హ్యూస్టన్ టిసిఎ స్వర్ణోత్సవాలకు భారీ స్పందన…
వంగూరి చిట్టెన్రాజు దంపతులకు జీవితసాఫల్య పురస్కారం
పాల్గొన్న సినీనటీనటులు, గాయనీ గాయకులు, సాహితీవేత్తలు
తెలుగు సాంస్కృతిక సమితి హ్యూస్టన్ స్వర్ణోత్సవాలు ఆగస్టు 7, 8 తేదీలలో ఫోర్ట్ బెండ్ ఎపిక్ సెంటర్ లో అంగరంగ వైభవముగా జరిగాయి. యాభై ఏళ్ళ ఈ ప్రస్థానాన్ని పురస్కరించుకొని సంస్థాపక బృందాన్ని సన్మానించడం జరిగింది. వారి దార్శనికతను, సేవానిరతిని ప్రత్యేకముగా స్మరించండం జరిగింది. ఈ స్వర్ణోత్సవం అడుగు అడుగునా తెలుగు సంస్కృతీ, సాహిత్య సౌరభాలకు దర్పణముగా నిలిచింది. వేదిక అలంకరణలు, సభా ప్రాంగణాల పేర్లలో తెలుగుతనం కొట్టొచ్చినట్లు కనబడినది. ప్రధాన సభా వేదికను “ తెలుగు విజయం” గా, ఉప సభ వేదికలను “ నన్నయ, తిక్కన, ఎఱ్ఱన, పోతన పేర్లతో నామకరణం చేయడం తెలుగు భాషకు పట్టాభిషేకం లా అగుపించింది. సభావేదికు ముందున్న “స్వాగత తోరణం” కాకతీయ, విజయనగర, శాతవాహన సంస్కృతిని ప్రతిబింబిస్తూ మనదైన తెలుగు సాంస్కృతిక మూలాలను గుర్తుకు తెచ్చాయి. శ్రీ సీతా రామ కళ్యాణం, వేద పఠనం, పూర్ణకుంభ స్వాగతాలతో ఈ కార్యక్రమాలకు వైభవముగా అంకురార్పణ జరిగింది.

శ్రీ వంగూరి చిట్టెన్ రాజు, శాయి రాచకొండ ఆధ్వర్యములో యాభై ఏళ్ళ చారిత్రక ప్రస్థానాన్నిఅక్షర రూపంలో ముద్రించిన సావనీరు చరిత్రను కళ్ళకు కట్టినట్లు తెలిపింది. పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు, జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు, అవసరాల శ్రీనివాసరావు గారు, వామరాజు సత్యమూర్తి గారు, బలభద్రపాత్రుని రమణి గారు, అరుణ సుబ్బారావు గారు వంటి ప్రముఖులు ఈ స్వర్ణోత్సవాలలో పాల్గొని తమ అమూల్యమైన ఆలోచనలు, అనుభవాలు, తెలుగు భాషా సాహిత్యాలపై తమ మమకారాన్ని పంచుకోవడం స్వర్ణోత్సవానికి మరింత వన్నె తెచ్చింది. తెలుగు సాంస్కృతిక సమితి హ్యూస్టన్ యాభై ఏళ్ళ ప్రస్థానాన్ని “స్వర్ణ వైభవము” అనే నృత్య రూపకముగా చేసి చూపించిన ప్రదర్సన వీక్షకులను మంత్ర ముగ్ధులను చేసాయి.
భారత దేశం నుండి వచ్చిన సినీ తారలు, పద్మశ్రీ రాజేంద్ర ప్రసాద్, అలీ, నవీన్ పోలిశెట్టి, రీతూ వర్మ, అవసరాల శ్రీనివాస్, వారు తమ తమ ప్రదర్శనలతో అతిధులను కేరింతలు కొట్టించారు. సాయంత్రం జరిగిన స్వర్ణోత్సవ సరాగాలు కార్యక్రమములో సింగర్ సునీత, కృష్ణ చైతన్య, “ఇన్ ఫ్యూషన” బృందం మధురమైన పాటలు పాడి అందరినీ ఆనంద డోలికల్లో ముంచెత్తారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఐక్య రాజ్య సమితిలో భారత దేశ శాశ్వత ప్రతినిధిగా పనిచేస్తున్న శ్రీ పర్వతనేని హరీష్ గారు హాజరయ్యారు. వారితో పాటు హూస్టన్ కాన్సులెట్ జనరల్ శ్రీ మంజునాథ్ గారు ప్రత్యేక అతిధిగా కార్యక్రమములో పాలు పంచుకొన్నారు.
ఈ స్వర్ణోత్సవాలకు కన్వీనర్ గా శ్రీ జితేందర్ రెడ్డి గారు, సంస్థకు ప్రెసెడెంట్ గా శ్రీ యాదగిరి రెడ్డి కుడుముల గారు వ్యవహరించారు. ఈ సందర్భముగా శ్రీ చిట్టెన్ రాజు వంగూరి, శ్రీమతి రత్న కుమార్ పాప గార్లను జీవన సాఫల్య పురస్కారంతో గౌరవించడం జరిగింది. అలానే ఎందరో ప్రముఖులను వారు చేస్తున్న సేవకు గాను వివిధ సేవా పురస్కారాలతో గౌరవించడం జరిగింది. ఈ కార్యక్రమాలు హూస్టన్, డల్లాస్,ఆస్టిన్ వంటి పలు ప్రాంతాలలో ఉన్న తెలుగు వారందరినీ ఒకచోట చేర్చి వారిని తెలుగు మాధుర్యాలలో ముంచెత్తాయి అని అనడంలో అతిశయోక్తి లేనే లేదు. అలానే పరదేశములో ఉంటూ కూడా మాతృభూమి మూలాలను తెలుగు సాంస్కృతిక సమితి, హ్యూస్టన్ భద్రపరుస్తూ రేపటి తరాలకు తెలుగు వారసత్వ పరంపరలను చేర్చడములో సఫలీకృతమైంది.








