తండ్రికి తగ్గ తనయుడు.. కొడుక్కి సెహ్వాగ్ గోల్డెన్ అడ్వైజ్..!
భారత క్రికెట్ జట్టు మాజీ ఓపెనర్, నవాబ్ ఆఫ్ నజాఫ్‌గఢ్ వీరేంద్ర సెహ్వాగ్(Virendra Sehwag) స్టైల్‌ను క్రికెట్ ప్రేమికులు ఎప్పటికీ మర్చిపోలేరు. మైదానంలోకి దిగితే చాలు.. బౌలర్ ఎవరనేది చూడకుండా మొదటి బంతి నుంచే ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడటం సెహ్వాగ్ స్పెషాలిటీ. ఇప్పుడు సరిగ్గా అదే బ్యాటింగ్ స్టైల్‌తో సెహ్వాగ్ పెద్ద కుమారుడు ఆర్యవీర్ సెహ్వాగ్ భారత క్రికెట్ రంగంలో సరికొత్త సంచలనంగా మారాడు. ఇటీవల ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో జరిగిన వన్డే సిరీస్‌లో ఆర్యవీర్ అద్భుతమైన ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు.
మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో తన తండ్రిని గుర్తుకుతెచ్చేలా మెరుపు ఆరంభాలను ఇస్తూ.. మొత్తం 109 పరుగులు చేసి భారత్ 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. తన కుమారుడి సంచలన ఎంట్రీ మరియు క్రికెట్ కెరీర్‌పై వీరేంద్ర సెహ్వాగ్ ఎన్డీటీవీ (NDTV) కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఆర్యవీర్ అండర్-19 జట్టుకు ఎంపికైనప్పుడు తండ్రిగా తాను ఎంతో గర్వపడ్డానని చెప్పారు. అయితే సెహ్వాగ్ కుమారుడిగా జట్టులోకి రావడం వల్ల అతనిపై ఉండే సామాజిక ఒత్తిడిని ఎలా అధిగమించాలో తాను ముందే ఒక విలువైన సలహా ఇచ్చానని వీరూ వెల్లడించారు.
“ఒత్తిడి ఖచ్చితంగా ఉంటుంది.. కానీ మైదానంలోకి వెళ్లాక ఎలాంటి భయాలు లేకుండా స్వేచ్ఛగా నీ సహజసిద్ధమైన ఆటను ప్రదర్శించు. పెద్ద ఇన్నింగ్స్‌లు ఆడాలనే ఆందోళనతో క్రీజులోకి వెళ్లొద్దు. ఒత్తిడి లేకుండా నీ శైలిలో నువ్వు ఆడుకుంటూ పోతే.. భారీ పరుగులు అవే వస్తాయి” అని కొడుక్కి ధైర్యం చెప్పినట్లు సెహ్వాగ్ పేర్కొన్నారు. దీనితో పాటు, సోషల్ మీడియా యుగంలో ఆటగాళ్లపై వచ్చే విమర్శలు, ట్రోలింగ్స్ గురించి కూడా కొడుకును ముందే అప్రమత్తం చేశానని వీరూ చెప్పారు.
“నువ్వు బాగా ఆడినప్పుడు ప్రజలు నిన్ను విపరీతంగా ప్రేమిస్తారు.. అదే ఫెయిల్ అయినప్పుడు అంతే దారుణంగా విమర్శిస్తారు, అసహ్యించుకుంటారు. కానీ బయట జనం మాట్లాడే మాటలపై నువ్వు ఎప్పుడూ రియాక్ట్ అవ్వకూడదు. నీ ప్రాసెస్, నీ ప్రాక్టీస్, నీ స్కిల్స్ మీద మాత్రమే దృష్టి పెట్టు. వాళ్లు ఏమైనా అనుకోనీ.. నీ ఆట నీదే” అని ఆర్యవీర్‌కు హితబోధ చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం 18 ఏళ్ల వయసున్న ఆర్యవీర్, ఢిల్లీ అండర్-19 తరఫున ఆడేటప్పుడు కూడా ఒడిదొడుకులు ఎదురైనా తన సలహాను పాటిస్తూ ఎంతో పరిణతితో వ్యవహరించడం చూసి ఒక తండ్రిగా తనకు చాలా సంతోషంగా ఉందని సెహ్వాగ్ ముగించారు.








