ఆస్కార్‌ను షేక్ చేస్తున్న ఇటాలియన్ సైకాలజికల్ థ్రిల్లర్ ‘The Spiral’! కథేంటి?
కొన్ని కుటుంబ రహస్యాలు బయటపడటానికి దశాబ్దాలు పడుతుంది. కానీ అవి ఒక్కసారిగా బయటకు వచ్చినప్పుడు, కేవలం గతాన్ని మాత్రమే కాదు… వర్తమానంతో పాటు భవిష్యత్తును కూడా కుదిపేస్తాయి. సరిగ్గా ఇలాంటి తీవ్రమైన ఆవేదన, సైకాలజికల్ డ్రామా నేపథ్యంలో రూపుదిద్దుకున్న చిత్రమే ‘The Spiral’ (L’Estranea). పాలో స్ట్రిప్పోలి దర్శకత్వం వహించిన ఈ ఇటాలియన్ సైకాలజికల్ థ్రిల్లర్, 99వ ఆస్కార్ అకాడమీ అవార్డ్స్‌లో ‘బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్’ విభాగానికి ఇటలీ అధికారిక ఎంట్రీగా ఎంపికై వార్తల్లో నిలిచింది. 20 ఏళ్ల పాటు కంటికి రెప్పలా దాచుకున్న ఒక భయంకరమైన నిజాన్ని, కన్న కూతురి ముందే విప్పాల్సి వచ్చిన ఒక తల్లి ఆవేదనతో ఈ కథనం మొదలవుతుంది.అదేంటో చూద్దాం.
కథ ఏమిటి?
తుఫాను రాత్రుల్లో కొన్ని ఇళ్లకు వర్షం మాత్రమే తాకుతుంది. కొన్ని ఇళ్లలో మాత్రం గతం తలుపు తడుతుంది.
ఇటలీలోని బారీ నగరం. అన్నా కుటుంబం బయటకు చూస్తే చాలా సంతోషమైన కుటుంబంలా కనిపిస్తుంది. భర్త వాల్టర్, కొడుకు టోబియా, చిన్న కూతురు ఆలిస్. అందరికీ తమ తమ కలలు ఉన్నాయి.
టోబియాకు ఫుట్‌బాల్ అంటే ప్రాణం. భవిష్యత్తులో ప్రొఫెషనల్ ప్లేయర్ కావాలనుకుంటాడు. ఆలిస్ మాత్రం చిన్న వయసులోనే మోడలింగ్, నటన వైపు ఎట్రాక్ట్ అవుతుంది. అయితే ఒకరోజు జరిగిన చిన్న సంఘటన ఆ కుటుంబం మొత్తాన్ని మార్చేస్తుంది.
కుటుంబ ఫంక్షన్ లో పెంపుడు కుక్క ఆలిస్పై దాడి చేస్తుంది. చిన్నారి కాలికి తీవ్ర గాయాలవుతాయి. వైద్యులు చివరికి ఆమె కాలును తొలగించాల్సి రావచ్చని చెబుతారు. అన్నాకు అది ఊహించలేని షాక్. తన కూతురు మళ్లీ నడవలేకపోతే? ,.ఆమె భవిష్యత్తు ఏమవుతుంది?, ఆమె కలలు? ఆమె జీవితమే మారిపోతుంది. అలాంటి సమయంలో ఆసుపత్రిలో అన్నాకు ఓ అపరిచిత మహిళ కనిపిస్తుంది.
ఆమె తనను తాను ‘ది స్ట్రేంజర్’ గా పరిచయం చేసుకుంటుంది. ఆమె అన్నాకు ఒక ప్రపోజల్ చేస్తుంది. ఆలిస్ కాలును కాపాడవచ్చు. కానీ అందుకు ఒక ధర చెల్లించాలి. ఆ ధర డబ్బు కాదు. కుటుంబంలోనే మరో వ్యక్తి జీవితంపై దాని ప్రభావం పడుతుంది. కూతురిని కాపాడుకోవాలనే తల్లి ఆలోచన ముందు మిగతా అన్నీ చిన్నవిగా కనిపిస్తాయి. ఆ క్షణం అన్నా ఒప్పుకుంటుంది. అక్కడితో అసలు కథ మొదలవుతుంది.
