార్డుల్లో మార్పులు చేయడం.. ఇలా ఆమె అబద్ధం నెలల తరబడి సాగుతుంది.
కానీ బిడ్డ పుట్టాల్సిన సమయం వచ్చేసరికి ఆమె దగ్గర నిజంగా బిడ్డ లేదు. అక్కడే కథ ఒక్కసారిగా క్రైమ్ వైపు తిరుగుతుంది. ఆసుపత్రి నుంచి ఓ నవజాత శిశువును తీసుకెళ్లి తన భర్తకు ‘మన బిడ్డ’గా చూపిస్తుంది. కొద్ది గంటల్లోనే విషయం బయటపడుతుంది. ఆమె అరెస్టవుతుంది. భర్త కూడా అదుపులోకి తీసుకోబడతాడు. కానీ తర్వాత అతను బయిటపడతాడు కానీ ఆమెకు మాత్రం 13 ఏళ్ల జైలు శిక్ష పడుతుంది.
ఇక్కడి నుంచి సినిమా అసలు ఇంట్రస్టింగ్ గా మారుతుంది. ఎందుకంటే అలే చెప్పే కథకు, బిడ్డ అసలు తల్లి మైరా చెప్పే కథకు చాలా తేడా ఉంటుంది. అలే తనకు ఆ బిడ్డను ఇవ్వడానికి మైరాతో ఒప్పందం జరిగిందని చెబుతుంది. మైరా మాత్రం ఆ మాటనే ఖండిస్తుంది. తన బిడ్డను ఆసుపత్రి నుంచి దొంగిలించారని చెబుతుంది.
అంటే.. మనం ఎవరిని నమ్మాలి? అనేది చూసి తెలుసుకోవాల్సిన విషయం.
విశ్లేషణ
ఈ డాక్యుమెంటరి సినిమా బలం అంతా నేరేషన్ లోనే ఉంది. ‘ఆమె తప్పు చేసింది కాబట్టి చెడ్డది’ అని ఒక్క మాటతో కథను ముగించదు. అదే సమయంలో ‘ఆమె పరిస్థితుల వల్లే అలా చేసింది కాబట్టి పాపం’ అని కూడా సమర్థించదు.
అలే చేసినది నేరమే. కానీ ఆ నేరం వెనుక ఏం ఉంది? పిల్లలు కనలేకపోతే మహిళగా విలువ తగ్గిపోతుందనే ఆలోచన ఆమె మనసులోకి ఎలా వచ్చింది? భర్త, అత్తింటివాళ్ల మాటలు ఆమెపై ఎంత ప్రభావం చూపాయి? గర్భస్రావాల తర్వాత ఆమెకు సరైన మానసిక సహాయం ఎందుకు అందలేదు? ఇవే ప్రశ్నలను సినిమా ముందుకు తెస్తుంది.
మరీ ముఖ్యంగా.. ‘తల్లి కావడం’ అనే విషయాన్ని మహిళ జీవితానికి అంతిమ లక్ష్యంగా మార్చేసిన సమాజపు ఆలోచనను సినిమా గట్టిగా ప్రశ్నిస్తుంది. మానసిక నిపుణురాలి విశ్లేషణ ప్రకారం, అలేకు తల్లి కావడం అంటేనే ఒక మహిళగా సంపూర్ణత అనే భావన బలంగా నాటుకుపోయింది. వరుస గర్భస్రావాల బాధను ఎదుర్కోవడానికి ఆమె ఒక కల్పిత ప్రపంచాన్ని సృష్టించుకుంది. చివరికి ఆ కల్పన, వాస్తవం మధ్య గీతే చెరిగిపోయినట్టుగా సినిమా చూపిస్తుంది.
అయితే ఇక్కడ ఓ చిన్న సమస్య కూడా ఉంది. బిడ్డ అసలు తల్లి మైరా వైపు సినిమా మనం ఆశించినంత లోతుగా వెళ్లదు. అలే మానసిక స్థితిని అర్థం చేసుకోవడంపై ఎక్కువ సమయం పెడుతుంది. దాంతో నిజమైన బాధితురాలి కోణం కొంచెం వెనక్కి వెళ్లినట్టు అనిపిస్తుంది. ఇది తప్పించి మిగతా డాక్యుమెంటరీ అంతా ఓ ఎమోషన్ లో వెళ్లిపోతుంది. క్రైమ్ కన్నా ఓ భావోద్వేగాన్ని తెరపై చూసినట్లు, మనకు తెలిసి ఉన్న వాళ్ల కుటుంబంలోనే జరిగినట్లు అనిపిస్తుంది.
