‘కొరియన్ కనకరాజు’ కడుపుబ్బా నవ్వించే నాన్‌స్టాప్ ఎంటర్టైనర్. రెండు డైమెన్షన్స్ ఉన్న పాత్రలో నటించడం చాలా సంతృప్తినిచ్చింది : వరుణ్ తేజ్
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ హారర్ కామెడీ సూపర్‌నేచురల్ ఎలిమెంట్స్, నవ్వులు పంచే వినోదంతో గొప్ప థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించనుంది. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, ఎంటర్టైనింగ్ టీజర్, ట్రైలర్, చార్ట్‌బస్టర్‌గా నిలిచిన రెండు పాటల సినిమాపై ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి. ‘కొరియన్ కనకరాజు’ ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 7న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈరోజు (ఆగస్టు 6) రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్స్ వేస్తున్నారు. ప్రీబుకింగ్స్ అద్భుతంగా ఉన్నాయి. ఈ సందర్భంగా హీరో వరుణ్ తేజ్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.
కొరియన్ కనకరాజు కథ విన్నప్పుడు మిమ్మల్ని ఆకట్టుకున్న అంశాలు ఏమిటి?
-ముఖ్యంగా ఇందులో ఉన్న ఎంటర్టైన్మెంట్ నాకు చాలా నచ్చింది. గాంధీ ఈ కథ చెప్పినప్పటి నుంచి నేను నవ్వుతూనే ఉన్నాను. నేను ఏ కథ విన్నా, థియేటర్లో కూర్చొని సినిమా చూస్తున్న ప్రేక్షకుడిలాగే వింటాను. ప్రతి నటుడిలాగే నాకు కూడా వైవిధ్యమైన పాత్రలు చేయాలని ఉంటుంది. ఆ క్రమంలో కొన్ని సీరియస్ పాత్రలు కూడా చేశాను. కోవిడ్ తర్వాత ఎక్కువగా సీరియస్, భారీ యాక్షన్ వచ్చాయి. ఎప్పటినుంచో ఒక మంచి ఎంటర్టైన్మెంట్ సినిమా చేయాలని వుండిది. ప్రేక్షకులు రెండున్నర గంటల పాటు రిలాక్స్ అయి నవ్వుకునే సినిమా చేయాలనే ఉద్దేశంతో ‘కొరియన్ కనకరాజు’ చేశాను.
మీ కటౌట్‌కి సరిపోయే అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఇందులో ఉన్నాయనిపిస్తోంది కదా?
-నిజానికి ఒక నటుడు అన్ని రకాల పాత్రలు చేయాలి. నేను అన్ని రకాల పాత్రలు చేస్తాను. పొడవుగా ఉండే హీరోలు కామెడీ చేయకూడదనే ఒక అభిప్రాయం ఉంది. అది సరైనది కాదు. పాత్రను సరిగ్గా రాస్తే కామెడీ కుదురుతుంది. ‘కొరియన్ కనకరాజు’లో కామెడీ తో పాటు యాక్షన్ కూడా చాలా బాగా కుదిరింది.
ప్రీమియర్స్ ఫుల్ అయ్యాయి. ఎక్స్ట్రా షోలు కూడా యాడ్ అవుతున్నాయి. ఇప్పుడు ఒత్తిడి తగ్గిందా?
-ఈ సినిమా షూటింగ్‌ను చాలా ముందుగానే పూర్తి చేశాం. పోస్ట్ ప్రొడక్షన్‌కు కూడా మాకు సరిపడా సమయం దొరికింది. సినిమా చాలా బాగా వచ్చింది. అందుకే ఇంత కాన్ఫిడెంట్‌గా ప్రమోట్ చేయగలిగాం. దర్శకుడు గాంధీ, రితిక, సత్య… అందరూ ఈ సినిమాను తమ సొంత సినిమాలా భావించి ప్రమోషన్స్ చేశారు. టీజర్, ట్రైలర్ చూసి ప్రేక్షకులే సినిమా చూడాలని నిర్ణయించుకున్నారు. ఆ స్పందనే ఇప్పుడు బుకింగ్స్‌లో కనిపిస్తోంది.
ప్రమోషన్స్ కూడా చాలా కొత్తగా చేశారు కదా?
అవునండి. ఈ రోజుల్లో సినిమాను జనాల్లోకి తీసుకెళ్లాలంటే ప్రమోషన్స్ కూడా కొత్తగా ఉండాలి. అంతేకాదు, అవి సినిమా కంటెంట్‌కు కనెక్ట్ అయ్యేలా ఉండాలి. ట్రైలర్ చూసిన తర్వాత కథ అంతా చెప్పేశారు అని కొందరు అన్నారు. కానీ మేము ప్రేక్షకులను ముందుగానే ప్రిపేర్ చేయాలనుకున్నాం. ఇది పూర్తి స్థాయి ఎంటర్టైన్మెంట్ సినిమా అని చెప్పడమే మా ఉద్దేశం. ఆ ఎంటర్టైన్మెంట్ను ట్రైలర్, ప్రమోషన్స్‌లో కూడా చూపించాం.
