మైండ్ బ్లోయింగ్ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్..’ఫైట్ మహా’
తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ : 2.75/5
నిర్మాణ సంస్థ – న్యూ ఐ మూవీస్ ఎల్ఎల్పీ
నటీనటులు – సునీల్, అఖిల్ ఉడ్డెమారి, డా. శ్రీవాణి గోపిచంద్, వైష్ణవి, సిద్ధార్థ్, శ్రీకాంత్ అయ్యంగార్, సమీర్, దీపక్ కేశవ్, కృష్ణంరాజు (జోగి బ్రదర్స్), జబర్దస్త్ శాంతి కుమార్, ఆయేషా, హరీష్, పూర్ణ శ్రీ, మాస్టర్ రోహన్, మాస్టర్ జొన్న, హేమంత్ బాలాజీ, పద్మ వెంకట్, కందకట్ల, లక్ష్మి, సుమ రెడ్డి, నాగురిశ్లోకం, అభ భాయి జి. కల్యాణ్, మహేంద్రనాథ్, శ్రీ, పి.రామచంద్ర రాజు, ఏవీఎస్ రాజు, రోహిత్ కన్న, మధు యాదవ్, దాసరి శ్రుతి, అర్జున్, ఎం సీతరామశాస్త్రి, భవానీ శంకర్, మంజుల రాథోడ్, తదితరులు…
సినిమాటోగ్రఫీ – నాని ఐయివెల్లి, ఎడిటర్ – ఆనంద్ పవన్
ప్రొడక్షన్ డిజైనర్ – దేవర మధుకర్, సంగీతం – వసంత్ ఇసైపెట్టై
పాటలు – శ్రీరామ్ తపస్వి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – నరేంద్ర చారి
CEO – శ్రీనివాస్ నల్లగంట్ల, రోహిణి స్టూడియోస్
ప్రొడ్యూసర్స్ – ఏవీఎస్ రాజు, ఆర్ కుమార్ రాజు, ఆనంద్ చంద్ర
స్క్రిప్ట్, డైరెక్షన్ – ఆనంద్ చంద్ర
విడుదల తేది : 21.08.2026
నిడివి : 1 ఘంట 57 నిముషాలు
సునీల్, ‘రాజు వెడ్స్ రాంబాయి’ ఫేం అఖిల్ ఉడ్డెమారి, డా. శ్రీవాణి గోపిచంద్, వైష్ణవి, సిద్ధార్థ్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రల్లో నటించిన సినిమా “ఫైట్ మహా”. ‘కలలు నిజమైతే నిజం ఎవరిది’ అనేది ఈ చిత్ర ట్యాగ్ లైన్. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిర్మించిన నిజజీవిత కథ ‘మర్డర్’ చిత్ర దర్శకుడు ఆనంద్ చంద్ర ఈ చిత్రాన్ని సైకలాజికల్ థ్రిల్లర్ గా మలిచాడు. న్యూ ఐ మూవీస్ ఎల్ ఎల్ పీ బ్యానర్ పై ఏవీఎస్ రాజు, ఆర్ కుమార్ రాజు, ఆనంద్ చంద్ర నిర్మించిన ఈ చిత్రం ఆగస్ట్ 21న ధియేటర్ లలో విడుదల అయ్యింది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకుందో సమీక్షలో చూద్దాం.
