డేటింగ్ యాప్స్‌తో అసలు సమస్య ఇదే.?? అందుకే ఎవరూ సెట్ అవ్వడం లేదా ? !
“ప్రేమకు ఒకప్పుడు అదృష్టం అవసరమయ్యేది. ఇప్పుడు అల్గారిథమ్ అవసరమైంది. అయినా అదృష్టమే ఇంకా గెలుస్తోంది.”
అవును…ఒకప్పుడు ప్రేమలో పడటానికి మనిషికి పెద్దగా ప్రణాళిక అవసరం ఉండేది కాదు. ఎవరైనా మీకు నచ్చితే, ముందుగా వారి గురించి తెలుసుకునేవారు. స్నేహితుల ద్వారా పరిచయం అయ్యేవారు. బంధువుల ఇంట్లో కలిసేవారు. కాలేజీలో పరిచయం అయ్యేది. ఆఫీసులో మాట్లాడటం మొదలయ్యేది. ఒకరి గురించి ఇంకొకరు తెలుసుకునే కొద్దీ, సంబంధం ముందుకు వెళ్లేది. అంటే డేటింగ్ అనేది ఒక ప్రక్రియ.
మరి ఇప్పుడు..
మన చేతిలో ఫోన్ ఉంది. అందులో వేలాది ముఖాలు ఉన్నాయి. ఒకరిని ఇష్టపడటానికి కుడివైపు స్వైప్ చేయాలి. నచ్చకపోతే ఎడమవైపు. కొన్ని సెకన్లలో ఒక మనిషి మన జీవితంలోకి రావచ్చు. మరికొన్ని సెకన్లలో బయటకు వెళ్లిపోవచ్చు. ఇదే డేటింగ్ యాప్స్ మన జీవితాల్లోకి తీసుకొచ్చిన అసలు మార్పు. అవి మనకు మనుషులను కలిసే అవకాశాలను పెంచాయి. అయితే అదే సమయంలో అవి మనిషిని ఒక “ఎంపిక”గా చూడటం కూడా నేర్పించాయి. ఇదే ఇప్పుడు డేటింగ్ ప్రపంచం ఎదుర్కొంటున్న విచిత్రమైన సమస్య.
అసలు Dating అంటే ఏమిటి?
డేటింగ్ అనే పదాన్ని మనం చాలా సాధారణంగా ఉపయోగిస్తాం. కానీ దాని వెనుక ఉన్న ఆలోచన చాలా సింపుల్. ఒక వ్యక్తిని తెలుసుకోవడానికి కలిసి సమయం గడపడం. అవతలి వ్యక్తి ఎలా మాట్లాడతారు? ఎలా ఆలోచిస్తారు? ఇతరులతో ఎలా ప్రవర్తిస్తారు? మనతో ఉన్నప్పుడు మనకు ఎలా అనిపిస్తుంది? వాళ్ల విలువలు మనవాటికి దగ్గరగా ఉన్నాయా? ఇలాంటి విషయాలు ఒక్క గంటలో పూర్తిగా తెలియవు.
అందుకే డేటింగ్‌కు ఒక సహజమైన లక్షణం ఉంది.
మొదటి పరిచయం. మళ్లీ కలవడం. మాట్లాడటం. కొంచెం దగ్గరవడం. మరో సందర్భంలో కలవడం. అలా ఒక వ్యక్తి మనకు సరిపోతాడా లేదా అనేది క్రమంగా అర్థమవుతుంది. ఒకప్పుడు ఈ ప్రక్రియలో కుటుంబం, స్నేహితులు, సామాజిక వర్గాలు కూడా భాగమయ్యేవి. అంటే ప్రేమను వెతకడం అప్పట్లో పూర్తిగా ఒంటరి పని కాదు. అది ఒక సామాజిక అనుభవం.
మరి డేటింగ్ యాప్స్ ఎందుకు వచ్చాయి?
ఇక్కడే ఆధునిక జీవితంలోని మరో మార్పు మొదలైంది. నగరాలు పెరిగాయి. ఉద్యోగాల కోసం మనుషులు తమ ఊర్లను వదిలి వేరే నగరాలకు వెళ్లారు. కొత్త నగరంలో మన కుటుంబం ఉండకపోవచ్చు. చిన్నప్పటి స్నేహితులు ఉండకపోవచ్చు. మనకు తెలిసిన వాళ్ల వలయం కూడా పరిమితమే.
హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్న ఒక యువకుడికి తన ఊర్లో ఉన్నట్టు పెద్ద కుటుంబ పరిచయ వలయం ఉండకపోవచ్చు. బెంగళూరులో ఉద్యోగం చేస్తున్న ఒక యువతికి తన కాలేజీ ఫ్రెండ్స్‌లో చాలామంది వేరే నగరాల్లో ఉండొచ్చు. ఇలాంటి జీవితంలో సహజంగా పరిచయాలు ఏర్పడే అవకాశాలు తగ్గుతాయి.
అక్కడ టెక్నాలజీ ఒక సులభమైన పరిష్కారం చూపించింది. “మీ చుట్టూ మీకు సరిపోయే వ్యక్తులు కనిపించడం లేదా? మీ కోసం వాళ్లను వెతికి చూపిస్తాం.” ఇదే డేటింగ్ యాప్స్ ఇచ్చిన వాగ్దానం. అది నిజంగా ఒక ఉపయోగకరమైన ఆలోచనే.
మీకు తెలిసిన ప్రపంచం కొన్ని పదుల మందికి పరిమితమైతే, యాప్ మీ ముందుకు వేలాది మందిని తీసుకురాగలదు. మీకు ఒక నగరంలో పరిచయాలు లేకపోయినా, ఒక స్వైప్‌తో కొత్త వ్యక్తిని కలవచ్చు. ఈ కోణంలో చూస్తే డేటింగ్ యాప్స్ ఒక నిజమైన సమస్యను పరిష్కరించాయి.
కానీ అదే సమయంలో మరో సమస్యకు తలుపు తీశాయి. ఒక మనిషి నుంచి ఒక ప్రొఫైల్‌కి డేటింగ్ యాప్ తెరిచినప్పుడు మనకు మొదట కనిపించేది ఒక మనిషి కాదు. ఒక ప్రొఫైల్. ఫొటో. పేరు. వయసు. ఉద్యోగం. కొన్ని హాబీలు. కొన్ని పదాలు. అంతే. మనకు తెలియని వ్యక్తిని కొన్ని సెకన్లలో అంచనా వేయాల్సి ఉంటుంది.
ఫొటో నచ్చిందా? స్వైప్. నచ్చలేదా? తర్వాతి వ్యక్తి. ఇక్కడే ప్రేమలో ఒక ముఖ్యమైన మార్పు వచ్చింది. ఒక వ్యక్తిని తెలుసుకునే ముందు… వాళ్లని ఎంపిక చేయాలా వద్దా అని నిర్ణయించాల్సి వస్తోంది.
ఇవి కూడా చదవండి
షాపింగ్‌లో పనిచేసే పద్ధతి… ప్రేమలో పనిచేస్తుందా?
మీరు మొబైల్ కొనాలంటే ఏం చేస్తారు? మోడల్స్ చూస్తారు. స్పెసిఫికేషన్స్ పోల్చుతారు. కెమెరా చూస్తారు. బ్యాటరీ చూస్తారు. ధర చూస్తారు. రివ్యూలు చదువుతారు. చివరికి మీకు నచ్చినది ఎంచుకుంటారు. ఎందుకంటే మొబైల్ ఒక ప్రొడక్ట్. కానీ డేటింగ్ యాప్‌లో మనం చూసేది ఒక మనిషి. అయినా మన మెదడు కొన్నిసార్లు అదే పోలిక పద్ధతిని అక్కడ కూడా ఉపయోగిస్తుంది.
