రాముడు ఇండియాలో కాదు.. చైనాలో గెలవాలి! –రామాయణం’ అసలు టార్గెట్ ఇదేనా?
— సూర్య ప్రకాష్ జోశ్యుల
రాముడు ఎవరో మనకు తెలుసు. రావణుడు ఎవరో తెలుసు. సీత కథ తెలుసు. హనుమంతుడి భక్తి తెలుసు. ఏం జరుగుతుందో తెలుసు. అంటే ‘రామాయణం’ కథలో మనకు తెలియని పాత్రలు, మలుపులు పెద్దగా ఏమీ లేవు. అయినా ఇప్పుడు అదే కథను రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యష్ రావణుడిగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా తీసుకొస్తున్నారు. దర్శకుడు నితేశ్ తివారీ. సంగీతానికి ఏ.ఆర్. రెహమాన్, హాన్స్ జిమ్మర్ వంటి పేర్లు. పైగా రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్‌కి ఏకంగా దాదాపు నాలుగు వేల కోట్ల పెట్టుబడి పెడుతున్నారు. మరి రికవరీ ఎలా?
ఇంత భారీ సినిమా అంటే మనకు మొదట గుర్తొచ్చేది ఇండియన్ బాక్సాఫీస్. కానీ ‘రామాయణం’భాక్సాఫీస్ ప్లానింగ్, లెక్కలు చూస్తే ఒక ఆసక్తికరమైన విషయం కనిపిస్తోంది. ఈసారి రాముడి ప్రయాణం అయోధ్య నుంచి లంక వరకు మాత్రమే కాదు.. చైనా వరకు వెళ్లబోతోంది.
చైనా ఎందుకు ఇంత కీలకం?
‘రామాయణం’ను చైనాలో కూడా భారీగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అక్కడి ప్రేక్షకుల కోసం సినిమాను ప్రత్యేకంగా మార్కెట్ చేయబోతున్నారు. సాధారణంగా ఒక భారతీయ సినిమా విదేశాల్లో విడుదలైతే ముందుగా అమెరికా, కెనడా, బ్రిటన్, ఆస్ట్రేలియా, గల్ఫ్ దేశాలు గుర్తుకొస్తాయి. కానీ ఈసారి చైనా పేరు ప్రత్యేకంగా వినిపిస్తోంది. ఎందుకంటే ప్రపంచ సినిమా బిజినెస్ లెక్కలు మారిపోయాయి.
ఒకప్పుడు భారతీయ నిర్మాతకు సినిమా అంటే ముందుగా ఇండియా. తర్వాత ఓవర్సీస్. ముఖ్యంగా అమెరికా, గల్ఫ్, యూరప్‌లో ఉన్న భారతీయ ప్రేక్షకులు. కానీ ఇప్పుడు కొంతమంది భారతీయ దర్శక నిర్మాతల ఆలోచనలో మరో పెద్ద మార్కెట్ కనిపిస్తోంది. అదే చైనా.
ఒక సినిమా అక్కడి ప్రేక్షకుడికి కనెక్ట్ అయితే.. ఒక్కసారిగా వందల కోట్ల రూపాయల ఎగస్ట్రా బిజినెస్ తలుపులు తెరుచుకోవచ్చు. ముఖ్యంగా భారీ బడ్జెట్ సినిమాలకు ఇది చాలా కీలకం. ఎందుకంటే భారతదేశంలోనే మొత్తం పెట్టుబడిని రికవర్ చేయాల్సిన అవసరం లేకుండా.. ప్రపంచంలోని పెద్ద మార్కెట్ల నుంచి డబ్బును తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఇదే ‘రామాయణం’ విషయంలో ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
రూ.4,000 కోట్ల లెక్కల్లో చైనా!
రెండు పార్ట్ లకు కలిపి సుమారు $500 మిలియన్ల వరకు ఖర్చు కావచ్చని నిర్మాత నామిత్ మల్హోత్రా గతంలో చెప్పారు. భారత కరెన్సీలో ఇది రూ.4,000 కోట్లకు పైగా ఉండే స్థాయి. అయితే ఈ మొత్తం తుది నిర్మాణ వ్యయమా, లేక ప్రపంచవ్యాప్త నిర్మాణం, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్ వంటి విస్తృత ఖర్చులను కలుపుతుందా అన్న విషయంలో జాగ్రత్తగా చూడాల్సి ఉంటుంది. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా ఉంది. ఇది సాధారణ భారతీయ సినిమా బడ్జెట్ కాదు.