కథ :
విశాఖపట్నానికి చెందిన మహా (అఖిల్ ఉడ్డెమారి) ఒక సాధారణ యువకుడు. అతని తల్లి పాఠశాల ఉపాధ్యాయురాలు. చెల్లెలు ఇంటర్ చదువుతోంది. బీటెక్ పూర్తి చేసిన మహాకు అతని మనసంతా కళపైనే ఉంటుంది. ప్రపంచంలోనే గొప్ప ఆర్టిస్ట్ కావాలన్నది అతని కల. కానీ అతని తల్లి మాత్రం అందుకు ఒప్పుకోదు. ‘‘చిత్రాలు గీసుకుంటూ జీవితంలో ఎలా స్థిరపడతావు? మంచి ఉద్యోగం చేసుకుని భవిష్యత్తును నిర్మించుకో’’ అంటూ అతన్ని వారిస్తుంది. తల్లి మాట వినని మహా, హైదరాబాద్‌లో ఉద్యోగం వచ్చిందని అబద్ధం చెప్పి తన కళను నమ్ముకుని జీవితాన్ని నిర్మించుకోవాలనే లక్ష్యంతో హైదరాబాద్ చేరుకుంటాడు. అక్కడ ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న మహాకు పోలీస్ డిపార్ట్మెంట్లో స్కెచ్ ఆర్టిస్ట్‌గా పనిచేసే అవకాశం వస్తుంది. అతని పరిశీలనా శక్తి, మనుషుల ముఖాలను అచ్చుగుద్దినట్టు చిత్రీకరించే ప్రతిభతో పాటు తాను గమనించిన చిన్నచిన్న విషయాల ఆధారంగా పోలీసులకు కీలకమైన క్లూలను కూడా అందిస్తుంటాడు. అయితే అతని జీవితాన్నివేదిస్తున్న పెద్ద సమస్య స్లీపింగ్ డిజర్దర్… నిద్రలో నడక… భయంకరమైన కలలు…తన బాల్యం, చనిపోయిన తండ్రి(సునీల్)కలలో కనిపించడం, ఉదయం లేచేసరికి తాను ఎక్కడున్నాడో తెలియని పరిస్థితి! ఒకచోట నిద్రపోయి మరోచోట మేల్కొనడం మహాకు నిత్యకృత్యంగా మారుతుంది. తాను నియంత్రించుకోలేకపోతున్న మహా, చివరకు ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ గుప్తా(శ్రీ కాంత్ అయ్యంగార్)ను కలుస్తాడు. ప్రశాంత జీవనానికి కేరళకు చెందినా యోగా టీచర్ అమీనాను (డా. శ్రీవాణి గోపిచంద్) ఇష్టపడతాడు.
ఇలాంటి సమయంలో మహా జీవితంలోకి అనుకోకుండా అతని కాలేజీ మాజీ ప్రేయసి జెస్సికా (వైష్ణవి) కనపడుతుంది.. డబ్బుకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే ఆ అమ్మాయి, మహా నివసిస్తున్న హైదరాబాద్ అపార్ట్మెంట్ పక్కనే ఉండటం అతనికి మరింత మానసిక ఒత్తిడిని కలిగిస్తుంది. మాజీ ప్రేయసి ప్రతిరోజూ ఎదురుపడటం అతని మానసిక ప్రశాంతతను మరింత దెబ్బతీస్తుంది. ఒక రాత్రి…మాజీ ప్రేయసి జెస్సికాని హత్య చేసినట్లు మహాకు ఒక భయంకరమైన కల వస్తుంది. భయంతో ఉలిక్కిపడి నిద్రలేచిన మహాకు మరో షాక్ ఎదురవుతుంది. అతను తన ఇంట్లో లేడు! అతను తన మాజీ ప్రేయసి ఇంట్లో ఉన్నాడు. అంతేకాదు… ఆమె నిజంగానే చనిపోయి ఉంది! మహా గుండె ఆగినంత పనవుతుంది. ‘‘నేను నిద్రలో ఆమె ఇంటికి వచ్చానా? అయితే… ఈ హత్య చేసింది నేనేనా?’’ అనే భయంకరమైన ప్రశ్న అతని మెదడును తొలిచేస్తుంది. నిజంగా ఆ హత్య చేసింది మహానేనా? హత్య నేరాన్ని మహా పై రుద్ధ దానికి అజ్ఞాత వ్యక్తి ఎవరైనా వున్నారా? మహా కలల్లో అతని చనిపోయిన తండ్రి ఎందుకు కనిపిస్తుంటాడు? తండ్రి మరణానికి… అతని స్లీప్‌వాకింగ్ డిజార్డర్‌కు ఏమైనా సంబంధం ఉందా? యోగా టీచర్ అమీనా మహా ను ఎందుకు దూరం పెడుతుంది? లాంటి సమాధానలే మిగతా కథ.
