అగ్నిమాపక వాహనాలను ప్రారంభించిన సీఎం చంద్రబాబు
అగ్నిమాపకశాఖలోకి మరికొన్ని ఆధునిక వాహనాలు రానున్నాయి. తాజాగా 58 ఆధునిక ఫైర్‌ఫైటింగ్ వాహనాల ( Firefighting vehicles)ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) జెండా ఊపి ప్రారంభించారు. 25 అధునాతన ఫైర్ ఫైటింగ్ వాహనాలు, 20 వాటర్ బౌజర్లు, 13 క్విక్ రెస్పాన్స్ మల్టీపర్పస్ ఫైర్‌ఫైటింగ్ వాహనాలను లాంచ్ చేశారు. గ్రామీణ, అటవీ ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేలా 25 అధునాతన ఫైర్ ఫైటింగ్ వాహనాలను అగ్నిమాపక శాఖ సమకూర్చుకుంది. భారీ అగ్ని ప్రమాదాల్లో మంటలను అదుపు చేయడానికి అవసరమయ్యే నిరంతర నీటి సరఫరాకు 20 వాటర్ బౌజర్ల కొనుగోలు చేసింది. ఇరుకైన రద్దీ ప్రాంతాల్లోకి వేగంగా చేరుకునేలా 13 క్విక్ రెప్పాన్స్ మల్టీపర్పస్ ఫైర్‌ఫైటింగ్ వాహనాలు పనిచేస్తాయి. తొలి దశలో ఇప్పటికే రూ.33 కోట్లతో 65 ఫైర్‌ఫైటింగ్ వాహనాలను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. వాహనాల ప్రత్యేకతలను అధికారులు సీఎంకు వివరించారు. ఈ కార్యక్రమంలో హోం మంత్రి అనిత (Home Minister Anita), అగ్నిమాపక శాఖ డీజీ వెంకట రమణ (Venkata Ramana), అధికారులు పాల్గొన్నారు.