ఆలిస్ కాలు సెట్ అవుతుంది. కుటుంబం ఊపిరి పీల్చుకుంటుంది. కానీ కొంతకాలానికే ఆ ఎగ్రిమెంట్ ప్రభావం టోబియా జీవితంపై కనిపించడం మొదలవుతుంది. ఒకప్పుడు ఫుట్‌బాల్‌లో మంచి భవిష్యత్తు ఉన్న టోబియా శరీరంలో మార్పులు మొదలవుతాయి. అతని బరువు పెరుగుతుంది. అతని ఆట దెబ్బతింటుంది. అతని కలలు ఒక్కొక్కటిగా కూలిపోతాయి.
అన్నాకు మాత్రం కారణం తెలుసు. కానీ ఆమె ఎవరికీ చెప్పదు. ఎందుకంటే ఆమె మనసులో ఒకే సమాధానం ఉంటుంది. “నా కూతురు బతికింది కదా.” అయితే సమస్య అక్కడితో ఆగదు. టోబియా పరిస్థితి మరింత దిగజారుతుంది. అతన్ని కాపాడేందుకు అన్నా మళ్లీ ‘ది స్ట్రేంజర్’ వైపు చూస్తుంది.
మరో ఎగ్రిమెంట్. మరో ధర. మరో కుటుంబ సభ్యుడి జీవితం. ఇలా ఒక సమస్యను పరిష్కరించడానికి తీసుకున్న ప్రతి నిర్ణయం కొత్త సమస్యను సృష్టిస్తుంది.
ఒకరిని కాపాడటానికి మరొకరిని త్యాగం చేయాల్సి వస్తుంది. ఆ వ్యక్తిని కాపాడటానికి ఇంకొకరిని ప్రమాదంలోకి నెట్టాల్సి వస్తుంది. అలా అన్నా కుటుంబం ఒక అంతులేని చక్రంలో చిక్కుకుంటుంది. ఇదే ‘The Spiral’.
కాలం గడిచిపోతుంది. కుటుంబం బయట ప్రపంచానికి మాత్రం సాధారణంగానే కనిపిస్తుంది. కానీ ఇంటి లోపల జరిగిన నిజం ఎవరికీ తెలియదు. ముఖ్యంగా ఆలిస్‌కు తెలియదు. తనకు జరిగిన ప్రమాదం ఒక దురదృష్టకర సంఘటన మాత్రమే అని అనుకుంటుంది. తర్వాత జరిగిన కుటుంబ విషాదాలకు సహజమైన కారణాలే ఉన్నాయని నమ్ముతుంది. తన తల్లి తనను ప్రేమతో కాపాడిందని మాత్రమే తెలుసు. ఇరవై ఏళ్ల తర్వాత ఆ రహస్యం ఇక దాచలేని స్థితికి వస్తుంది.
ఇప్పుడు అవన్నీ తల్లి బయిటపెట్టబోతుంది. ఎందుకు? ఎందుకంటే
ఒక రాత్రి భారీ వర్షం పడుతుంటుంది. ఆలిస్ తన అపార్ట్మెంట్లో ఉంటుంది. అప్పుడే ఆమె తల్లి అన్నా అక్కడికి వస్తుంది. ఇన్నేళ్లుగా తనలో దాచుకున్న విషయాన్ని ఇక చెప్పాల్సిన సమయం వచ్చిందని ఆమెకు తెలుసు. మొత్తం చెప్పేస్తుంది. తన పిల్లలను కాపాడుకోవాలనే తపనలో ఆమె తీసుకున్న ప్రతి తప్పు మలుపు చెప్తుంది.
ఇవి కూడా చదవండి
ఇప్పుడు ఆమె ముందున్న ప్రశ్న ఒక్కటే. ఇన్నేళ్లుగా తన కుటుంబాన్ని చుట్టేసిన ఆ చక్రాన్ని ఎలా ఆపాలి? ఎందుకంటే ఈసారి సమస్య నుంచి బయటపడటానికి మరొకరిని త్యాగం చేయడం పరిష్కారం కాదు. ఇక ఆ చక్రం ఎక్కడ ముగుస్తుందో నిర్ణయించాల్సింది ఆలిస్. అక్కడే ‘The Spiral’ సాధారణ హారర్ కథను దాటి ఒక కుటుంబ విషాదంగా మారుతుంది. అప్పుడేం అయ్యింది అనేదే
‘The Spiral’ అసలు కథ.
