కంపెనీలో అసలైన ‘బాస్’ ఎవరో చెప్పే 3 సీక్రెట్ సిగ్నల్స్!
ఒక కంపెనీలో నిజంగా పవర్ ఎవరి చేతిలో ఉందో చెప్పమంటే మనకు సాధారణంగా హోదా, పొజిషన్ మాత్రమే గుర్తుకొస్తాయి. కంపెనీ CEO, మేనేజింగ్ డైరెక్టర్, వైస్ ప్రెసిడెంట్ లేదా మీటింగ్‌లో అత్యంత ఖరీదైన వాచ్ ధరించి గంభీరంగా కూర్చున్న వ్యక్తి పవర్ ఫుల్ అనుకుంటాం. కానీ కార్పొరేట్ ప్రపంచంలో ఒక విచిత్రమైన నిజం ఉంది.
పవర్ అనేది ఎప్పుడూ తనను తాను బిగ్గరగా పరిచయం చేసుకోదు, బిజినెస్ కార్డ్‌పై విజిబుల్‌గా ముద్రించబడదు. చివరికి అది ఆఫీసులో అందరికంటే పెద్ద క్యాబిన్‌లోనే కూర్చుని ఉండాలని రూల్ కూడా ఏమీ లేదు. చాలా సందర్భాల్లో ఆ పవర్.. ఒక వ్యక్తి మాట్లాడటానికి సరిగ్గా ముందర, ఆ మీటింగ్ రూమ్‌లో ఆవరించే ఒక చిన్న నిశ్శబ్దంలో దాగి ఉంటుంది.
ఎక్కడ ఆగింది
ఒక సోమవారం ఉదయం జరిగే కార్పొరేట్ దృశ్యాన్ని ఊహించుకోండి. ఒక మల్టీనేషనల్ కంపెనీ కాన్ఫరెన్స్ రూమ్‌లో పొడవైన టేబుల్ చుట్టూ పదకొండు మంది కూర్చున్నారు. బిగ్ స్క్రీన్‌పై క్వార్టర్లీ నంబర్స్ కనిపిస్తున్నాయి. ఒక యంగ్ మేనేజర్ మార్కెట్ ఎక్స్పాన్షన్ గురించి దాదాపు రెండు నెలలు రాత్రింబవళ్లు కష్టపడి సిద్ధం చేసిన ప్రెజెంటేషన్ ఇస్తున్నాడు. అతని స్లైడ్లు చాలా నీట్‌గా ఉన్నాయి, గ్రాఫ్‌లు లాభాలను చూపిస్తున్నాయి. ప్రెజెంటేషన్ పూర్తయ్యాక, తన ప్రపోజల్‌కు అప్రూవల్ కావాలని అడుగుతూ అతనలా మాట్లాడటం ఆపుతాడు.
అక్కడ ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరిస్తుంది. ఎవరూ వెంటనే స్పందించరు. ఆ మేనేజర్ తన బాస్ వైపు చూడగా, ఆ మేనేజర్.. డైరెక్టర్ వైపు చూస్తాడు. డైరెక్టర్ ఏమీ మాట్లాడకుండా సీఎఫ్ఓ వైపు చూస్తాడు. సీఎఫ్ఓ పెద్దగా ఏమీ అనకుండా, కేవలం తన చేతిలో ఉన్న పెన్నును టేబుల్ మీద ఉంచి, “సరే, ఈ నంబర్లను మరోసారి రీవిజిట్ చేద్దాం” అని చాలా క్యాజువల్ గా అంటాడు.
ఆ ఒక్క మాటతో మీటింగ్ ముందుకు సాగిపోతుంది. అక్కడ ప్రపోజల్ పూర్తిగా తిరస్కరించబడలేదు, అలాగని ఓకే కూడా కాలేదు. కానీ ఆ ఒక్క చిన్న క్షణంలో, ఆ కంపెనీ హైరార్కీలో ఎవరికీ కనిపించని ఒక అదృశ్య మ్యాప్ బయటపడింది.