“ఈ వ్యక్తి బాగున్నాడు.” కానీ… “ఇంకా పొడవైన వ్యక్తి దొరికితే?”, “ఇంకా మంచి ఉద్యోగం ఉన్న వ్యక్తి ఉంటే?”, “ఇంకా అందంగా ఉన్న అమ్మాయి దొరికితే?”, “ఇంకా నా ఆలోచనలకు దగ్గరగా ఉన్న వ్యక్తి ఉంటే?” అలా ఒక వ్యక్తిని ఇష్టపడటం కంటే, మరో మంచి ఎంపిక కోసం వెతకడం పెద్దదైపోతుంది. అసలు సమస్య ఇక్కడే మొదలవుతుంది
ముంబైలోని హై-ఎండ్ మ్యాచ్‌మేకింగ్ సంస్థను వాడుతున్న అవినాష్ కథ దీనికి ఒక అసాధారణ ఉదాహరణ. అతను ప్రేమ కోసం వేల రూపాయలు ఖర్చు చేశాడు. సుమారు 40 మొదటి డేట్లు చేశాడు. 20 రెండో డేట్లు కూడా జరిగాయి. కానీ ఒక సంబంధం మాత్రమే ముందుకు వెళ్లింది.
అతను తనకు కావాల్సిన భాగస్వామి లక్షణాలను కూడా చాలా వివరంగా రాసుకున్నాడు.వయస్సు, వృత్తి, చదువు, కుటుంబం,వ్యక్తిత్వం, అందం వంటివి. ఇలా ఏకంగా Excel spreadsheet తయారు చేశాడు.ఇవన్నీ చూసి “అతను చాలా ఎక్కువగా ఆశిస్తున్నాడు” అని చెప్పడం సులభం.
అయితే మనలో చాలా మంది ఇప్పుడు అదే స్థాయిలో ఇదే ఆలోచిస్తున్నాం. Excel ఉండకపోవచ్చు. కానీ మన తలలో ఒక checklist ఉంటుంది. “స్పార్క్ లేదు” అనే కొత్త సమస్య. అందుకే డేటింగ్ యాప్స్‌లో ఒక వ్యక్తిని కలవడం సులభమైంది. కానీ ఒకరితో రెండోసారి కలవడానికి మనం సిద్ధపడటం కష్టమవుతోంది.
ఎందుకంటే మొదటి డేట్ నుంచే మనం చాలా పెద్ద ప్రశ్నకు సమాధానం వెతుకుతున్నాం. ఇంతేనా, “ఇతనేనా?”. అయితే ఒక మనిషిని మొదటి గంటలో చూసి ఆ ప్రశ్నకు సమాధానం ఎలా వస్తుంది? అని ఆలోచించటం లేదు. అందుకే చాలా డేట్లు ఒకే వాక్యంతో ముగుస్తాయి: “అతను/ఆమె చాలా బాగున్నారు… కానీ స్పార్క్ అనిపించలేదు.” చివరకు మొదటి డేట్ ఇప్పుడు ఇంటర్వ్యూ అయిపోయింది. అలాగే మన అంచనాలు కూడా పెరిగాయి.
అందుకు కారణం డేటింగ్ యాప్స్ మనకు ఎక్కువ మంది వ్యక్తులను చూపించాయి. అదే సమయంలో మనకు ఒక ప్రమాదకరమైన భావనను కూడా ఇచ్చాయి: “నా కోసం ఎక్కడో ఒక పర్ఫెక్ట్ వ్యక్తి ఉన్నాడు.వెతుకుదాం” అని. చిన్న విషయానికి కూడా సర్దుబాటు,రాజీ పడటం లేదు. అందుకే ఒక వ్యక్తిలో చిన్న లోపం కనిపించినప్పుడు మనం సర్దుకుపోవడం గురించి ఆలోచించం.
తర్వాతి ప్రొఫైల్‌కి వెళ్తాం అనేస్తున్నారు.
డేటింగ్ యాప్స్ పూర్తిగా విఫలమయ్యాయా
ఇప్పటికీ అమెరికాలో, మన ఇండియాలో , చాలా దేశాల్లో కొంతమంది తమ భాగస్వాములను యాప్స్ ద్వారా కలుస్తున్నారు; కథనంలో ఉదహరించిన పరిశోధన ప్రకారం సుమారు పది మందిలో ఒకరు తమ భాగస్వామిని ఆన్లైన్ డేటింగ్ ద్వారా కలుస్తున్నారు.
ఫైనల్ గా..
“ఎంపికలు పెరిగినప్పుడు ప్రేమ సులభమవుతుందని మనం అనుకున్నాం. కానీ మనిషి హృదయం షాపింగ్ కార్ట్ కాదని మర్చిపోయాం.”
—సూర్య ప్రకాష్ జోశ్యుల








