న్యూయార్క్ అటార్నీ జనరల్ రేసులో కొమటిరెడ్డి సరిత.. ఎవరు ఈ అమ్మాయి
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ఒక మహిళా న్యాయవాదిని ప్రశంసించడంతో ఆమె ఎవరా అని అందరూ ఆరా తీస్తున్నారు. ఆమె ఎవరో కాదు, మన తెలుగు రాష్ట్రానికి చెందిన కొమటిరెడ్డి సరిత. వచ్చే నవంబర్‌లో జరగనున్న న్యూయార్క్ అటార్నీ జనరల్ పదవికి రిపబ్లికన్ పార్టీ తరఫున సరిత నామినేషన్ పొందారు. ఈ సందర్భంగా రిపబ్లికన్ పార్టీ అధినేత డొనాల్డ్ ట్రంప్ ఆమెకు బహిరంగంగా తన మద్దతు ప్రకటించారు. సరిత తల్లిదండ్రులది తెలంగాణ కాగా, తండ్రి డాక్టర్ హనుమంత్ రెడ్డి కార్డియాలజిస్ట్, తల్లి డాక్టర్ గీతా రెడ్డి రుమాటాలజిస్ట్. 1980లలో వీరు అమెరికాకు వలస వెళ్లారు.
బ్రూక్లిన్‌లో జన్మించిన సరిత, మిస్సోరిలో పెరిగారు. హార్వర్డ్ కాలేజ్ అండ్ లా స్కూల్ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా అందుకున్నారు. యూఎస్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్‌లో క్లర్క్‌గా కెరీర్ ప్రారంభించి, కొంబియా లా స్కూల్లో లెక్చరర్‌గా, ఆపై ఫెడరల్ ప్రాసిక్యూటర్‌గా పనిచేశారు. ఉగ్రవాదం, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, సైబర్ నేరాలు, మనీలాండరింగ్, మోసాలు, విదేశీ ప్రభుత్వాల అవినీతి వంటి అనేక సంచలన కేసులను ఆమె విచారించారు. ‘డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ అడ్మినిస్ట్రేషన్’ (డీఈఏ)కు చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా కూడా సేవలందించారు. ప్రస్తుతం ‘హోల్డ్మన్ వోగెల్’ న్యాయ సంస్థలో భాగస్వామిగా ఉన్న సరిత.. రిపబ్లికన్ పార్టీ తరఫున అటార్నీ జనరల్ పదవికి నామినేషన్ పొందిన తొలి తెలుగు మహిళగా అరుదైన రికార్డు సృష్టించారు.








