జపం చేస్తున్నారా? రమణ మహర్షి చెప్పినట్టు ప్రయత్నించారా?!
— శివ దువ్వూరు
ఉదయం పూజగదిలో దీపం వెలిగిస్తాం.
చేతిలో జపమాల తీసుకుంటాం. ఒకే మంత్రాన్ని పదే పదే జపిస్తాం. మొదట ప్రతి పదం స్పష్టంగా వినిపిస్తుంది. కొంతసేపటికి అదే మంత్రం ఒక లయలా మారిపోతుంది. మనం జపిస్తూనే ఉంటాం. కొన్నిసార్లు నోరు మంత్రాన్ని పలుకుతూనే ఉంటుంది… మనసు మాత్రం ఇంకేదో ఆలోచిస్తూ ఉంటుంది. ఇది మనలో చాలామందికి జరిగే అనుభవమే.దాని వెనకాల మర్మం ఏమిటి,ఈ జపం చేయటంలో అంతరార్ధం ఏమిటి?
మరీ ముఖ్యంగా …మనం మంత్రాన్ని జపిస్తున్నాం… కానీ ఆ మంత్రం మనలో ఎక్కడి నుంచి పుడుతోంది? ఈ ప్రశ్న సాధారణంగా అనిపించొచ్చు.కానీ సాధకులకు అవసరమైన ప్రశ్న. తెలుసుకోవాల్సిన సమాధానం.
ఈ ప్రశ్న ఒక మహా సంస్కృత పండితుడిని, మంత్రసాధకుడిని, ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసిన కావ్యకంఠ గణపతి మునిని వెంటాడింది. ఆయనకు తెలియని మంత్రాలు లేవు. మంత్రశాస్త్రంపై లోతైన పట్టు ఉంది. సంస్కృతంపై అపారమైన పాండిత్యం ఉంది. సాధనలో ఎన్నో సంవత్సరాలు గడిపారు.
ఎంతగా మంత్ర సాధన చేసినా మనశ్శాంతి కలగకపోవడంతో 1907., నవంబర్ 18న విరూపాక్ష గుహ బయిట ఓ రాతిపై కూర్చుని ఉన్న రమణ మహర్షిని ఆశ్రయించారు.నా సాధనలో ఏదో లోపం కనపడుతోంది. జప,తపాలు , సాధనలు ఎన్ని చేసినా తపస్సు స్వరూపం అర్దం కావటం లేదు , దయచేసి మీరే చెప్పాలి అని ప్రార్దించారు.
దాదాపు 11 ఏళ్ల పాటు మౌనంలో ఉన్న రమణులు ఆయన కోసం మౌనాన్ని వీడి “నాయనా” అని సంబోధిస్తూ ఆదరించారు. అక్కడే అప్పుడే ఆ క్షణమే ఆయన సాధనకు ఒక కొత్త దారి కనిపించింది.
రమణులు ఏం చెప్పారు?
మనకు సాధారణంగా మంత్రజపం అంటే ఒక మంత్రాన్ని పదే పదే పలకడం. మాల తిప్పడం. శబ్దాన్ని మనసులో నిలబెట్టుకోవడం. కానీ రమణ మహర్షి చూపించిన దారి, దృష్టి కొంచెం భిన్నంగా ఉంది. మంత్రం మీదే దృష్టి పెట్టకుండా… మంత్రం ఎక్కడి నుంచి పుడుతుందో గమనించమన్నారు. మంత్ర, శబ్దోత్పత్తి ఎక్కడ జరుగుతోందో గమనిస్తే అందులో మనస్సు లీనం అవుతుంది. నేను అనే స్పురణ ఎక్కడ నుంచి వస్తోందో విచారిస్తే, మనసు అందులో అణిగిపోతుంది అని చెప్పారు.
ఆ మాటల అర్దం ఏమిటి..
ఒక మాట మనం మాట్లాడే ముందు అది మనసులో ఒక ఆలోచనగా పుడుతుంది. ఆ ఆలోచన కూడా ఒక్కసారిగా ఆకాశం నుంచి ఊడి పడదు. అది మనలో ఎక్కడో ఒక చోట నుంచి పైకి వస్తుంది. అలాగే మంత్రం కూడా. మన నోటితో పలికే శబ్దానికి ముందు అది మనలో ఒక ఆలోచనగా, ఒక భావంగా, ఒక అంతర్గత శబ్దంగా ఉద్భవిస్తుంది.
అయితే… ఆ శబ్దం పుట్టే ముందు అక్కడ ఏముంది?
ఇక్కడే సాధన దిశ మారుతుంది. మంత్రాన్ని పట్టుకుని ముందుకు వెళ్లడం కాదు. మంత్రం వచ్చిన దారినే వెనక్కి అనుసరించడం . ఇదే ఇందులో కీలకం.