మీటింగ్ రూమ్‌లో పవర్ ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి, ఎవరు ఎక్కువ మాట్లాడుతున్నారో చూడటం కంటే, చివరికి ఎవరి రియాక్షన్ కోసం మిగతావాళ్లంతా ఎదురుచూస్తున్నారో గమనించడమే అత్యంత ముఖ్యం.
నాయకత్వం గురించి చెబుతూ జాన్ సి. మాక్స్వెల్ ఒక మాట అన్నాడు: “Leadership is influence, nothing more, nothing less.” అంటే లీడర్షిప్ అనేది మనం అనుభవించే హోదా కంటే, ఇతరులపై మనం చూపే ‘ఇన్ఫ్లుయెన్స్’ (ప్రభావం) కి ఎక్కువ దగ్గరగా ఉంటుంది. అసలు ఆ ఇన్ఫ్లుయెన్స్ ఆఫీస్ గదుల్లో ఎలా కనిపిస్తుందో ఇప్పుడు వివరంగా చూద్దాం.
మొదటి సిగ్నల్:
ఒక మీటింగ్‌లో ఎవరు గట్టిగా, ఎక్కువగా మాట్లాడుతున్నారో గమనించడం చాలా సులభం, కానీ కొన్నిసార్లు అది మనల్ని తప్పుదారి పట్టిస్తుంది. ఎందుకంటే మాట్లాడటం అనేది కేవలం ఒక ఆక్టివిటీ మాత్రమే, కానీ నిజమైన ఇన్ఫ్లుయెన్స్ అనేది ఒక రియాక్షన్లో కనిపిస్తుంది. ఒక ఎంప్లాయ్ తన ఐడియాను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు గదిలోని మిగతావాళ్లు ఎవరి వైపు చూస్తున్నారు, ఒక సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఏమీ మాట్లాడకుండా కూర్చున్నా అతని ముఖంలో వచ్చే చిన్న మార్పును బట్టి డిస్కషన్ టోన్ మారిపోతుందా, లేదా ఎవరైనా ఒక పాయింట్ చెప్పగానే మిగతావాళ్లంతా ఒకే వ్యక్తి వైపు చూస్తున్నారా అనేది చాలా కీలకమైన విషయం.
మీటింగ్ రూమ్‌లోని పవర్ డైనమిక్స్‌ను సరిగ్గా అర్థం చేసుకోవాలంటే ‘ఎవరు ఎవరిని చూస్తున్నారు’ అనే విషయాన్ని సునిశితంగా గమనించాలి. ఒక కార్పొరేట్ బోర్డు రూమ్‌లో అందరూ లీడర్‌ను చూడరు, లీడర్ ఎవరి రియాక్షన్ కోసం చూస్తున్నాడో ఆ వ్యక్తిని చూస్తుంటారు. ఆఫీసుల్లో అసలైన ఇన్‌ఫోర్మల్ హైరార్కీ మొదలయ్యేది సరిగ్గా అక్కడే.
ఇవి కూడా చదవండి
రెండో సిగ్నల్:
పవర్ అనగానే మనందరికీ ఉండే ఒక పెద్ద అపోహ ఏంటంటే, అది మాట్లాడే అవకాశం అనుకోవడం. కానీ కొన్ని సంస్థల్లో పవర్ అంటే ‘ఏ విషయం గురించి అసలు మాట్లాడకూడదో నిర్ణయించే సామర్థ్యం’ కూడా కావచ్చు. ఒక సాధారణ ప్రపోజల్ మీద పదిహేను నిమిషాల పాటు సుదీర్ఘంగా చర్చ జరుగుతుంది, చిన్న చిన్న విషయాలను కూడా మైక్రోస్కోప్‌లో పెట్టి మరీ విశ్లేషిస్తారు. కానీ ఒక పర్టికులర్, కీలకమైన ప్రశ్న వచ్చినప్పుడు మాత్రం “సరే, దాన్ని ప్రస్తుతానికి పక్కన పెడదాం” అని చెప్పి చాలా చాకచక్యంగా టాపిక్ మార్చేస్తారు. అక్కడ ఉన్నవారెవరూ దానిపై పట్టుబట్టరు, “ఎందుకు పక్కన పెట్టాలి?” అని ప్రశ్నించరు.
