సేవలో పరిమళిస్తున్న నెబ్రాస్కా తెలుగు సమితి
Siena Francis లో విజయవంతంగా ‘Feed the Need’ కార్యక్రమాన్ని నిర్వహించిన TSN యువత
ఒమాహా: సేవ అంటే కేవలం అవసరంలో ఉన్నవారికి చేయూతనివ్వడం మాత్రమే కాదు… వారి స్థితిగతులను అర్థం చేసుకుని, స్పందించే మనసును పెంపొందించుకోవడం కూడా. ఈ భావనను యువతకు ప్రత్యక్ష అనుభవం ద్వారా పరిచయం చేయాలనే లక్ష్యంతో తెలుగు సమితి ఆఫ్ నెబ్రాస్కా (TSN) ఆధ్వర్యంలో సెప్టెంబర్ 19న ఒమాహా నగరంలోని Siena Francisలో నిర్వహించిన “Feed the Need – Youth Charity & Food Drive” కార్యక్రమం స్ఫూర్తిదాయకంగా, విజయవంతంగా జరిగింది.
తెలుగు సమితి ఆఫ్ నెబ్రాస్కా ప్రస్తుత అధ్యక్షులు కొల్లి గారు, Charity Committee Chair ధనారావు గొట్టిపాటి గారితో కలిసి ఈ కార్యక్రమానికి నాంది పలికారు. Community Committee Chair అవినాష్ గారు, TSN Executive Committee సభ్యుల సహకారంతో కార్యక్రమాన్ని సమన్వయం చేశారు. యువత, వారి కుటుంబ సభ్యులు ఉత్సాహంగా పాల్గొని అవసరంలో ఉన్న వారికి భోజనం అందించారు.
ఈ కార్యక్రమాన్ని కేవలం భోజన సేవకే పరిమితం చేయకుండా, యువతకు అక్కడి జీవన పరిస్థితులపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక పర్యటనను కూడా ఏర్పాటు చేశారు. ఇందుకోసం TSN అధ్యక్షులు కొల్లి గారు Siena Francis House Chair Mrs. Lilly గారితో ప్రత్యేకంగా మాట్లాడి యువత కోసం facility tour ఏర్పాటు చేశారు. ఈ సందర్శన యువతకు ఎందుకు ముఖ్యమో వివరించడంతో, Mrs. Lilly గారు సానుకూలంగా స్పందించి అందుకు అవకాశం కల్పించారు.
ఈ పర్యటనలో యువత, మహిళలు మరియు పురుషుల కోసం ఏర్పాటు చేసిన shelter విభాగాలతో పాటు నివాస ప్రాంతాలు, laundry facilities తదితర సదుపాయాలను సందర్శించింది. అక్కడ ఆశ్రయం పొందుతున్న వారి రోజువారీ జీవన విధానాన్ని దగ్గరగా గమనించడం ద్వారా సమాజంలోని మరో కోణాన్ని తెలుసుకునే అవకాశం వారికి లభించింది. తరగతి గదిలో తెలుసుకునే విషయాలకు భిన్నంగా, జీవితంలోని వాస్తవ పరిస్థితులను ప్రత్యక్షంగా చూడటం వారిలో లోతైన ఆలోచనకు దారితీసింది.
ఇవి కూడా చదవండి
సందర్శన అనంతరం యువత పంచుకున్న అనుభూతులు ఈ కార్యక్రమం వెనుక ఉన్న అసలు ఉద్దేశాన్ని స్పష్టంగా ప్రతిబింబింపజేశాయి. తమకు తల్లిదండ్రులు, కుటుంబం, తిరిగి వెళ్లేందుకు ఒక ఇల్లు ఉండటం ఎంత విలువైనదో వారు గుర్తించారు. నిత్యజీవితంలో సహజంగా భావించే ఎన్నో సౌకర్యాలు, అవకాశాలు అందరికీ లభించవనే వాస్తవాన్ని తెలుసుకోవడం వారిలో కృతజ్ఞతా భావాన్ని కలిగించింది.
ఈ సందర్భంగా ఒక యువ వాలంటీర్ చెప్పిన మాట అక్కడున్న వారందరినీ కదిలించింది. “నేను పెద్దయ్యాక, వీరు అనుభవిస్తున్న బాధలో కొంతైనా తగ్గించగల పరిష్కారాన్ని కనుగొనాలని ఉంది” అని చెప్పడం మిగతా యువతలోనూ కొత్త ఆలోచనకు నాంది పలికింది. ఒక కార్యక్రమం ముగిసినప్పుడు కాదు… దాని ఆశయం మనసులను తాకి, ఆలోచనల్లో మార్పుకు నాంది పలికినప్పుడే అది నిజమైన విజయం అనే భావనకు ఈ స్పందన నిదర్శనంగా నిలిచింది.
తెలుగు సమితి ఆఫ్ నెబ్రాస్కా కేవలం తెలుగు భాష, సంస్కృతి, ఆచారాలు, సంప్రదాయాలను భావితరాలకు అందించడమే కాకుండా, యువతలో సేవాభావం, సానుభూతి, కృతజ్ఞత, సామాజిక బాధ్యత వంటి మానవీయ విలువలను పెంపొందించేందుకు కూడా ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోంది. ‘Feed the Need’ వంటి కార్యక్రమాల ద్వారా సమాజంలోని భిన్న జీవన పరిస్థితులను యువతకు పరిచయం చేస్తూ, తోటి మనిషి పట్ల స్పందించే హృదయాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తోంది.
ఈ స్ఫూర్తిని కొనసాగిస్తూ ప్రతి త్రైమాసికంలో అర్థవంతమైన సామాజిక సేవా కార్యక్రమాలను చేపట్టి, వాటిని TSN సంప్రదాయంలో భాగంగా కొనసాగించాలనే ఆకాంక్షను నిర్వాహకులు వ్యక్తం చేశారు. మరింత మంది యువతను ఇటువంటి కార్యక్రమాల్లో భాగస్వాములను చేస్తూ, సేవా దృక్పథాన్ని భావితరాలకు అందించాలన్నది వారి సంకల్పం.
ఈ కార్యక్రమం అందించిన స్ఫూర్తి ఒక్కరోజుతో ముగిసిపోకుండా, పాల్గొన్న ప్రతి ఒక్కరిలో సేవాభావంగా కొనసాగాలన్నదే దీని అంతరార్థం. సంఘసేవ కోసం వేదనపడాలి… పరిపూర్ణ శక్తివంతులుగా ఎదగాలి. ‘Feed the Need’ కార్యక్రమం ద్వారా TSN యువతలో ఆ సేవా స్ఫూర్తి ఆవిర్భవించాలి. మన ఎదుగుదలతో పాటు మరొకరి జీవితంలో చిన్న మార్పుకైనా మనం కారణం కాగలిగితే, అప్పుడే మన జీవితానికి నిజమైన సార్థకత చేకూరుతుంది. సేవను ఒకరోజు కార్యక్రమంగా కాకుండా, జీవితాంతం కొనసాగించే విలువగా స్వీకరించాలనే సందేశాన్ని తెలుగు సమితి ఆఫ్ నెబ్రాస్కా ఈ కార్యక్రమం ద్వారా అందించింది.








