చిన్న నిర్ణయం… యష్ కు ₹120 కోట్ల నష్టం? ‘Toxic’ డీలో అసలు ట్విస్ట్ ఇదే!
సినిమా కథల్లో వచ్చే ట్విస్టులు,షాక్ లు చూసి అరే..భలే ఉందే మనం ఆశ్చర్యపోతూంటాం. అయితే చాలాసార్లు ఆ ట్విస్ట్ లని మించిన ట్విస్ట్ లు, షాకింగ్ మలుపులు సదరు సినిమా ఆఫీస్ గదుల్లో జరిగే బిజినెస్ డీల్స్లోనే కనిపిస్తుంటాయి. ఇప్పుడు ‘టాక్సిక్’ సినిమా చుట్టూ నడుస్తున్న రచ్చ చూస్తే ఇది నిజమే అనిపిస్తుంది. థియేటర్లలో బొమ్మ పడకముందే అక్కడొక పెద్ద కథే జరిగింది.
‘KGF’ దెబ్బకి యష్ రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. దానికి తోడు గీతూ మోహన్‌దాస్ డైరెక్షన్. ఇంకేముంది, ‘టాక్సిక్’ మీద అంచనాలు ఆకాశాన్ని తాకాయి. అసలు సినిమా ఎలా ఉందో, జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారో కూడా తెలీకుండానే మార్కెట్లో విపరీతమైన క్రేజ్ వచ్చేసింది. ఆ టైమ్‌లోనే ఒక పెద్ద అమెరికన్ OTT సంస్థ ‘టాక్సిక్’ డిజిటల్ రైట్స్ కోసం ఏకంగా ₹150 కోట్లు ఇస్తామని ముందుకు వచ్చిందట.
కానీ అక్కడే అసలు కథ మొదలైంది. “ఇప్పుడే ఎందుకు? సినిమా రిలీజ్ అయ్యాక బ్లాక్‌బస్టర్ అయితే ఇంకా పెద్ద డీల్ మాట్లాడొచ్చు కదా” అని మేకర్స్ ఆ ఆఫర్‌ని కాస్త పక్కన పెట్టి వెయిట్ చేశారు. ఆ మేకర్స్ లో ఒకరు యష్.యష్ ఈ సినిమాకు కేవలం హీరోగానే ఉండిపోలేదు. సహ నిర్మాతగానూ ఉన్నారు. దాంతో తన డబ్బు రికవరీ కోసం ఈ సినిమా డిజిటల్ రైట్స్ తన దగ్గరే పెట్టుకున్నారని వినికిడి. అదే దెబ్బకొట్టిందని ట్రేడ్ అంటోంది. ₹150 కోట్లు ఆఫర్ వచ్చినప్పుడు …ముందుకు వెళ్లకుండా ఆపాడని అంటున్నారు.
మూమూలుగా ఆలోచిస్తే యష్ ఆలోచనలో తప్పేమీ లేదు. ఓ రూపాయి ఎక్కువ ఆశించటం ఎప్పుడూ మాంచి బిజినెస్ ఐడియానే. సినిమా హిట్ అయితే రేటు ఇంకా పెరుగుతుంది. ఆపచ్చునిటీ ఉన్న చోటే రిస్క్ కూడా ఉంటుంది. లెక్కల్లో ఊహించని తేడా వస్తేనే అసలు తిరకాసు మొదలవుతుంది. అనుకున్నట్లే జరిగింది, థియేటర్లలో సినిమా అటూఇటూ అయ్యింది. మార్నింగ్ షోకే డిజాస్టర్ అయ్యింది. ₹800 కోట్ల దాకా రాబట్టాల్సిన సినిమా, చివరికి ₹300 కోట్ల దగ్గరే ఆగిపోయింది.
ఇవి కూడా చదవండి
ఆ ఇంపాక్ట్ OTT దగ్గర కనపడింది. థియేటర్లలో సీన్ రివర్స్ అయ్యేసరికి, అప్పటిదాకా ₹150 కోట్లు ఉన్న డిజిటల్ వ్యాల్యూ ఒక్కసారిగా ₹30 కోట్లకు పడిపోయిందని టాక్. అంటే, రిలీజ్‌కి ముందు ఉన్న ఆఫర్‌కి, ఇప్పుడు ఉన్న వ్యాల్యూకి మధ్య తేడా అక్షరాలా ₹120 కోట్లు!
కేవలం “ఇంకాస్త ఆగితే ఎక్కువ వస్తుంది” అని తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం, ఇప్పుడు ₹120 కోట్ల నష్టపోయిన అవకాశంగా మారి కూర్చుంది. (అయితే ఇది కేవలం మార్కెట్ రేట్లలో వచ్చిన తేడా మాత్రమే, యష్ సొంత జేబులోంచి పోయిన డబ్బు కాదు).
ఏదేమైనా, సినిమా బిజినెస్‌లో “వెయిటింగ్” అనే పదానికి కూడా చాలా పెద్ద ధర ఉంటుందని ఈ కథ నిరూపించింది. ప్రస్తుతం ఈ సినిమా ZEE5 లో ఓటీటీ స్ట్రీమింగ్కి వచ్చేసింది. మరి ఇక్కడైనా సీన్ మారుతుందో లేదో చూడాలి. ఏది ఏమైనా, ‘టాక్సిక్’ అసలు ట్విస్ట్ క్లైమాక్స్‌లో లేదు… రిలీజ్‌కి ముందు తీసుకున్న ఆ ఒక్క ₹120 కోట్ల నిర్ణయంలోనే ఉంది!
—సూర్య ప్రకాష్ జోశ్యుల