ఇది ఒకసారి జరిగితే యాదృచ్ఛికం కావచ్చు, కానీ ప్రతీసారి ఇదే పాటర్న్ రిపీట్ అవుతుంటే మాత్రం దాన్ని తప్పకుండా గమనించాల్సిందే. ఏ టాపిక్ ఎవరి దగ్గర ఆగి, అందరికంటే వేగంగా ముగించబడుతోందో గమనిస్తే అక్కడి పవర్ డైనమిక్స్ అర్థమవుతాయి.
కంపెనీ సంస్కృతిలో కొన్ని విషయాలు అందరూ బయటకు గట్టిగా మాట్లాడతారు, మరికొన్ని విషయాలు నెమ్మదిగా గుసగుసలుగా మాట్లాడతారు. కానీ ఏ విషయాలైతే అసలు మాట్లాడకుండానే నిశ్శబ్దంగా అర్థం చేసుకోబడతాయో, ఆ మూడో కేటగిరీ చాలా ఆసక్తికరమైనది.
మూడో సిగ్నల్:
పవర్‌కు ఉన్న అత్యంత సూక్ష్మమైన, బలమైన రూపం నిశ్శబ్దం. మీటింగ్‌లో ఒక క్లిష్టమైన ప్రశ్న అడిగినప్పుడు వెంటనే సమాధానం రాదు. ఒక సెకన్, రెండు సెకన్లు, మూడు సెకన్ల పాటు గదిలో నిశ్శబ్దం ఆవరిస్తుంది. ఎవరూ కదలరు, ఎవరూ నవ్వరు, కనీసం లాప్టాప్ స్క్రీన్ వైపు కూడా చూడకుండా అందరూ ఒక్కరి వైపు మాత్రమే ఎదురుచూస్తుంటారు. ఇలాంటి నిశ్శబ్దాన్ని చాలామంది ఇబ్బందికరమైన గ్యాప్‌గా భావిస్తారు, కానీ ఒక తెలివైన పరిశీలకుడు దాన్ని ఒక ముఖ్యమైన ఇన్ఫర్మేషన్గా చూస్తాడు.
ఏ మాట తర్వాత ఈ సైలెన్స్ వచ్చింది, ఎవరు మాట్లాడే వరకు ఆ నిశ్శబ్దం కొనసాగింది, ఏ విషయాన్ని ప్రస్తావించినప్పుడు గదిలోని ఎనర్జీ పూర్తిగా మారిపోయింది అనేది నిశితంగా పరిశీలించాలి. కొన్ని సందర్భాల్లో మనం అడిగిన ప్రశ్నకు ఎదుటివారి నుండి వచ్చే సమాధానం కంటే, ఆ క్షణంలో అక్కడ ఏర్పడే నిశ్శబ్దమే ఎక్కువ విషయాలను వెల్లడిస్తుంది.
ఈ మూడు సంకేతాలను అర్థం చేసుకోవడం ఎందుకు ముఖ్యం?
