సాయికృష్ణ లాకప్ డెత్ కేసు..సుప్రీంకోర్టు కీలక నిర్ణయం..!
ఆంధ్రప్రదేశ్లో తీవ్ర సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసు వ్యవహారం ఇప్పుడు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు(Supreme Court) చేరింది. ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో గురువారం కీలక విచారణ జరిగింది. ఏపీ హైకోర్టులో ఈ వ్యవహారంపై దాఖలైన ‘హెబియస్ కార్పస్’ పిటిషన్పై విచారణ ఇప్పటికే పూర్తి కావడం, న్యాయస్థానం తన తీర్పును రిజర్వ్ చేసిన నేపథ్యంలో.. సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. హైకోర్టు తుది తీర్పు వెల్లడించిన తర్వాతే తాము ఈ కేసును విచారిస్తామని పేర్కొంటూ.. తదుపరి విచారణను అక్టోబర్ 26కు వాయిదా వేసింది.
గాదె సాయికృష్ణను పోలీసులు అక్రమంగా నిర్బంధించి, కస్టడీలో థర్డ్ డిగ్రీ ప్రయోగించడం వల్లే మరణించాడంటూ బాధితుడి కుటుంబ సభ్యులు, వైఎస్సార్సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి. పోలీసుల అక్రమ అదుపును సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో ‘హెబియస్ కార్పస్’ పిటిషన్ దాఖలైంది. దీనిపై సుదీర్ఘంగా వాదనలు విన్న హైకోర్టు బెంచ్.. విచారణను పూర్తి చేసి, తీర్పును రిజర్వ్ లో పెట్టింది. హైకోర్టు తీర్పు పెండింగ్లో ఉన్నందున, సుప్రీంకోర్టు ప్రస్తుతానికి ఈ కేసులో ఎలాంటి జోక్యం చేసుకోకుండా విచారణను వాయిదా వేయడమే సరైనదని భావించింది.
ఇవి కూడా చదవండి
ఏపీ హైకోర్టు ఇచ్చే తీర్పు ఆధారంగానే సుప్రీంకోర్టులో తదుపరి విచారణ ప్రక్రియ ముందుకు సాగనుంది. రక్షించాల్సిన పోలీసులే ప్రాణాలు తీశారనే ఆరోపణలు రావడంతో.. రాబోయే రోజుల్లో హైకోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వబోతోంది, అక్టోబర్ 26న సుప్రీంకోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేయబోతోందనే దానిపై ఇప్పుడు న్యాయ, రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇక ఈ కేసులో సిఐ నాగరాజు, ఆయన సన్నిహితులు రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే.








