ఫాలో ఆన్ దిశగా లంక.. భారీ ఆధిక్యం దిశగా టీం ఇండియా..!
శ్రీలంకతో కొలంబో వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్, తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 503 పరుగుల భారీ స్కోరు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. యువ బ్యాటర్లు దేవదత్ పడిక్కల్ (117), ధ్రువ్ జురెల్(Dhruv Jurel) (నాటౌట్ 115) అద్భుత శతకాలతో కదం తొక్కగా, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ హాఫ్ సెంచరీతో, రిషబ్ పంత్(Rishab Pant) 63 పరుగులతో రాణించారు. జురెల్ తన సెంచరీని సైనికుడైన తండ్రికి, రైతు అయిన తాతకు అంకితం ఇస్తూ చేసిన ‘జై జవాన్ జై కిసాన్’ టాటూ వేడుక అభిమానుల హృదయాలను గెలుచుకుంది.
భారీ స్కోరు నమోదయ్యాక, రెండో రోజు ఆట ముగిసే సమయానికే లంకను 8 పరుగులకే 2 వికెట్లు తీసి దెబ్బకొట్టిన టీమిండియా.. మూడో రోజు ఉదయం కూడా అదే జోరును కొనసాగిస్తోంది. మూడో రోజు ఆట ప్రారంభమైన కొద్దిసేపటికే భారత పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ లంక బ్యాటర్ కమిల్ మిషారా (19) వికెట్ పడగొట్టి గట్టి షాక్ ఇచ్చాడు. షార్ట్ డెలివరీతో గందరగోళానికి గురైన మిషారా ఇచ్చిన క్యాచ్‌ను వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ అద్భుతంగా అందుకున్నాడు. దీంతో శ్రీలంక 35 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
ప్రస్తుతం క్రీజులో పసిందు సూరియబండార, కమిందు మెండీస్ జోడి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేస్తోంది. స్పిన్నర్ సరాంశ్ జైన్ బౌలింగ్‌ను టార్గెట్ చేస్తూ లంక బ్యాటర్లు కొన్ని బౌండరీలు రాబడుతున్నప్పటికీ, భారత బౌలర్లు పూర్తి పట్టు బిగిస్తున్నారు. గత మ్యాచ్‌లో 10 వికెట్లతో చెలరేగిన స్టార్ స్పిన్నర్ మానవ్ సుతార్‌ను కెప్టెన్ గిల్ ఇంకా రంగంలోకి దించాల్సి ఉంది. లంకను వీలైనంత త్వరగా ఆలౌట్ చేసి ఫాలో-ఆన్ ఆడించాలని భారత్ భావిస్తోంది. మరోవైపు, తొలిరోజు మైదానంలో గొడవకు దిగిన భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్, లంక బౌలర్ అసిథ ఫెర్నాండోలపై ఐసీసీ మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా విధించి డెమిరిట్ పాయింట్లు ఇచ్చింది.