నటీ నటుల హవబవాలు :
హీరోగా నటించిన అఖిల్ ఉడ్డెమారి తనకు రెండవ చిత్రమైనా…ఎంతో అనుభవం వున్నానటుడిగా ఆద్యంతం అలరించాడు. హీరోగా అతడు చూపించిన పరిణతి తెలుగు ఇండస్ట్రీకి ఒక మంచి యంగ్ లీడ్ దొరికాడనే నమ్మకాన్ని ఇస్తుంది. అక్కడక్కడ చలాకి కుర్రాడిగా హీరో నాని లా కనిపించాడు. ‘మహా’ బాల్యం లో తండ్రిగా నటించిన సునీల్ తన పాత్రలో డిఫరెంట్ షేడ్స్ కనపర్చాడు. చిత్రకారుడిగా ప్రపంచంలో నేనే నెంబర్ వన్ ఆర్టిస్ట్ గా పేరొందాలనే కసి, క్రూరత్వం, గెలుపు కోసం తపించే ఆరాటం సునీల్ కళ్లలో స్పష్టంగా కనపర్చాడు. హీరోయిన్ డా.శ్రీవాణి గోపిచంద్, మాజీ ప్రేయసి వైష్ణవి, సిద్ధార్థ్, శ్రీకాంత్ అయ్యంగార్, కృష్ణంరాజు (జోగి బ్రదర్స్) సమీర్, తమ పాత్రల మేరకు నటించారు.
సాంకేతికవర్గం పనితీరు :
డైరెక్టర్ ఆనంద్ చంద్ర టేకింగ్ లో మరో ఆర్జివి కనిపించాడు, కంటెంట్ ని ఎక్కడా అనవసరంగా లాగకుండా, ప్రతి సీన్ ని ఒక పాయింట్ తో ఎండ్ చేయకుండా తరువాత ఏంటి? అనే ఉత్కంతకు లోనయ్యేలా స్క్రీన్ ప్లే అధ్బుతంగా రాసుకున్నాడు. అతను గతంలో తీసిన మర్డర్ నిజ జీవిత కథ, కాని ఈ సినిమా కల్పిత కథ, కాని ఎవరి జేవితం లోనో ఈ విధంగా జరిగినట్లుగా చూపించడం అతి సహజంగా వుంటుంది.కథలో సస్పెన్స్, విజువల్స్, ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్, దానికి తోడు మైండ్ లో నిలిచిపోయే సౌండ్ ట్రాక్.. అన్నీ పర్ఫెక్ట్ గా కుదిరాయి. దర్శకుడికి ఒక ప్రొఫెషనల్ విస్పష్టత ఉంది. వసంత్ ఇసైపెట్టై పాటలు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు పెద్ద అసెట్, సినిమాటోగ్రాఫర్ నాని ఐయివెల్లి విజువల్స్ ఈ సినిమాకు ప్రాణం పోశాయి. నిడివి ఎంత ఉండాలో అంత ఉంది, ఎడిటింగ్ బాగుంది. సినిమాకు తగినట్టుగా నిర్మాణ విలువలు బాగున్నాయి.
విశ్లేషణ :
సినిమాలో ఏ ఒక్క సీన్ తీయడానికి అవకాశం లేకుండా ఎలాంటి జర్క్‌లు, జుంపింగ్ లు లేకుండా ఎంతో ఆసక్తి గా తరవాత సీన్ కోసం ఎదురు చూసేలా ఒక సరికొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేసింది. రెండు ఘంటల పాటు మైండ్ బ్లాక్ అయ్యే సైకలాజికల్ క్రైమ్ డ్రామాను అందించడంలో దర్శకుడు వంద శాతం సక్సెస్ అయ్యాడు. ఇలాంటి క్రైమ్ డ్రామాను నడిపించడం కత్తిమీద సాము. కానీ ఆ రిస్క్ ని అత్యంత ప్రతిభావంతంగా చేసి చూపించింది ఫైట్ మహా టీమ్. సీట్ ఎడ్జ్ లో కూర్చోబెట్టే పేసింగ్ తో ఫైట్ మహా గట్టిగానే కొట్టింది. తెలుగు సినిమా కంటెంట్ గ్రాఫ్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లే ప్రయత్నం ఈ చిత్రం అవుతుంది. 1 ఘంట 57నిమిషాల నిడివితో సాగే ఈ చిత్రం మిమ్మల్ని బిగ్ స్క్రీన్ కు హుక్ చేసి పడేస్తుంది అనడంలో సందేహం లేదు.