అలాంటి సినిమాకు ఇండియా ఒక్కటే సరిపోదు. ప్రపంచంలోని పెద్ద మార్కెట్లు కావాలి. అందులో చైనా కూడా ఒక కీలకమైన పజిల్‌గా కనిపిస్తోంది.
‘దంగల్’ చూపించిన దారి!
ఇక్కడే నితేశ్ తివారీ పేరు మరోసారి ఆసక్తిని పెంచుతోంది. ఎందుకంటే చైనా మార్కెట్లో ఆయనకు ఇప్పటికే ఒక చరిత్ర ఉంది. అదే ‘దంగల్’.
అమీర్ ఖాన్ నటించిన ఆ సినిమా భారతదేశంలో భారీ విజయం సాధించింది. కానీ చైనాలో దానికి వచ్చిన స్పందన భారతీయ సినిమా బిజినెస్‌నే ఆశ్చర్యపరిచింది. ఒక భారతీయ కథ, భారతీయ నటీనటులు, భారతీయ భావోద్వేగాలు.. చైనా ప్రేక్షకులను కూడా ఇంత పెద్ద స్థాయిలో ఆకట్టుకోగలవని ‘దంగల్’ నిరూపించింది.
ఇప్పుడు అదే దర్శకుడు.. మరింత పెద్ద బడ్జెట్‌తో.. మరింత పెద్ద విజువల్ స్కేల్‌తో.. భారతీయులందరికీ తెలిసిన ఒక ఇతిహాసాన్ని చైనాకు తీసుకెళ్తున్నారు.
ఇది యాదృచ్ఛికమా?
లేక ‘దంగల్’ తర్వాత నితేశ్ తివారీకి చైనా మార్కెట్ మీద ఉన్న నమ్మకమే ‘రామాయణం’లో కూడా ఒక కీలక అంశమా?
ఈ ప్రశ్నకు మరో ఉదాహరణ కూడా ఉంది.
ఆ మధ్యన విజయ్ సేతుపతి నటించిన ‘మహారాజా’ చైనాలో అనూహ్యమైన స్పందన అందుకుంది. మన దేశంలో ఇప్పటికే విడుదలైన సినిమా మరో దేశంలో కొత్త ప్రేక్షకులను సంపాదించి పెద్ద స్థాయిలో డబ్బు చేయగలదని అది మరోసారి చూపించింది. ఒక భారతీయ సినిమా చైనాలో పని చేయాలంటే తప్పనిసరిగా అక్కడి కోసం కొత్త కథ రాయాల్సిన అవసరం లేదని కూడా ‘మహారాజా’ వంటి సినిమాలు సూచించాయి.
ఎమోషన్‌కు పాస్‌పోర్ట్ ఉండదు.
భారతీయ కథలోని ఎమోషన్ యూనివర్సల్‌గా కనెక్ట్ అయితే.. భాష, దేశం, సంస్కృతి వంటి భాక్సాఫీస్ గోడలు కొంతవరకు కూలిపోవచ్చు. ఇదే ‘రామాయణం’కు ఉన్న అతిపెద్ద అవకాశం. అయితే ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న కూడా ఉంది.
చైనీస్ ప్రేక్షకులు రామాయణాన్ని ఎంతవరకు స్వీకరిస్తారు?
మనకు ఈ కథ వేల సంవత్సరాలుగా తెలిసినది. రాముడు, సీత, రావణుడు అనే పాత్రలకు మన మనసుల్లోనే ఒక స్థిరమైన రూపం ఉంది. కానీ చైనాలోని ఒక సాధారణ ప్రేక్షకుడికి ఈ కథ అంతగా పరిచయం ఉండకపోవచ్చు. అక్కడే సినిమా మేకింగ్ కీలకం అవుతుంది.
వాళ్లకు రామాయణం గురించి ఉపన్యాసం ఇవ్వడం కాదు. ఒక మనిషి కథగా చూపించాలి. ఒక భర్త తన భార్యను కోల్పోయి ఆమె కోసం చేసే ప్రయాణం. ఒక కుటుంబం ఎదుర్కొనే విరహం. ఒక తండ్రి–కొడుకు బంధం. ఒక స్నేహితుడి కోసం చేసే త్యాగం. అధికారం కోసం జరిగే పోరాటం. ఇలాంటి భావోద్వేగాలు లేని దేశం ఉండదు.