సత్యతో మీ కాంబినేషన్ గురించి?
-సత్యతో నాకు చాలా మంచి బాండింగ్ ఉంది. మా ఇద్దరం కలిసి చేస్తున్న మూడో సినిమా ఇది. సత్యను కేవలం కమెడియన్‌గా మాత్రమే చూడకూడదు. తనలో మంచి నటుడు కూడా ఉన్నాడు. ఈ సినిమాలో మా ఇద్దరి పాత్రలు చాలా కీలకం. ప్రేక్షకులు ఆ రెండు పాత్రలతో కనెక్ట్ కావాలంటే మేమిద్దరం చాలా హోమ్‌వర్క్ చేశాం. రాయలసీమ యాస నేర్చుకుని, కామెడీ టైమింగ్‌పై ప్రత్యేకంగా వర్క్ చేశాం. ఆ కసరత్తు సినిమాలో బాగా వర్కౌట్ అయింది. మా ఇద్దరి కెమిస్ట్రీని ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తారు.
కొరియన్ భాష నేర్చుకోవడం ఎలా అనిపించింది?
-నాకు కొత్త విషయాలు నేర్చుకోవడం చాలా ఇష్టం. అందుకే నటుడిని అయ్యాను. కొత్త పాత్రలు చేయడం, కొత్త వ్యక్తిలా జీవించడం నాకు చాలా ఎగ్జైటింగ్‌గా ఉంటుంది. ప్రతి పాత్రలో నేను కనిపించకుండా, ఆ పాత్ర మాత్రమే కనిపించేలా ఎంత కష్టపడాలో అంత కష్టపడతాను.
-ఇది అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్. అయితే ఇలాంటి సినిమాలకు ట్రైలర్ కట్ చేయడం చాలా ఛాలెంజింగ్. కామెడీ సినిమాల్లో సిచ్యువేషన్‌తో కలిసి చూసినప్పుడే ప్రేక్షకులు నవ్వుతారు. వాటిని కట్ చేసి ట్రైలర్లో పెడితే అదే మ్యాజిక్ రావడం కష్టం. అందుకే మొదటి నుంచే ఇది పూర్తి స్థాయి కామెడీ ఎంటర్టైనర్ అని ప్రమోట్ చేశాం.
రెండు విభిన్న పాత్రలు చేయడం ఎలా అనిపించింది?
-ఒక నటుడిగా ఇది నాకు చాలా ఛాలెంజింగ్ రోల్. రెండు విభిన్నమైన బాడీ లాంగ్వేజ్‌లు, రెండు భిన్నమైన మనస్తత్వాలు చూపించే అవకాశం రావడం చాలా సంతోషంగా అనిపించింది. నటుడిగా చాలా తృప్తిని ఇచ్చింది.
-గాంధీ రాయలసీమలో పుట్టి పెరిగాడు. ఆ ప్రాంతం నుంచే ఈ కథకు స్ఫూర్తి పొందాడు. తనకు ఆ యాస కొత్త కాదు. కానీ నాకు మాత్రం కొత్త. అందుకే దానిపై ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేశాను.
మీకు ఫేవరెట్ జానర్ ఏది?
– హ్యుమర్ , యాక్షన్ సినిమాలు చూడడం చాలా ఇష్టం.
ట్రైలర్‌కు ‘OG’తో పోలికలు వచ్చాయి కదా?
– కళ్యాణ్ బాబాయ్ ఫ్యాన్స్ కి చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసిన సినిమా ఓజీ. అందులో జపనీస్ టచ్ ఉంది. అందుకే కొంతమందికి అలాంటి పోలిక అనిపించి ఉండొచ్చు. కానీ మా సినిమాకు ‘OG’తో ఎలాంటి సంబంధం లేదు.
కొరియన్ గెటప్ కోసం ఎలాంటి హోమ్‌వర్క్ చేశారు?
-క్యారెక్టర్ డిజైన్ విషయంలో చాలా ప్లాన్ చేశాం. హెయిర్‌స్టైల్ పూర్తిగా కొరియన్ లుక్‌లో ఉండాలని నిర్ణయించుకున్నాం. కొరియన్లకు స్ట్రైట్, సిల్కీ హెయిర్ ఉంటుంది. అందుకే మొదటిసారి జుట్టుకు కలర్ కూడా వేశాను. మనకు ఆ స్టయిల్ వింతగా అనిపించొచ్చు. కానీ కొరియాలో షూటింగ్‌కు వెళ్లినప్పుడు అదే హెయిర్‌స్టైల్‌తో చాలామందిని చూశాను.
ఫైనల్ అవుట్‌పుట్ చూసిన తర్వాత ఎలా అనిపించింది?