టెక్నికల్‌గా ఎలా ఉంది?
ఇది సాధారణ డాక్యుమెంటరీ కాదు. మొదటి భాగం దాదాపు ఫిక్షన్ సినిమా చూస్తున్న అనుభూతి ఇస్తుంది. పింక్, పసుపు, బ్లూ వంటి లేత రంగులు, సాఫ్ట్ లైటింగ్, ఫెయిరీటేల్లా కనిపించే సెట్స్.. ఇవన్నీ అలే తన జీవితాన్ని ఎలా చూసుకుందో చూపించడానికి ఉపయోగించారు.
ఇందులో అనా సెలెస్టే నటన కూడా కీలకం. ఆమె పోషించిన అలే పాత్రలో అమాయకత్వం, భయం, అబద్ధం చెప్పాల్సిన పరిస్థితి, ఆ తర్వాత పెరుగుతున్న టెన్షన్.. అన్నీ బాగా క్యారీ అవుతాయి. తర్వాత అసలు అలే తెరపైకి రావడంతో సినిమా ఒక్కసారిగా మరో మూడ్‌లోకి వెళ్లిపోతుంది.
రీక్రియేషన్ తర్వాత నిజమైన వ్యక్తుల ఇంటర్వ్యూలు, కోర్టు కేసుకు సంబంధించిన అంశాలు, పాత దృశ్యాలు, వార్తా ఫుటేజ్ కలవడంతో సినిమా ఒక ఆసక్తికరమైన హైబ్రిడ్ డాక్యుమెంటరీగా మారుతుంది. 96 నిమిషాల రన్‌టైమ్ కూడా పెద్దగా అనిపించదు.
అయితే ఇదే ప్రయోగం కొంతమందికి మైనస్‌గా కూడా అనిపించొచ్చు. మొదట డ్రామా, తర్వాత డాక్యుమెంటరీ అనే మార్పు కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది. మరికొన్ని చోట్ల కథ ఇంకాస్త కుదించి ఉంటే బాగుండేదనిపిస్తుంది.
ప్లస్‌లు
షాకింగ్ నిజ జీవిత కథ
సాధారణ క్రైమ్ డాక్యుమెంటరీలా కాకుండా కొత్తగా చెప్పిన విధానం
పింక్-టోన్ విజువల్స్, రీక్రియేషన్ సీన్స్
అసలు వ్యక్తుల ఇంటర్వ్యూలు
మైనస్‌లు
కొన్ని రీక్రియేషన్ సన్నివేశాలు కాస్త అతిగా అనిపిస్తాయి
కథ మధ్యలో డాక్యుమెంటరీ, డ్రామా మధ్య మార్పు కొంత అసహజంగా ఉంటుంది
మానసిక అంశాలను ఇంకా లోతుగా పరిశీలించి ఉంటే బాగుండేది
ఫైనల్ థాట్
‘ఎ చైల్డ్ ఆఫ్ మై ఓన్’ చూసిన తర్వాత మనం చూసింది బిడ్డను దొంగిలించిన మహిళ కథ అనిపించదు. ‘ఒక మహిళ తల్లి కావాల్సిందే’ అని సమాజం పెట్టే ఒత్తిడి ఎక్కడికి తీసుకెళ్లగలదో అనే ఆలోచనే వస్తుంది. సినిమా అలేను క్షమించమని అడగదు. ఆమె చేసిన నేరాన్ని కూడా తేలికగా తీసుకోదు. కానీ ఆమెను అర్థం చేసుకునే ప్రయత్నం మాత్రం చేస్తుంది. అదే ఈ డాక్యూడ్రామాకు ప్రత్యేకత.
అందుకే ఇది మామూలు ‘ట్రూ క్రైమ్’ కంటెంట్ కోసం చూస్తున్నవారికంటే.. నిజ జీవిత ఘటనల వెనుక ఉన్న మనస్తత్వం, కుటుంబం, సమాజం గురించి ఆలోచించే సినిమాలు నచ్చేవారికి ఎక్కువగా కనెక్ట్ అవుతుంది.
ఎక్కడ చూడచ్చు?
‘ఎ చైల్డ్ ఆఫ్ మై ఓన్’ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. రన్ టైమ్ సుమారు 1 గంట 36 నిమిషాలు.