అదే ‘దంగల్’ విషయంలోనూ కూడా జరిగింది. కథ భారతీయ కుటుంబం చుట్టూ తిరిగినా.. తండ్రి తన పిల్లల కోసం పడే కష్టం అనే భావన ప్రపంచవ్యాప్తంగా అర్థమైంది. ‘రామాయణం’ కూడా అదే పని చేయగలిగితే.. చైనాలో సినిమా వర్కవుట్ అయ్యే అవకాశం పెరుగుతుంది. ఇదే ఈ సినిమా అసలు సృజనాత్మక పరీక్ష.
తెలిసిన కథలో కొత్తదనం ఎక్కడ?
కథను మార్చకుండా.. కథ చెప్పే విధానాన్ని మార్చాలి. పాత్రలకు మరింత మానవీయ కోణం ఇవ్వాలి. రాముడిని కేవలం దేవుడిగా కాకుండా ఒక భర్తగా, కొడుకుగా, రాజుగా ప్రేక్షకుడికి అనిపించాలి. సీతను కేవలం రాముడి భార్యగా కాకుండా తనదైన భావోద్వేగం, నిర్ణయాలు ఉన్న పాత్రగా చూపించాలి. రావణుడిని కేవలం విలన్‌గా కాకుండా అతని మేధస్సు, అహంకారం, సామ్రాజ్య దృష్టి, అంతర్గత సంఘర్షణలతో చూపించాల్సి ఉంటుంది. క్కడే చైనా ప్రేక్షకుడితో కనెక్షన్ ఏర్పడుతుందా లేదా అన్నది తేలుతుంది.
అసలు బలం.. నామిత్ మల్హోత్రా!
ఈ మొత్తం గేమ్‌లో ఒక వ్యక్తిని మర్చిపోకూడదు. నామిత్ మల్హోత్రా. ఎందుకంటే ఆయన సాధారణ బాలీవుడ్ నిర్మాత కాదు. Prime Focus, DNEG వంటి సంస్థల ద్వారా ప్రపంచ స్థాయి VFX, పోస్ట్ ప్రొడక్షన్ రంగంలో ఆయన నిర్మించిన నెట్‌వర్క్‌నే ‘రామాయణం’కు ప్రధాన బలంగా చూడాలి. DNEG హాలీవుడ్లో భారీ విజువల్ ఎఫెక్ట్స్ సినిమాలతో పనిచేసిన సంస్థ. అంటే ఈ ప్రాజెక్టుకు కేవలం భారతీయ మార్కెట్ ఎక్సపీరియన్స్ కాదు.. ప్రపంచ సినిమా నిర్మాణ వ్యవస్థతో అనుబంధం కూడా ఉంది. అదే కారణంగా ‘రామాయణం’ను ఒక భారీ భారతీయ సినిమా నుంచి గ్లోబల్ సినిమాగా మార్చే ప్రయత్నం జరుగుతోంది.
చైనాలో ఆడితే లెక్కలు మారిపోతాయా?
నామిత్ మల్హోత్రా ముందున్న లెక్క చాలా సింపుల్‌గా కనిపించినా.. టార్గెట్ చాలా పెద్దది. ఇండియా నుంచి కొంత. అమెరికా, కెనడా, యూరప్ నుంచి కొంత. గల్ఫ్, ఆస్ట్రేలియా, ఇతర మార్కెట్ల నుంచి కొంత. చైనా నుంచి భారీగా వస్తే? అప్పుడు మొత్తం బిజినెస్ లెక్క ఒక్కసారిగా మారిపోవచ్చు.
అందుకే చైనాలో ‘రామాయణం’ సక్సెస్ అయితే తర్వాత ఏమవుతుంది?. మహాభారతం కావచ్చు. కృష్ణుడి కథలు కావచ్చు. బుద్ధుడి కథలు కావచ్చు. భారతీయ పురాణాల్లోని మరెన్నో కథలు కావచ్చు.
ఈ క్రమంలో రాముడు లంకను జయించిన కథతో పాటు, భారతీయ సినిమా మరో భారీ మార్కెట్‌ను కూడా జయించిన కొత్త కథ మొదలవుతుంది.