-గాంధీ మొదటి నుంచే “ఈ స్టైల్లో ఇప్పటివరకు మీరు కనిపించలేదు” అని చెప్పేవాడు. ‘F2’, ‘F3’లో కామెడీ చేసినా, ఇందులో నా పాత్ర పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఇందులో రెండు డైమెన్షన్స్ ఉన్నాయి. ప్రేక్షకులకు వరుణ్ తేజ్ కనిపించకూడదు… ‘కనకరాజు’ మాత్రమే కనిపించాలి, నన్ను కనకరాజు పేరుతో పిలిచేంతగా ఆ పాత్రలో ట్రాన్స్ఫర్మ్ కావాలని ప్రయత్నం చేశాను.
ఈ సినిమా విషయంలో మీరు తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ ఏమిటి?
-ఈ సినిమా కోసం ప్రతిదీ చాలా జాగ్రత్తగా చేశాం. ప్రతి విషయాన్ని డబుల్ చెక్ చేసుకున్నాం. నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా అన్ని సౌకర్యాలు కల్పించారు. సినిమా ఎప్పుడో పూర్తయినా, దర్శకుడు గత ఐదు రోజులుగా కూడా ప్రతి అంశాన్ని మరోసారి చెక్ చేస్తూనే ఉన్నారు. నాకు గాయం ఉన్నప్పటికీ, ఎంత ప్రమోట్ చేయగలనో అంత ప్రమోట్ చేస్తున్నాను.
నిర్మాతల గురించి?
– కంచె, అంతరిక్షం తర్వాత వాళ్లతో కలిసి చేస్తున్న మూడో సినిమా ఇది. రాజీవ్ గారు, వంశీ గారు చాలా పాషన్ ఉన్న ప్రొడ్యూసర్స్. ఇద్దరూ కలిసి సినిమాకు కావాల్సిన పూర్తి సపోర్ట్ ఇచ్చారు.
ఇప్పుడు ఫ్యామిలీ పెరిగింది. వర్క్-లైఫ్ ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు?
-బాబు వచ్చిన తర్వాత షూటింగ్ లేకపోవడంతో ఇంట్లోనే ఎక్కువ సమయం గడిపాను. షూటింగ్ ఉంటే మాత్రం ఫ్యామిలీని మిస్ అవ్వాల్సిందే. షూటింగ్ లేకపోతే ఇంట్లోనే ఉంటాను. ట్రావెల్ కూడా ఎక్కువగా ఫ్యామిలీతోనే చేస్తాను. వర్క్ లైఫ్, ఫ్యామిలీ లైఫ్ బ్యాలెన్స్ చేసుకోవడం చాలా ముఖ్యం.
తమన్ మ్యూజిక్ గురించి?
-ఈ సినిమాకు మ్యూజిక్ చాలా కీలకం. పెనుగొండలో ఉండే ఒక మాస్ క్యారెక్టర్, కొరియన్ కల్చర్‌లోకి మారిన తర్వాత వచ్చే ట్రాన్స్ఫర్మేషన్ మొత్తం మ్యూజిక్‌లో వినిపించాలి. అదే తనకు మ్యూజిక్ డైరెక్టర్‌గా పెద్ద ఛాలెంజ్ అని తమన్ చెప్పారు. ఆయన ఇచ్చిన రీ-రికార్డింగ్ అద్భుతంగా వచ్చింది. థియేటర్లో సౌండ్ గొప్ప ఎక్స్పీరియన్స్ ఇస్తుంది.
హీరోయిన్ రితిక నాయక్ గురించి?
-రితిక చాలా మంచి నటి. చాలా కష్టపడుతుంది. ప్రమోషన్స్‌లో కూడా ఎంతో సపోర్ట్ చేసింది. ఈ పాత్ర తనకు చాలా బాగా సూట్ అయింది.
ప్రేక్షకులకు ఏం చెబుతారు?
ఈ సినిమా గురించి ఆడియన్స్ కి ఏం చెప్తారు?
-‘కొరియన్ కనకరాజు’ నాన్‌స్టాప్ ఫన్ ఎంటర్టైనర్. కడుపుబ్బా నవ్వించే సినిమా. చాలా టైట్ స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంది.
ఓవర్సీస్లో మంచి రెస్పాన్స్ వస్తోంది. ఎలా అనిపిస్తోంది?
-మేము చాలా హార్డ్‌వర్క్ చేసి ఈ సినిమా చేశాం. ఇప్పటికే వస్తున్న స్పందన చాలా ఆనందంగా ఉంది. కంటెంట్ ప్రేక్షకులకు నచ్చింది. మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు. సినిమా కూడా అందరికీ తప్పకుండా నచ్చుతుందనే నమ్మకం ఉంది.
‘బరి’ సినిమా గురించి?
-ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ జరుగుతోంది. అది పూర్తిగా స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే కథ. నేను చిన్నప్పటి నుంచి వాలీబాల్ ఆడేవాడిని. అదే బ్యాక్‌డ్రాప్‌తో కథ వచ్చింది. ఇందులో నాన్నగారు కూడా ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయనతో కలిసి నటించాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. ‘బరి’తో అది నెరవేరుతోంది.








