కన్వెన్షన్ వేదికగా ‘హలో అమ్మాయి’ మూవీ సాంగ్ ఆవిష్కరణ.. టీటీఏకు కృతజ్ఞతలు తెలిపిన చిత్రబృందం!
చార్లెట్ వేదికగా ఘనంగా జరిగిన ‘తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్’ మెగా కన్వెన్షన్ 2026లో, ‘హలో అమ్మాయి'(Hello Ammayi) సినిమాలోని ఒక ప్రత్యేక సాంగ్‌ని మూవీ యూనిట్ విడుదల చేసింది. ఈ వేడుకలో పాల్గొనడం, వేలాది తెలుగువారి సమక్షంలో పాటను ఆవిష్కరించడం తమ చిత్రబృందానికి ఎంతో గర్వకారణమని చిత్ర నిర్మాత లక్ష్మణ్ అనుగు తెలిపారు. ఈ అద్భుతమైన అవకాశం కల్పించిన టీటీఏ సంస్థకు, ముఖ్యంగా డాక్టర్ పైళ్ల మల్లారెడ్డి గారికి, టీటీఏ బృందానికి ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ చిత్రం ద్వారా తన పెద్ద కుమారుడు అమిత్ అనుగు హీరోగా పరిచయం కావడం తన కుటుంబానికి ఎంతో ఆనందాన్ని ఇస్తోందని ఆయన పేర్కొన్నారు. హీరోయిన్ దివి వైద్యతో కలిసి అమిత్ చేసిన ఈ పాట, యువతను ఎంతగానో ఆకట్టుకుంటుందని చిత్రబృందం తెలిపింది. ఈ ప్రాజెక్ట్‌ను అద్భుతంగా రూపొందించిన సత్య మాస్టర్ (కాన్సెప్ట్, దర్శకత్వం, కొరియోగ్రఫీ), సంగీత దర్శకులు అరుణ్ చిలువేరు, సింగర్ దీపు, లిరిసిస్ట్ సురేష్ బనిశెట్టిలకు లక్ష్మణ్ అనుగు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ప్రస్తుతం ‘మధుర ఆడియో ఒరిజినల్స్’ ద్వారా విడుదలైన ఈ పాటను ప్రేక్షకులు ఆశీర్వదించాలని ఆయన కోరారు. టీటీఏ కన్వెన్షన్ వంటి గొప్ప వేదికపై తమ సినిమా ప్రయాణం మొదలవ్వడం ఎంతో ఉత్సాహాన్నిచ్చిందని మూవీ యూనిట్ తెలిపింది.








