కొండా సురేఖకు అలా ‘చెక్’ పెట్టబోతున్నారా?
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖ వ్యవహారం అత్యంత ఆసక్తికరమైన మలుపు తిరిగింది. సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ అధిష్టానంతో కొండా ఫ్యామిలీ వైరం తారస్థాయికి చేరిన వేళ.. ఆమెను నేరుగా పదవి నుంచి తప్పించకుండానే, మంత్రిత్వ శాఖలో ఉన్న అధికారాలన్నింటికీ కత్తెర వేసే సరికొత్త ఆపరేషన్ మొదలైంది. ప్రత్యక్షంగా వేటు వేస్తే వచ్చే రాజకీయ నష్టాన్ని నివారిస్తూ, పరిపాలనాపరంగా ఉక్కిరిబిక్కిరి చేసి ఆమే స్వయంగా తప్పుకునేలా లేదా దిగివచ్చేలా చేయడమే ఈ వ్యూహం వెనుక ఉన్న అసలు లక్ష్యంగా కనిపిస్తోంది.
పర్యావరణ, అటవీ శాఖ మంత్రిగా ఉన్న కొండా సురేఖకు తాజాగా ప్రభుత్వం ఊహించని షాక్ ఇచ్చింది. మంత్రికి ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే, ఆమె తనకు అనుకూలంగా నియమించుకున్న దాదాపు 20 మందికి పైగా అధికారుల డిప్యూటేషన్లను ప్రభుత్వం రద్దు చేసింది. ఇందులో కీలకమైన ఐఎఫ్ఎస్ అధికారులతో పాటు ఇతర ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. వీరిని తక్షణమే మాతృశాఖలకు పంపించడంతో పాటు, సచివాలయం, క్షేత్రస్థాయి యంత్రాంగానికి బలమైన సంకేతాలు వెళ్లాయి. ఉన్నతాధికారులు ఇకపై మంత్రి నిర్ణయాల కంటే సీఎంఓ ఆదేశాలకే ప్రాధాన్యత ఇవ్వాలనే పరిస్థితిని తీసుకురావడం ద్వారా శాఖాపరంగా ఆమెను పూర్తిగా డమ్మీ చేసేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కొండా సురేఖ కుటుంబం బహిరంగంగా విమర్శలు గుప్పించిన తర్వాత, ఆమెపై వెంటనే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటారని అంతా భావించారు. అయితే, ఆమెను నేరుగా మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేస్తే ఒక బలమైన బీసీ మహిళా నేతపై కాంగ్రెస్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందనే సామాజిక ముద్ర పడే ప్రమాదం ఉంది. ఈ ‘బీసీ సెంటిమెంట్’ రాజకీయంగా బూమరాంగ్ కాకుండా ఉండటానికే అధిష్టానం తాత్కాలికంగా ఈ పరోక్ష వ్యూహాన్ని ఎంచుకున్నట్టు సమాచారం.
నేరుగా వేటు వేయకుండా అధికారాలను నియంత్రించడం ద్వారా.. మంత్రిగా ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోలేరు. పరిపాలనాపరంగా, రాజకీయంగా పార్టీలో ఆమె ఒంటరి అవుతుంది. స్వయంగా రాజీనామా చేసేలా మానసిక ఒత్తిడి పెంచడం లేదా అధిష్టానం వద్దకు వచ్చి రాజీపడేలా చేయడం దీని వెనుక వ్యూహంగా ఉంది.
మరోవైపు, కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ సెటిల్మెంట్ల వ్యవహారం చుట్టూ చట్టపరమైన ఉచ్చు బిగుస్తోంది. పాత ఆరోపణలు, సెటిల్మెంట్లపై పోలీసులు విచారణను ఒక్కసారిగా వేగవంతం చేశారు. గత కేసులను బయటకు తీసి దర్యాప్తు చేయడం వెనుక పక్కా వ్యూహం కనిపిస్తోంది. దీనివల్ల కొండా కుటుంబం కేవలం రాజకీయంగానే కాకుండా, చట్టపరమైన అంశాల్లోనూ పూర్తిగా డిఫెన్స్‌లో పడిపోతుంది. అవినీతి, అక్రమాల ఆరోపణల చుట్టూ చర్చను తిప్పడం ద్వారా కొండా సురేఖ సామాజిక కోణాన్ని లేదా ‘బీసీ కార్డు’ను రాజకీయ రక్షణ కవచంగా వాడుకునే అవకాశాన్ని ప్రభుత్వం సమర్థవంతంగా మూసివేసింది.
ఏ రాజకీయ నాయకుడికైనా అధికారాలు లేని మంత్రి పదవిలో కొనసాగడం చిరాకు తెప్పిస్తుంది. చేతులు కాలకుండా ఆకులు పట్టుకునే చందంగా కాంగ్రెస్ నాయకత్వం వేసిన ఈ ఎత్తుగడ కొండా సురేఖను పూర్తి ఆత్మరక్షణలోకి నెట్టింది. అధికారం లేని శాఖను మోస్తూ ఉత్సవ విగ్రహంలా ఉండటమా? లేక పంతం వీడి సీఎం, అధిష్టానం ముందు లొంగిపోవడమా? అన్నది తేల్చుకోవాల్సిన సంకట స్థితిలో కొండా దంపతులు పడ్డారు. పరిపాలనాపరంగా హక్కులను గుల్ల చేస్తూ రాజకీయ పట్టు బిగించే ఈ వ్యూహం తెలంగాణ కాంగ్రెస్‌లో కొండా సురేఖ రాజకీయ భవితవ్యాన్ని ఏ తీరానికి చేరుస్తుందో వేచి చూడాలి.