ఇంకా అర్దమయ్యేటట్లు చెప్పాలంటే…
ఒక నది మీ ముందు ప్రవహిస్తోంది. మీరు నది నీటిని చూస్తున్నారు. ఆ నీరు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకోవాలంటే ఏం చేస్తారు? నీటిని చూస్తూ అక్కడే నిలబడరు. నది ప్రవాహానికి వ్యతిరేకంగా పైకి వెళ్తారు. చివరికి అది ఎక్కడి నుంచి పుడుతుందో వెతుకుతారు. మంత్రం విషయంలో కూడా రమణ మహర్షి చూపించిన దారి ఇలాంటిదే. మంత్రం ఒక ప్రవాహం. ఆ ప్రవాహాన్ని చూస్తూ ఉండటం ఒక స్థాయి. కానీ… “ఈ ప్రవాహం ఎక్కడి నుంచి వస్తోంది?” అని వెనక్కి తిరగడం మరో స్థాయి. అందుకే మంత్రం ఇక్కడ కేవలం జపించాల్సిన పదం కాదు. ఒక జాడ. ఆ జాడను పట్టుకుని వెనక్కి వెళ్లే దారి.
కానీ విషయం ఇక్కడితో ఆగదు…
మంత్రాన్ని జపిస్తూ ఉండగా ఒక దశలో శబ్దం తగ్గిపోవచ్చు. మంత్రం ఆగిపోవచ్చు. కొద్దిసేపు నిశ్శబ్దం ఏర్పడవచ్చు. చాలామంది “ఇదే ధ్యానం” అని ఆగిపోతారు. కానీ రమణ చూపించిన ప్రశ్న ఇంకా లోతైనది.
మంత్రం లేనప్పుడు ఆ నిశ్శబ్దం ఉందని మీకు ఎలా తెలుస్తోంది? అంటే మంత్రం ఉన్నప్పుడు కూడా మీకు తెలుసు. మంత్రం లేనప్పుడు కూడా మీకు తెలుసు. శబ్దం వచ్చింది. శబ్దం వెళ్లిపోయింది. కానీ ఆ మార్పు మీకు తెలిసింది. అయితే… ఆ శబ్దాన్ని, ఆ నిశ్శబ్దాన్ని తెలుసుకుంటున్నది ఏమిటి? ఇక్కడే మంత్రసాధన ఒక కొత్త ప్రశ్నగా మారుతుంది.
శబ్దం నుంచి ‘నేను’ వైపు… మన సాధారణ జీవితం మొత్తం బయటికి వెళ్తుంది. నేను.
నా ఆలోచనలు. నా మాటలు. నా పనులు. నా ప్రపంచం అంతా మాయమైపోతుంది. అసలు నేను అనే ప్రశ్న దగ్గరకు వచ్చి ఆగుతుంది.
అంటే ప్రయాణం ఇలా సాగుతుంది:
నేను → ఆలోచన → మాట → ప్రపంచం
కానీ మంత్రాన్ని లోతుగా అనుసరిస్తే ప్రయాణం వెనక్కి తిరగవచ్చు.
మాట → ఆలోచన → ‘నేను’ → మూలం
అంటే మంత్రం మనల్ని ఇంకో ఆలోచన దగ్గరకు తీసుకెళ్లడం కాదు. ఆలోచనలు పుడుతున్న చోటు వైపు తీసుకెళ్లడం. అక్కడ ఒక రోజు ప్రశ్న మరింత వ్యక్తిగతంగా మారుతుంది. “ఈ మంత్రం ఎక్కడి నుంచి వచ్చింది?” అన్న ప్రశ్న… క్రమంగా…“ఈ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది?” గా మారుతుంది. ఆ తర్వాత… “ఈ ‘నేను’ ఎక్కడి నుంచి వచ్చింది?” అనే ప్రశ్నగా మారుతుంది. ఇక్కడే గణపతి ముని ప్రశ్నకు అసలు అర్థం తెలుస్తుంది
“తపస్సు అంటే ఏమిటి?” అని గణపతి ముని అడిగినప్పుడు అది కేవలం మరింత కఠినంగా సాధన చేయాలా అనే ప్రశ్న కాదు. తపస్సు అంటే శరీరాన్ని ఇబ్బంది పెట్టడమా? ఎక్కువసేపు మంత్రం జపించడమా? ఎక్కువ రోజులు ఉపవాసం ఉండడమా?
లేక ఇంకేదైనా ఉందా? రమణ చూపించిన దారి ప్రకారం, దృష్టిని బయట నుంచి లోపలికి తిప్పడం కీలకం.
మంత్రాన్ని జపిస్తున్నప్పుడు… మంత్రం మీదే ఆగిపోకుండా, అది పుట్టే మూలాన్ని అనుసరించడం. అదే తపస్సు వైపు తీసుకెళ్లే అంతర్ముఖ ప్రయాణం.
ఆ క్షణమే తపస్సు మొదలవుతుంది
మనం సాధారణంగా దేవుడిని చేరడానికి మంత్రాన్ని ఉపయోగిస్తాం.కానీ రమణ చూపించిన ప్రశ్న మాత్రం ఇంకొంచెం లోతైనది: “దేవుడిని వెతుకుతున్న ఈ ‘నేను’ అసలు ఎవరు?” బహుశా… మంత్రజపం మొదలయ్యేది అక్కడ కాదు. మంత్రాన్ని జపిస్తున్న ‘నేను’ను వెతకడం మొదలైన చోటే అసలు తపస్సు మొదలవుతుంది.








