తెలుగు ప్రజల ప్రస్థానం ఎంతో గర్వకారణం: అయోధ్య రామిరెడ్డి
అమెరికాలోని బాల్టిమోర్ వేదికగా అత్యంత వైభవంగా జరుగుతున్న 19వ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) మహాసభలలో వైఎస్సార్సీపీ మాజీ రాజ్యసభ సభ్యులు అయోధ్య రామిరెడ్డి ప్రత్యేక అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ప్రవాస తెలుగువారందరిని ఉద్దేశించి మాట్లాడారు.
ఆటా సంస్థ తన 19వ వార్షికోత్సవాన్ని జరుపుకోవడం చాలా సంతోషకరమని, ఇది టీనేజ్ దాటి అడల్ట్హుడ్లోకి అడుగుపెడుతున్న దశ అని అభివర్ణించారు. మరింత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరినీ ఒకే వేదికపైకి తీసుకువస్తున్న ఆటా కృషిని ఆయన కొనియాడారు. 50, 60 ఏళ్ల క్రితం వ్యవసాయ కుటుంబాల నుండి, సాధారణ ఉద్యోగాల కోసం అమెరికాకు వచ్చిన తెలుగు ప్రజలు.. ఇక్కడ అద్భుతమైన ప్లాట్‌ఫామ్‌ను సృష్టించుకుని ఇవాళ ఎంతో గొప్ప స్థాయికి ఎదిగారని తెలిపారు. ఒక తరం గడిచి రెండో తరానికి వచ్చేసరికి, ఉద్యోగాలు చేసే స్థాయి నుంచి ఇతరులకు ఉపాధి కల్పించే స్థాయికి మనవాళ్ళు ఎదుగుతుండటం మనందరికీ గర్వకారణమని పేర్కొన్నారు.
భారత్, అమెరికా కలిసి సంయుక్తంగా ప్రగతి సాధించడంలో ఎన్ఆర్ఐల పాత్ర ఎంతో కీలకమని అయోధ్య రామిరెడ్డి స్పష్టం చేశారు. టెక్నాలజీ, ఫైనాన్షియల్ సర్వీసెస్, స్పేస్ రీసెర్చ్, హెల్త్ కేర్ , మ్యానుఫ్యాక్చరింగ్ రంగాలలో ఉత్తమ పద్ధతులను (Best Practices) అమెరికా నుండి భారత్‌కి తీసుకురావడంలో ప్రవాస తెలుగువారందరూ తోడ్పడాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తరపున, పార్టీ నాయకుల అందరి నుండి ఆటా మహాసభలకు హాజరైన ప్రతి ఒక్కరికీ ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేశారు.








