శాప్ ఆఫీస్ ముట్టడి కేసులో అప్పుడే బెయిల్..!
విజయవాడలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (SAAP) కార్యాలయం వద్ద వైఎస్సార్సీపీ(YSRCP) నిర్వహించిన ఆందోళన కార్యక్రమానికి సంబంధించిన కేసులో న్యాయస్థానం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఘర్షణల ఉదంతంలో మాచవరం పోలీసులు అరెస్ట్ చేసిన నిందితులకు బెయిల్, రిమాండ్ విధిస్తూ విజయవాడ కోర్టు తీర్పునిచ్చింది. మెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాలపై విచారణ జరపాలనే డిమాండ్‌తో వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు విజయవాడలోని శాప్ కార్యాలయాన్ని ముట్టడించిన సంగతి తెలిసిందే.
ఈ నిరసన కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీయడం, ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలు రావడంతో మాచవరం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు మొత్తం 30 మందిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నిందితులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వైద్య పరీక్షలు పూర్తి చేసి, గట్టి భద్రత నడుమ కోర్టులో హాజరుపరిచారు. పోలీసులు సమర్పించిన రిమాండ్ రిపోర్టును, ఇరుపక్షాల న్యాయవాదుల వాదనలను పరిశీలించిన న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది.
పట్టుబడిన నిందితులలో 28 మందికి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అయితే, ఈ ఘర్షణల్లో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజశేఖర్, చెన్నారావు అనే ఇద్దరు నిందితులకు మాత్రం కోర్టు రిమాండ్ విధించింది. రిమాండ్ ఖరారైన ఇద్దరిని పోలీసులు జైలుకు తరలించగా, బెయిల్ పొందిన మిగిలిన 28 మంది విడుదలయ్యారు. ఈ కేసుపై పోలీసులు తదుపరి దర్యాప్తును కొనసాగిస్తున్నారు. ఈ కేసులో మరికొందరిని అరెస్ట్ చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. అలాగే మొత్తం 51 మందిపై రౌడీ షీట్ ఓపెన్ చేయాలని విజయవాడ కమీషనర్ ఆదేశాలు జారీ చేయడం సంచలనంగా మారింది.








