అమరావతిలో క్లీన్ ఎనర్జీ విప్లవం, సర్కార్ కీలక నిర్ణయం..!
ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతం అమరావతిని పర్యావరణహిత నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఏపీ సీఆర్డీఏ (APCRDA) సరికొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. అమరావతి పరిధిలోని ఏడు వ్యూహాత్మక ప్రాంతాలలో మల్టీ-ఫ్యూయల్ ‘ఎనర్జీ స్టేషన్ల’ ఏర్పాటుకు సీఆర్డీఏ టెండర్లను ఆహ్వానించింది. భవిష్యత్తు అవసరాలను, పెరుగుతున్న వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ భారీ గ్రీన్ ఎనర్జీ మౌలిక వసతుల కల్పనకు అధికారులు వేగంగా అడుగులు వేస్తున్నారు.
ఈ ప్రతిష్టాత్మక ఎనర్జీ స్టేషన్ల నిర్మాణానికి గానూ రాజధాని ప్రాంతంలో మొత్తం 18.25 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. రాజధానిలోని ప్రధాన గ్రామాలైన అనంతవరం, కురగల్లు, నేలపాడు, మరియు వెలగపూడి పరిసర ప్రాంతాలలో ఈ ఎనర్జీ స్టేషన్లను నెలకొల్పనున్నారు. ప్రయాణికులకు అత్యంత సులువుగా అందుబాటులో ఉండేలా, ప్రధాన రహదారులకు సమీపంలోనే ఈ స్థలాలను ఎంపిక చేయడం విశేషం.
ఈ సరికొత్త ఎనర్జీ స్టేషన్ల ప్రత్యేకత ఏంటంటే.. ఇవి కేవలం సంప్రదాయ ఇంధన కేంద్రాలుగా మాత్రమే కాకుండా, అన్ని రకాల ఇంధనాలు ఒకే చోట లభించేలా వన్-స్టాప్ హబ్‌లుగా పనిచేస్తాయి. ఈ కేంద్రాలలో సాధారణ పెట్రోల్, డీజిల్‌తో పాటు పర్యావరణ అనుకూల సీఎన్జీ (CNG) ఇంధనం లభిస్తుంది. వీటన్నింటికీ మించి భవిష్యత్తు రవాణా సాధనాలైన ఎలక్ట్రిక్ వాహనాల (EV) కోసం అత్యాధునిక ఈవీ ఛార్జింగ్ సదుపాయాన్ని కూడా ఇక్కడ అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా రాజధాని అమరావతిలో ఎకో-ఫ్రెండ్లీ రవాణా వ్యవస్థ మరింత బలోపేతం కానుంది.