ఏదైనా ఒక ముఖ్యమైన మీటింగ్‌కి వెళ్లే ముందు మనం సాధారణంగా “నేను అక్కడున్న వారిని ఎలా ఇంప్రెస్ చేయాలి?” అనే ఆలోచనలో ఉంటాం. కానీ ఒక ప్రాక్టికల్ గా ఆలోచించే వారు మాత్రం “ఇక్కడ అసలు తీసుకోవాల్సిన నిర్ణయం ఏమిటి?” అని ఆలోచిస్తాడు. మీరు అక్కడ ఏం సాధించాలి, ఏ నిర్ణయాన్ని ఆమోదింపజేసుకోవాలి, దానికి ఆఖరుగా “యెస్” చెప్పగల అసలైన వ్యక్తి ఎవరు అనేది స్పష్టంగా తెలుసుకోవాలి. ముందస్తుగా మీ లక్ష్యాన్ని ఒకే వాక్యంలోకి కుదించుకుని, నిజమైన డిసిషన్-మేకర్‌ను గుర్తించడమే వ్యూహాత్మక ఆలోచనకు మొదటి సూత్రం.
కార్పొరేట్ జీవితంలో చాలా సమయం తప్పుడు వ్యక్తులను ఒప్పించడంలోనే వృథా అవుతుంటుంది. మీరు గదిలో ఉన్న పదిమందినీ మెప్పించడానికి తీవ్రంగా ప్రయత్నించవచ్చు, కానీ ఆఖరి నిర్ణయం తీసుకునేది ఒకే ఒక్కరైనప్పుడు, మిగతా తొమ్మిది మందిని గెలవడం గొప్ప సోషల్ అచీవ్మెంట్ కావచ్చు ఏమో కానీ, బిజినెస్ నిర్ణయం మాత్రం మారదు.
పీటర్ డ్రక్కర్ ఎఫెక్టివ్ ఎగ్జిక్యూటివ్‌ల గురించి రాస్తూ:
“Effective executives do not make a great many decisions. They concentrate on what is important.” అని పేర్కొన్నాడు. అంటే ప్రతి చిన్న విషయాన్ని డిసిషన్గా మార్చుకోవడం గొప్పుతనం కాదు, అసలైన ముఖ్యమైన నిర్ణయం ఏదో గుర్తించడమే నిజమైన సామర్థ్యం. ఇదే సూత్రం మీటింగ్ రూమ్‌కు కూడా వర్తిస్తుంది.
అక్కడ మాట్లాడే ప్రతి మాట ముఖ్యం కాదు, ప్రతి చిన్న అభిప్రాయభేదం ముఖ్యం కాదు, అలాగే అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ డిసిషన్-మేకర్ కానే కారు. అందుకే మీటింగ్ గదిలో ఉండటం అంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ కలిగి ఉండటం కాదు, ఏ ఇన్ఫర్మేషన్ నిజంగా ముఖ్యం అనేది గుర్తించగలగడం.
ఈ విషయాన్నే వారెన్ బఫెట్ కూడా ప్రస్తావిస్తూ… చివరికి మనం ఒక నిర్ణయానికి రా లేని నిరుపయోగమైన విషయాలపై సమయాన్ని వృథా చేయకూడదని అంటాడు.
చివరగా..
కంపెనీలో పవర్‌ను చదవడం అంటే ఆఫీస్ పాలిటిక్స్ నేర్చుకోవడం కాదు. ఇతరులను మానిప్యులేట్ చేయడం అసలే కాదు. ఒక రూమ్‌లో జరుగుతున్న సోషల్ డైనమిక్స్‌ను మరింత జాగ్రత్తగా, నిశితంగా గమనించడం మాత్రమే. అక్కడ ఎవరు ఎవరికి గౌరవం ఇస్తున్నారు, ఎవరి అప్రూవల్ లేకపోతే పని జరగదు, ఎవరి అభ్యంతరాన్ని సీరియస్‌గా తీసుకుంటున్నారు, ఏ విషయం ప్రస్తావనకు వచ్చినప్పుడు ఆ రూమ్‌లో నిశ్శబ్దం ఆవరిస్తోంది వంటి విషయాలను గమనించడం వల్ల మీరు అక్కడ పవర్ ఎవరి చేతిలో ఉంటుందో తెలుసుకుని ముందుకు వెళ్లగలుగుతారు.
— శివ దువ్వూరు