సినిమా ప్రత్యేకత ఏమిటి?
‘The Spiral’ను కేవలం ఒక హారర్ సినిమాగానో, థ్రిల్లర్గానో చూడడం కష్టం. దర్శకుడు పాలో స్ట్రిప్పోలి ఒక కాంప్లెక్స్ ఫ్యామిలీ సాగాను సైకాలజికల్ థ్రిల్లర్ మరియు హృదయ విదారకమైన ట్రాజెడీతో మేళవించి తెరకెక్కించారు. “మనం ప్రాణంగా ప్రేమించే వ్యక్తిని కాపాడుకోవడం కోసం చేసే ప్రయత్నమే, చివరికి ఆ వ్యక్తికి అతిపెద్ద శాపంగా మారితే ఎలా ఉంటుంది?” అనే ఒక సెంటిమెంటల్, తీవ్రమైన ప్రశ్న చుట్టూ ఈ కథ నడుస్తుంది.
దర్శకుడు గతానికీ, వర్తమానానికీ మధ్య చూపించిన విజువల్ వ్యత్యాసం ఈ సినిమాకి ప్రధాన బలం. గతంలో వెలుతురు, పచ్చని కుటుంబ ఆనందం కనిపిస్తే… వర్తమానంలో తుఫాను, అంధకారం, భయంకరమైన ఒంటరితనం ప్రధానంగా కనిపిస్తాయి. జాస్మిన్ ట్రింకా, రొమానా మగ్గియోరా వెర్గానో, అడ్రియానో జియాన్నిని, వాలెరియా బ్రూనీ టెడెస్కీల అద్భుతమైన నటన ఈ భావోద్వేగాలను మరింత గాఢంగా మార్చింది. 2026 వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్లో ‘కాంపెటీషన్’ విభాగంలో ప్రీమియర్ అయినప్పుడే ఈ చిత్రం అంతర్జాతీయ విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
ఎందుకు ఆస్కార్‌కు ఎంపికైంది?
ఈ ఏడాది ఆస్కార్ రేసు కోసం ఇటలీ ఏకంగా 21 అత్యుత్తమ చిత్రాలను పరిశీలించింది. నాని మొరెట్టి తెరకెక్కించిన ‘It Will Happen Tonight’, మార్కో బెచిస్ రూపొందించిన ‘Back To Buenos Aires’ వంటి బలమైన పోటీదారులను పక్కనబెట్టి, ANICA ఎంపిక కమిటీ ‘The Spiral’ వైపే మొగ్గు చూపింది. సంప్రదాయ కథనాలకు భిన్నంగా, ఒక కొత్త తరహా జానర్‌ని సృష్టించడంలో యువ దర్శకుడు పాలో స్ట్రిప్పోలి చూపిన ప్రతిభ, అలాగే అంతర్జాతీయ స్థాయి విమర్శకులను మెప్పించిన విధానమే ఈ ఎంపికకు ప్రధాన కారణాలుగా నిలిచాయి.
ఆస్కార్ రేసులో ఇటలీ తరఫున నిలబడటం స్ట్రిప్పోలికి ఒక పెద్ద విజయం. ‘A Classic Horror Story’, ‘The Holy Boy’, ‘Flowing’ వంటి చిత్రాల తర్వాత ఆయన తీసిన నాలుగో చిత్రమిది. ఇది ప్రాథమిక ఎంట్రీ మాత్రమే అయినప్పటికీ, 2014లో పాలో సోరెంటినో ‘The Great Beauty’తో ఆస్కార్ సాధించిన తర్వాత, మళ్లీ పదేళ్ల దాకా దక్కని ఆ గౌరవాన్ని ఈ కొత్త పాలో ఇటలీకి తెచ్చిపెడతాడేమోనని సినీ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
— సూర్య ప్రకాష్ జోశ్యుల








